- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్‌లో ''ఉగ్ర'' అలజడి.. జిల్లాలో కలకలం రేపిన NIA సోదాలు
రిఫిల్ రీఫిల్లింగ్ పేరుతో ఒకరు.. పిన్నీసులు అమ్ముకునే వేషంలో కొందరు.. రెక్కి కోసం వచ్చి హతమైనదొకరు. నిషేధిత సంస్థలతో అనుభందం ఇప్పుడు ఎక్కడ ఏ ఘటన వెలుగులోకి వచ్చినా ఉమ్మడి కరీంనగర్‌లో మూలాలు వెతకక తప్పడం లేదు. రెండు దశాబ్దాలకు పైగా సాగుతున్న ఉగ్ర ఆనవాళ్లు కరీంనగర్‌ను పతాకశీర్షికన చేర్చుతున్నాయి. విప్లవ పార్టీల ఉనికితోపాటు ఉగ్ర సంస్థలకు షెల్టర్‌గా మారిన ఉమ్మడి జిల్లాలో తాజాగా పీఎఫ్ఐ మూలాలు వెలుగులోకి వచ్చాయి. విప్లవ సంస్థల ఉనికి గణనీయంగా తగ్గిపోయినా విచ్ఛిన్నకర శక్తుల బంధాలు అనుబంధాలు మాత్రం జిల్లాను వీడడం లేదు. కాగా, ఇటీవల నిజామాబాద్‌లో సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి రావడం జగిత్యాల వాసి నిర్వహకుడిగా పోలీసులు గుర్తించడంతో ఉమ్మడి జిల్లా లింకులు మరోసారి బయట పడ్డాయి. జగిత్యాలలో ఏడు చోట్ల కరీంనగర్‌లో ఒక చోట సోదాలు చేపట్టింది. ఆదివారం కరీంనగర్‌లో చేపట్టిన ఈ సోదాల్లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ టీం అతడిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించింది .
- దిశ ప్రతినిధి, కరీంనగర్
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఐఎస్ఐ ఉగ్రవాది ఆజంఘోరీ జగిత్యాల ప్రాంతంలో షెల్టర్ తీసుకుని చాపకింద నీరులా కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు. 1999లో జగిత్యాలలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న ఆజంఘోరీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ప్రతినిధే అయినప్పటికీ ఆయన ఉపాధి కోసం ఇక్కడకు వచ్చినట్టుగా నమ్మించాడు. రిఫిల్స్ రీ ఫిల్లింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్న వాడిలా ఇక్కడకు చేరుకుని ఐఎస్ఐ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టబోయాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పసిగట్టి అతడిపై నిఘా పెట్టడంతో జగిత్యాల నడిబొడ్డున అర్థరాత్రి పోలీసులకు చిక్కి ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు. అప్పటి వరకూ అతడు ఆజంఘోరీ అని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు చెందిన వాడన్న విషయం నర మానవుడికి కూడా తెలియలేదంటే అతడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
2002లో జగిత్యాలలో శ్రీరామయాగం నిర్వహిస్తుండగా అప్పటి కేంద్ర మంత్రి సీహెచ్ విద్యాసాగర్ రావు, చినజీయర్ స్వామితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ సమీపంలోని రేకుర్తి వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కర్ ఏ తోయిబా దక్షిణ భారత ఇన్చార్జీ అజీజ్ హతం అయ్యాడు. జగిత్యాల శ్రీరామయాగానికి హాజరయ్యే ప్రముఖులను హతం చేసేందుకు వెళ్తున్న క్రమంలో ఎన్ కౌంటర్‌లో హతం చేశామని పోలీసులు ప్రకటించారు. గుజరాత్ మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి జగిత్యాల జిల్లాలో షెల్టర్ తీసుకున్నాడన్న విషయం కలకలం రేపింది. గుజరాత్ నుంచి ప్రత్యేకంగా పోలీసు బృందాలు ఇక్కడకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో పెద్దఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత చాలాకాలం చాపకింద నీరులా అంతర్జాతీయ ఉగ్రవాదుల కదలికలు కొనసాగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి.
కరీంనగర్ నడిబొడ్డున జాతీయ నాయకుల ఫోటోలు విక్రయించే వారి వేషంలో, ట్రావెల్ బ్యాగ్స్ అమ్ముకునే వారిగా చెలామణి అయిన వారిని గుర్తించినప్పటికీ నిఘా వర్గాలు తమను గుర్తించాయని తెలిసి అదృశ్యం అయిన ఘటనలూ లేకపోలేదు. 2013లో చొప్పదండి బ్యాంక్ రాబరీ ఘటన అతిపెద్ద ఘటన అని చెప్పొచ్చు. ఉదయం 10గంటలకే అగంతకులు బైక్‌పై బ్యాంక్ లోపలకు చొరబడి మేనేజర్‌ను బెదిరించి డబ్బు ఎత్తుకెళ్లారు. అయితే మొదట వీరు దొంగలుగానే అనుమానించినప్పటికీ అసలు విషయం మాత్రం చాలాకాలం తరువాత వెలుగులోకి వచ్చింది. చొప్పదండి ఎస్‌బీఐలో చోరీకి పాల్పడిన ముఠాకు చెందిన వారు పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ సమీపంలో డెన్ ఏర్పాటు చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రమంలో డెన్‌లో పేలుళ్లు చోటు చేసుకోవడంతో వారు ఘటనా స్థలం నుంచి పరార్ అయ్యారు. దీంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రంగంలోకి దిగడంతో అసలు గుట్టు రట్టయింది. పేలళ్లు సంభవించిన చోట చొప్పదండి బ్యాంకుకు సంబందించిన కరెన్సీ బండిల్స్ లేబుళ్లు లభ్యం కావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్ఐఏ లోతుగా అధ్యయనం చేస్తే విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపిన నలుగురు యువకులను పోలీసులు గుర్తించి మధ్యప్రదేష్‌లోని ఖాండ్వా జైలుకు పంపించారు.
జైలు నుంచి తప్పించుకున్న వీరు కరీంనగర్‌కు చేరుకుని బ్యాంకులను లూటీ చేసే స్కెచ్ వేసి ఆ డబ్బుతో ఉగ్ర కార్యకలాపాలతోపాటు తిరుపతిలో ప్రార్థనా మందిరం పేరుతో స్థలం కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అంతేకాకుండా చొప్పదండి బ్యాంక్ రాబరీకి ముందు వీరు జగిత్యాల ప్రాంతంలోని ఓ మండల కేంద్రంలో పిన్నీసులు, బెలూన్లు అమ్ముకునే వారి వేషంలో సంచరించారు. అక్కడి బ్యాంకు ముందు తచ్చాడుతున్న వీరిపై అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించి జీవనోపాధి కోసం వచ్చిన వారేనని నిర్దారించుకున్న పోలీసులు వారితో ఓ పేపర్ రాయించుకుని వదిలేశారు. పోలీసుల నుంచి బయటకు వచ్చిన వీరు అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని చొప్పదండి సమీపంలోని ఓ గ్రామంలో షెల్టర్ తీసుకుని బ్యాంకు రాబరీకి పాల్పడ్డారు.
అయితే ఈ బ్యాంకు రాబరీ సమయంలో డిజిటల్ వీడియో రికార్డర్ (డీవీఆర్) అనుకుని సీపీయూను ఎత్తుకెళ్లారు. డీవీఆర్‌లో ఉన్న ఉగ్రవాదుల ముఖ కవలికలను ఆధారం చేసుకుని ఎన్ఐఏ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్ స్టేషన్‌లో బందోబస్తు చేస్తున్న పోలీసులపై అగంతకులు కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబండించి ఎన్ కౌంటర్‌లో హతం చేయగా వారిలో ఒకరు చొప్పదండి బ్యాంకు రాబరీలో పాల్గొన్న వ్యక్తి కావడంతో నల్గొండ ఘటనకు పాల్పడింది ఉగ్రవాదులేనని గుర్తించారు. చొప్పదండి బ్యాంకు రాబరీ తర్వాత పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు బైక్‌లను గుర్తించినప్పటికీ అవి ఎవరివో అంతు చిక్కకపోవడంతో పోలీసులు కేసును అలాగే వదిలేశారు.
రౌడీ షీటర్లూ..
ఉగ్ర మూకలే కాకుండా హైదరాబాద్‌కు చెందిన రౌడీ షీటర్ల ఉనికి కూడా కరీంనగర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 2008-09లో కాచిగూడ పోలీస్ స్టేషన్ ముందు కత్తిపోట్లకు పాల్పడిన ఇద్దరు సభ్యులున్న ఘరానా ముఠా కరీంనగర్‌కు చేరుకుంది. అప్పటికే వీరిద్దరిపై హైదరాబాద్‌లోని పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వారి ఆచూకీని పట్టుకునేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ టీం ప్రత్యేకంగా కరీంనగర్‌కు చేరుకుంది. నిందితుల్లో ఒకరు కోరుట్లలో ఎంగేజ్‌మెంట్ చేసుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. రెండు రోజులుగా ఇద్దరు టాస్క్ ఫోర్స్ సీఐల బృందం వీరిని వెంటాడుతూ చివరకు కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యాం క్వార్టర్స్‌లో షెల్టర్ తీసుకున్న వీరిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో తల్వార్‌లతో పోలీసులపై దాడికి యత్నించగా పోలీసులు కాల్పులు జరపడంతో ఓ రౌడీ షీటర్ హతం కావడం సంచలనం కల్గించింది. కరీంనగర్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ జాయింట్ ఆపరేషన్ ద్వారా మెస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్‌ను మట్టుబెట్టారు.
ఇప్పుడు పీఎఫ్ఐ వంతు..
కేరళలో వేళ్లూనికుని ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. దీంతో ఈ సంస్థ కార్యకలాపాలు చాపకింద నీరులా కరీంనగర్‌కు చేరుకున్నాయి. రెండేళ్ల కింద కరీంనగర్ పట్టణంలో పీఎఫ్ఐ సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో నిర్వహకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి వదిలేశారు. అప్పటి నుంచి పీఎఫ్ఐ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కరీంనగర్‌లో సంస్థ ఏమైనా మూవ్ మెంట్ చేస్తోందా అన్న విషయంపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. దీంతో పీఎఫ్ఐ కేరళ టు కరీంనగర్ అన్నట్టుగా మారిపోయిందనే చెప్పాలి.
ఇటీవల నిజామాబాద్‌లో సంస్థ కార్యకలాపాలు వెలుగులోకి రావడం జగిత్యాల వాసి నిర్వాహకుడిగా పోలీసులు గుర్తించడంతో ఉమ్మడి జిల్లా లింకులు మరోసారి బయట పడ్డాయి. జగిత్యాలకు చెందిన నలుగురికి పీఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తించిన ఎన్ఐఏ బృందాలు జగిత్యాలలో ఏడు చోట్ల కరీంనగర్‌లో ఒక చోట సోదాలు చేపట్టింది. ఆదివారం కరీంనగర్‌లో చేపట్టిన ఈ సోదాల్లో ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ టీం అతడిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించింది. అయితే జగిత్యాలలో కూడా సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ బృందాలు కొన్ని చోట్ల డిజిటల్ డివైజ్‌లను, డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జగిత్యాలలోని ఓ ఇంట్లో సోదాలు చేస్తే తమకు ఏమీ లభ్యం కాలేదని ఎన్ఐఏ బృందాలు క్లీన్ చిట్ ఇచ్చాయి.