కాగితాలు మారుస్తున్న మిల్లర్లు.. రూ.కోట్ల నిధుల లెక్కలు గోల్‌మాల్

by Anjali |
కాగితాలు మారుస్తున్న మిల్లర్లు.. రూ.కోట్ల నిధుల లెక్కలు గోల్‌మాల్
X

దిశ, హుజురాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ ల ద్వారా ఇచ్చిన ధాన్యం ద్వారా పెట్టాల్సిన సీఎంఆర్ విషయంలో మిల్లర్లు కొత్త దారి వెతుక్కుంటున్నారు. గత సీజన్ 2022-23లో పెట్టాల్సిన సీఎంఆర్ విషయంలో ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిడి అధిగమించేందుకు గాను ఈ సీజన్ లో వచ్చిన ధాన్యం ను గత సీజన్ లో బాకీ ఉన్న సీఎంఆర్‌కు లెక్క చూపుతున్నారు. ఇందుకు అధికారులు కూడా తమ సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు సమాచారం. దీంతో కోట్ల రూపాయల ధాన్యం లెక్కలు కాగితాల మీదనే మారిపోతున్నాయి. వచ్చిన అధికారులు సైతం ధాన్యం మిల్లులో స్టాక్ ఉన్నట్లు సాంకేతికంగా లెక్కలు వేసుకుంటూ ప్రభుత్వానికి లెక్కలు చూపుతున్నారు. ఈ సీజన్ లో పెట్టాల్సి సీఎంఆర్ కు సమయం ఈ డిసెంబర్ వరకు ఉండడంతో మిల్లర్లకు పెద్ద ఊతం దొరికినట్లు అయింది.

గత సీజన్ లో వచ్చిన ధాన్యం ను కస్టమ్ మిల్లింగ్ చేయకుండా పక్క దారి పట్టించి కోట్ల రూపాయలు తమ సొంత ఖాతాలో జమ చేసుకుని రియల్ ఎస్టేట్ తో పాటుగా ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టిన విషయం విదితమే. గత సీజన్ 2022-23 లో బాకీ పడ్డ సీఎంఆర్ విషయంలో గత ప్రభుత్వం ఉదాసీనత పాటించడంతో మిల్లర్లు కప్పదాటుడు ధోరణితో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టిన విషయం సైతం తెలిసిందే. ప్రభుత్వం మారదు,మాకేం ఢోకా ఉండదు అనుకున్న వారికి ప్రభుత్వం మారడంతో పాటు ప్రభుత్వం సీఎంఆర్ విషయంలో కఠినంగా ఉండటంతో విధిలేక కొంత మంది సీఎంఆర్ ను అధికారులకు లెక్కలు చూపుతున్నారు .కొంత మంది టెండర్ వేసిన కంపెనీలకు డబ్బులు కడుతున్నారు.

ప్రభుత్వం ద్వారా ఆయా కంపెనీలు 2003 రూపాయలు టెండర్ పాడి మిల్లర్ల దగ్గర రూ. 2,275లు వసూలు చేస్తుండటంతో మిల్లర్లు గత సీజన్ బాపతు ధాన్యం కు బదులుగా ఈ సీజన్ ధాన్యాన్ని సీబీగా చూపెడుతున్నట్లు సమాచారం. ఈ సీజన్ లో వచ్చిన ధాన్యం కు సీఎం ఆర్ విషయం లో సమయం 2024 డిసెంబర్ వరకు ఉండటం తో ఇప్పుడు వచ్చిన ధాన్యం ను 2022-23లో వచ్చిన ధాన్యం నిల్వ లో చూపెడు తున్నట్లు సమాచారం. దీంతో కోట్ల రూపాయలు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సమకూ రుతున్నట్లు సమాచారం. మళ్లీ ఈ సీజన్ లో వచ్చిన ధాన్యం లెక్కలు చూసినప్పుడు మొత్తం బండారం బయట పడుతుందని మిగతా మిల్లర్లు అంటున్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్ల విషయంలో అధికారులకు సైతం రికవరీ విషయం లో టార్గెట్ పెట్టడంతో వారు సైతం వీరికి వత్తాసు పలుకుతూ కాగితాలు మార్చడానికి సహకారం అందిస్తున్నట్లు సమాచారం.దీంతో దొరికిన వెసులుబాటును డిఫాల్ట్ అయిన మిల్లర్లు కోట్ల రూపాయల ధాన్యాన్ని ఒక మిల్లు నుండి మరో మిల్లులు మార్చి అధికారులకు లెక్కలు చూపుతున్నట్లు సమాచారం.

రా రైస్ మిల్లుల నుంచి బాయిల్డ్ కు డంపింగ్

హుజురాబాద్ ,జమ్మికుంటలోని మిల్లర్లు ఇప్పటికే కోట్ల రూపాయల ధాన్యాన్ని ఒక మిల్లు నుంచి మరో మిల్లుకు తరలించినట్లు సమాచారం. గత సీజన్ లో బకాయి పడ్డ మిల్లుల విషయంలో అధికారులు సీఎంఆర్ రికవరీ చేయడం లో ఉదాసీనత వహిస్తున్నారని గమనించిన కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని తెలంగాణ వ్యాప్తంగా నాలుగు కంపెనీలకు మిల్లులో ఉన్న ధాన్యంను టెండర్ వేసుకుని ప్రభుత్వానికి డబ్బులు చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సదరు కంపెనీలు డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుండి ధాన్యం ఇస్తారా, లేక డబ్బులు ఇస్తారా అని ఒత్తిడి తెస్తూ రికవరీ చేస్తుండటంతో కొంత మంది మిల్లర్లు డబ్బులు కట్టారు.పెద్ద మొత్తంలో డిఫాల్ట్ అయిన మిల్లర్లు వారు విధించిన క్వింటాలుకు 2275 రూపాయలు చెల్లించడానికి బదులు ఈ సీజన్ లో వచ్చిన ధాన్యాన్ని నిల్వ ఉన్నట్లు చూపెడుతూ తప్పించు కుంటున్నట్లు సమాచారం. ఇందుకు లోకల్ గా ఉన్న అధికారులు సైతం పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని తమ సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారులు మిల్లర్ల విషయం లో ప్రస్తుత గండం గట్టెక్కడానికి తమ సహకారం అందిస్తూ కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం చేతులు మారడానికి కారణం అవుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

లీజు దారులతో మిల్లర్లకు గండం

ప్రభుత్వం నుంచి ఐకేపీ ద్వారా ధాన్యం తీసుకోవడానికి గాను వివిధ ట్రేడింగ్ కంపెనీ, రైస్ మిల్లుల పేరిట లీజ్ తీసుకున్న వారితో మిల్లర్ల కు ప్రమాదం పొంచి ఉన్నట్లు మిల్లర్ల మాటలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన గడువు లోగా ధాన్యం సీఎంఆర్ పెట్టడమే ,లేక డబ్బులు చెల్లించడమో ప్రస్తుత నిబంధనల ప్రకారం చేయాలి. కానీ ఇక్కడ మిల్లర్లు డబ్బులు చెల్లించకుండా ప్రస్తుత సీజన్ ధాన్యం లెక్కలు గత సీజన్ కింద చూపెడుతుందటంతో మళ్లీ ఈ సీజన్ లో ఎక్కడి నుంచి తెచ్చి ధాన్యం లెక్కలు చూపెడుతారని లీజు కు ఇచ్చిన మిల్లర్లు భయపడుతున్నారు. లీజుకు తీసుకున్న వారు తన అగ్రిమెంట్ అయిపోయాక తప్పుకుంటే లీజుకు ఇచ్చిన యజమానులు, జమానతు పడ్డ వారు ఇరుక్కునే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం లెక్కలు మారుస్తున్న లీజుదారులు ఇప్పడు ఇప్పటి గండం గడిస్తే చాలు తర్వాత చూసుకుందాం ...ఆన్న చందాన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కోట్ల రూపాయల గోల్‌మాల్ గత సీజన్, ప్రస్తుత సీజన్ లో ఇచ్చిన ధాన్యం బాపతు లెక్కలు సరి చూస్తే అసలు విషయం గుట్టు తెలుస్తుందని స్థానికులు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed