పల్లె దవాఖాన ప్రారంభమెప్పుడో ?

by Sumithra |
పల్లె దవాఖాన ప్రారంభమెప్పుడో ?
X

దిశ, కొత్తపల్లి : పల్లె ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించేందుకు ఉద్దేశించిన పల్లె దవాఖానల ఏర్పాటు లక్ష్యం నెరవేరడం లేదు. గ్రామాల్లో వైద్య సేవలు విస్తరించేలా, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా పల్లె దవాఖానలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పల్లె దవాఖానలను నిర్మించినా వాటిని ప్రారంభించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈ దవాఖానలో ఒక ఎంబీబీస్ డాక్టర్ ను నియమించి అన్ని రకాల సాధారణ వైద్యసేవలు, మందులు అందించడం పల్లె దవాఖానల ముఖ్య ఉద్దేశం. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పట్టణ కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన పల్లె దవాఖాన ప్రారంభానికి నోచుకోవడం లేదు. లక్షల రూపాయలు వెచ్చించి భవన నిర్మాణం పూర్తి చేసుకున్న పల్లె దవాఖాన ఏళ్లు గడుస్తున్నా నిరుపయోగంగానే ఉంటుంది.

దీంతో దవాఖాన ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగి క్రిమి కీటకాలకు, దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. అంతే కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు తెలిపారు. కొత్తపల్లి మండలానికి పల్లె దవాఖాన మంజూరు కావడంతో తమకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పట్టణ ప్రజలు భావించారు. కానీ అవి ఉపయోగంలోకి రాకపోవడంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె దవాఖానల ద్వారా ప్రజలకు ఏదైనా జబ్బు పడితే చికిత్స చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన పల్లె దవాఖానను ప్రారంభించకపోవడం పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు, ప్రయివేటు హాస్పిటల్స్ కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి పల్లె దవాఖానను ప్రారంభించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed