మట్టి మాఫియా పై చర్యలేవీ ?

by Sumithra |   ( Updated:2024-11-14 03:06:36.0  )
మట్టి మాఫియా పై చర్యలేవీ ?
X

దిశ, హుజూరాబాద్ : మూడు రోజుల క్రితం పట్టుకున్న మట్టి మాఫియాను కాపాడేందుకు హుజూరాబాద్ లోని అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటయ్యాయి. పట్టుకున్న వాహనాలు సీజ్ చేసి యాజమానుల పై కేసులు నమోదు చేయకుండా కేవలం డ్రైవర్లను బైండోవర్ చేయడం వివాదాస్పదంగా మారింది. 15 మందిలో కేవలం ఆరుగురిని మాత్రమే బైండోవర్ చేయడం వాహనాలను సీజ్ చేయక పోవడంతో మళ్లీ మట్టి మాఫియా రెచ్చిపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మట్టి మాఫియా రోజుకు వందల లారీల మట్టిని తీస్తూ లక్షలు సంపాదిస్తున్న యాజమానులను వదిలి కేవలం డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. హుజురాబాద్ లో మొన్న రెవెన్యూ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు మట్టి తీసే పాండవుల గుట్టకు అధికారులు పోలీసుల సహకారంతో వెళ్లగా అక్కడ 15 టిప్పర్ లు, రెండు జేసీబీలు దొరికాయి.

వాటిని స్టేషన్ ను తరలించేందుకు ప్రయత్నం చేయగా మట్టి మాఫియాకు చెందిన సభ్యులు అధికారులతో వాగ్వివాదం పెట్టుకుని బండ్లతో సహా పారిపోయారు. పోలీసులు కేవలం జేసీబీ, టిప్పర్ ను తీసుకొచ్చి కేసునమోదు చేశారు. వాస్తవానికి ఇక్కడ 15 టిప్పర్ లు, రెండు జేసీబీలతో మట్టి తోడుతున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. మట్టిని తీసిన వాటిలో టీఎస్ 12 యూడి 3777, టీఎస్12 యూడి 6444, టీస్ 12 యుడి 6668, టీఎస్ 12 యుడి 7100, టీఎస్ 12 యూడీ 6777, టీఎస్ 12 యూడీ 7389, టీఎస్ 16 ee 0415, నంబర్ గల టిప్పర్ లతో సహా మరో ఐదు టిప్పర్ లు మట్టిని తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనా స్థలంలో గుర్తించిన టిప్పర్ లతో పాటుగా పారిపోయిన మిగతా ఐదు టిప్పర్ లను గుర్తించాల్సిన అధికారులు పారిపోయిన వారిని గుర్తించాల్సిన విషయం మరిచిపోయి గుర్తించిన వారిపై చర్యలు తీసుకోక పోవడం వివాదాస్పదం అవుతుంది.

కేసును నీరుగార్చేందుకు రాజకీయ పార్టీల యత్నం..

కొన్ని నెలలుగా మట్టి మాఫియా చెలరేగుతూ అధికారులను, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతుంది. సిండికేట్ గా మారి నిత్యం వందల టిప్పర్ లతో పాండవుల గుట్ట నుండి జమ్మికుంట, హుజురాబాద్, శంకరపట్నం, కమలాపూర్, ఎలుక తుర్తి తదితర ప్రాంతాలకు మట్టిని అమ్ముకుంటూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. విషయం పై ఎవరైనా అడిగితే వారి పై దాడులు చేయడానికి సైతం సిద్ధపడతారు. అయినా ఇంత కాలం రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ విషయం పై ఇటీవల కాలంలో ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సైతం చర్యలు తీసుకోవాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు .దీంతో స్పందించిన రెవెన్యూ అధికారులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కేవలం ఒక జేసీబీ, ఒక టిప్పర్ ను పట్టుకుని మిగతా వాటిని వదిలి వేయడం చర్చనీయాంశంగా మారింది.

సెకండ్ స్థాయి క్యాడర్ పాత్ర దారులు..

టిప్పర్ ల ద్వారా మట్టిని తరలిస్తున్న విషయంలో ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు చెందిన సెకండ్ క్యాడర్ నాయకులు సూత్ర దారులుగా మట్టి మాఫియాకు మద్దతు పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరు ఒకవేళ మట్టిని తరలిస్తున్న సమయంలో పోలీసులు గానీ రెవెన్యూ అధికారులు గానీ పట్టుకుంటే తమ రాజకీయ ప్రాబల్యం ఉపయోగించి బండ్లను వినిపించడం వీరి బాధ్యత. ఇక్కడ ఏ పార్టీలకు చెందిన వారైనా అంతా ఒక్కటై పనిచేయడం ఆనవాయితీ. వీరు పొద్దంతా ఎవరి దారిలో వారు ఉన్నా సాయంత్రం మాత్రం అంత ఒక్కదగ్గర చేరి వారి వారి పార్టీల్లో జరిగిన విషయాల పై చర్చించుకున్నారు. ఇక్కడ ఇదే హైలైట్. వీరి సత్సంప్రదాయంతో మట్టి మాఫియా ఎవరికి భయపడకుండా పొద్దంతానే వందల టిప్పర్ తో మట్టి సరఫరా చేస్తారు. లక్షల కొద్దీ సంపాదిస్తున్నారు. వాటాలు పంచుతున్నారు. దీంతో వీరి వ్యాపారం మూడు జేసీబీలు, ఆరు టిప్పర్ లు విరాజిల్లుతుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా లక్షలు సంపాదిస్తున్న మట్టి మాఫియా పై చర్యలు తీసుకునే వారు లేరా అని ప్రశ్నిస్తున్నారు.

సీఐ తిరుమల్ వివరణ..

మట్టి తీస్తున్న పాండవుల గుట్టలో ఒక జేసీబీ, టిప్పర్ దొరికాయని, వారి పై కేసులు పెట్టడం జరిగిందని సీఐ తిరుమల్ తెలిపారు. ఇకనుంచి చట్ట విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అక్రమంగా మట్టి ను తీస్తే తనకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story