మిట్టపల్లి సురేందర్​ vs మ్మెల్యే రసమయి బాలకిషన్​

by Mahesh |   ( Updated:2023-05-20 02:04:54.0  )
మిట్టపల్లి సురేందర్​ vs మ్మెల్యే రసమయి బాలకిషన్​
X

దిశ, కరీంనగర్​ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, గాయకుడైన మిట్టపల్లి సురేందర్​ తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్​, మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ను టార్గట్​‌గా చేస్తున్న ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. కళాకారుడైన రసమయి బాలకిషన్‌పై మరో కళాకారుడు మిట్టపల్లి సురేందర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మిట్టపల్లి మాటలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్​ఎస్ పెద్దల ఆశీస్సులతో సురేందర్​ రసమయిని టార్గెట్​ చేసినట్లు ప్రచారం జరుగుతుండగా వచ్చే ఎన్నికల్లో మానకొండూర్​ బరిలో నిలువడానికే మిట్టపల్లి ఆరోపణలు చేస్తున్నారని చర్చ జరుగుతోంది.

మిట్టపల్లి తీవ్ర ఆరోపణలు..

తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్​, మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్​ను టార్గెట్​ చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, గాయకుడు మిట్టపల్లి సురేందర్​ విమర్శలు గుప్పిస్తున్నాడు. తెలంగాణ సాంస్కృతిక చైర్మన్​గా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యమంలో పని చేసిన కళాకారులకు చేయూత అందించాల్సింది పోయి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. సాంస్కృతిక సారధిలో పని చేస్తున్న కళాకారులను తన దారికి తెచ్చుకోవడానికే వారి జీతాలు ఆపివేయడం తోపాటు ప్రస్తుతం ఉన్న చోటు నుంచి బదిలీలు చేస్తున్నారని మిట్టపల్లి సురేందర్​ సోషల్​ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నాడు. తాను చేస్తున్న ఆరోపణలపై చర్చకు రమ్మంటే ఎక్కడికైనా వస్తానని, కానీ రసమయిని వదిలే ప్రసక్తి లేదని మిట్టపల్లి అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశం..

మిట్టపల్లి ఆరోపణలు ఉమ్మడి కరీంనగర్​ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. బీఆర్​ఎస్​ పార్టీ పెద్దల ఆశీస్సులతోనే సురేందర్​ రసమయిపై ఆరోపణలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్​ పార్టీ పెద్ద ఆశీస్తులు లేకుండా ఇటువంటి ఆరోపణలు ఎలా చేస్తారని అంటున్నారు. ఆరోపణలు చేసిన మిట్టపల్లి సురేందర్​ ప్రస్తుతం బీఆర్​ఎస్​ పార్టీకి అనుకులంగానే వ్యవహరిస్తున్నారు. సురేందర్​ ఒక వైపు బీఆర్​ఎస్​కు అనుకూలంగా వ్యవహరిస్తూనే మరో వైపు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్​ఎస్​ పార్టీలో ఉన్న పెద్దల ఆశీస్తులతోనే రసమయిపై ఆరోపణలు చేస్తున్నారని మరి కొందరు చర్చించుకుంటున్నారు.

బరిలో మిట్టపల్లి..?

వచ్చే శాసనసభ ఎన్నికల్లో మిట్టపల్లి సురేందర్​ బరిలో నిలవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్సీ రిజర్వ్​ నియోజకవర్గం అయిన మానకొండూరు​ నుంచి మిట్టపల్లి బీఆర్​ఎస్​ టికెట్​ ఆశీస్తున్నారనే చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన సురేందర్​ ఉద్యమ సమయంలో అనేక పాటలు రాశారు. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్​ఎస్​ పార్టీకి కేసీఆర్​కు ప్రత్యేకంగా పాటలు రాశారు. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవడంతోపాటు ప్రభుత్వం ఏర్పాటు తరువాత సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యతిరేక పాటలు రాయలేదు. వచ్చే ఎన్నికల్లో మానకొండూర్​ టికెట్​ ఆశిస్తున్న రసమయిపై ఆరోపణల బాణం ఎక్కు పెట్టినట్లు భావిస్తున్నారు.

ఆరోపణల వెనుక ఉన్నదెవరు..?

మిట్టపల్లి సురేందర్​ రసమయి బాలకిషన్​పై ఆరోపణలు చేసినప్పటికీ బీఆర్​ఎస్​ పార్టీ నుంచి కాని రసమయి వర్గం నుంచి ఎటువంటి ఖండన లేకపోవడంతో మిట్టపల్లి ఆరోపణల వెనుక కచ్చితంగా ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే అనుమానాలకు బలం చేరుకురుస్తుంది. రాష్ట్ర శాసనసభకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రసమయిని టార్గెట్​ చేస్తున్న ఆరోపణల పరిణామం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed