illegal soil transport : మట్టి రవాణాకు అడ్డేది ?

by Sumithra |
illegal soil transport : మట్టి రవాణాకు అడ్డేది ?
X

హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ శివారులోని పాండవుల గుట్ట నుంచి అధికారుల అండతో మట్టి అక్రమ రవాణా ( Soil smuggling) జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న రంగాపూర్ శివారులోని పాండవుల గుట్ట పై మట్టి క్వారీ ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారు. బహిరంగంగానే మైనింగ్‌ను తలపించేలా మట్టి తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. డీబీఎల్ కంపెనీ ( DBL Company) తీస్తున్న మట్టి క్వారీ నుంచే ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా సహజ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. మట్టిని తరలించడం కోసం జేసీబీల ( JCB) సహాయంతో మట్టిని తోడుతూ వందల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా డీబీఎల్ కంపెనీ వ్యక్తులను బెదిరింపుల గురి చేస్తూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్‌ను తలపించేలా తవ్వకాలు చేపడుతూ మట్టి దందా చేస్తున్నా మట్టి మాఫియాను పట్టించుకునే నాథుడే లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలంలోని రంగాపూర్ శివారులోని పాండవుల గుట్ట నుంచి అధికారుల అండతో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న రంగాపూర్ శివారులోని పాండవుల గుట్ట పై మట్టి క్వారీ ద్వారా పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారు. బహిరంగంగానే మైనింగ్‌ను తలపించేలా మట్టి తవ్వకాలు జరుపుతూ టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. డీబీఎల్ కంపెనీ తీస్తున్న మట్టి క్వారీ నుంచే ఎలాంటి అనుమతులు లేకుండా వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా సహజ సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు.

మైనింగును తలపిస్తున్న తవ్వకాలు..

హుజూరాబాద్ పట్టణానికి అతి సమీపంలో ఉన్న రంగాపూర్ శివారులోని పాండవుల గుట్ట ప్రాంతంలో డీబీఎల్ కంపెనీ గత కొద్దిరోజుల నుంచి మట్టి తీస్తుంది. దీనిని ఆసరా చేసుకుని హుజూరాబాద్, రంగాపూర్, గణేష్ నగర్ ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు మట్టి మాఫీయాగా ఏర్పడి తవ్వకాలు చేపడుతున్నారు. మట్టిని తరలించడం కోసం జేసీబీల సహాయంతో మట్టిని తోడుతూ వందల సంఖ్యలో ప్రైవేటు వ్యక్తులకు సరఫరా చేస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. ఒక్క రూపాయి ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా డీబీఎల్ కంపెనీ వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తూ యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. మైనింగ్‌ను తలపించేలా తవ్వకాలు చేపడుతూ మట్టి దందా చేస్తున్నా మట్టి మాఫియాను పట్టించుకునే నాథుడే లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం..

రంగాపూర్ పాండవుల గుట్టను అడ్డాగా చేసుకొని ఒకవైపు డీబీఎల్ కంపెనీ మరోవైపు మట్టి మాఫియా మట్టిని యథేచ్చగా తరలిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో రెవెన్యూ, పోలీస్ కార్యాలయాల ముందు నుంచే మట్టి టిప్పర్లు మట్టిని తరలిస్తున్నా వారిని కట్టడి చేసే దిశగా ఏ అధికారి చొరవ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందల టిప్పర్ల ద్వారా హుజూరాబాద్, జమ్మికుంట, ఉప్పల్, కమలాపూర్ తదితర ప్రాంతాలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అయినప్పటికీ ఇంతవరకు వారి పై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు అధికారుల వద్దకు మట్టి టిప్పర్ల విషయాన్ని తీసుకెళ్లినా చర్యలు లేకపోవడం శోచనీయం. వీరు మట్టి తరలిస్తున్న ప్రాంతానికి చెందిన కొందరు కాలనీవాసులు టిప్పర్ల శబ్దాలను భరించలేక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా కట్టడి చేయకపోవడంలో అంతర్యం ఏమిటని పట్టణంలో చర్చ జరుగుతోంది.

మట్టిమాఫియాకు అండ ఎవరిది..?

హుజూరాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న పాండవుల గుట్ట నుంచి బాహాటంగానే మట్టి తరలిస్తున్న మట్టిమాఫియాకు అండదండలు ఎవరు అందిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నాయకులా..? లేక అధికారులా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో మట్టిని తరలిస్తున్నా రెవెన్యూశాఖ చూసీచూడనట్లు ఎందుకు వ్యవహరిస్తుందనేది అంతుపట్టని విషయం. అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే మైనింగ్ శాఖ ఏం చేస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అక్రమ మట్టి తవ్వకాల పై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే సమాధానం లేని ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం.. రమణాచారి, మైనింగ్ శాఖ ఏడీ, కరీంనగర్

హుజూరాబాద్ ప్రాంతంలో అక్రమంగా మట్టని తరలిస్తున్నారని ఫిర్యాదులు అందుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుపుతున్న వ్యక్తుల పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం. అక్రమంగా మట్టిని తరలిస్తే డీబీఎల్ కంపెనీ అయినా.. ఇతర వ్యక్తులు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకుని త్వరలోనే అక్రమ మట్టి దందాను కట్టడి చేస్తాం.

Advertisement

Next Story

Most Viewed