అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు..సీపీ సత్యనారాయణ వార్నింగ్

by Sathputhe Rajesh |
అక్రమార్కులను వదిలిపెట్టేది లేదు..సీపీ సత్యనారాయణ వార్నింగ్
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కమిషనరేట్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఎప్పటికప్పడు అణిచివేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని, అసాంఘీక కార్యకలాపాలను నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. 'దిశ' ప్రతినిదికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. కమిషనరేట్ లో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులు మరింత చురుగ్గా స్పందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి క్రయ విక్రయాలను నిలువరించేందుకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నామని, కొంతమందిని అరెస్ట్ కూడా చేశామన్నారు. గంజాయి రవాణాపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఒక గ్రాము దొరికినా వదిలిపెట్టేది లేదన్నారు. ఇటీవల కాలంలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువత గంజాయి మత్తులో జీవితాలను బలి తీసుకుంటోందన్నారు. యువత జీవితాలను నాశనం చేస్తున్న గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సత్యనారాయణ తెలిపారు.

పోలీసింగ్ సిస్టం పకడ్భందీగా ఉన్నప్పుడే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేయగలుగుతామని, ఇలాంటి వారిపై డేగ కళ్లతో పరిశీలిస్తున్నామన్నారు. అలాగే ల్యాండ్ మాఫియా పాల్పడుతున్న అక్రమార్కులను నియంత్రించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని, డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ అగ్రిమెంట్లకు పాల్పడి చీటింగ్ చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అవసరమైతే పీడీ యాక్టులు కూడా పెట్టడానికి వెనకడాడేది లేదన్నారు. సామాన్యులను అన్యాయంగా ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. కమిషనరేట్ పరిధిలో మందుగుండు సామాగ్రి వినియోగించే వారు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి రెన్యూవల్ చేయడం లేదా కొత్త లైసెన్స్ ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే మంజూరు చేస్తామన్నారు. లైసెన్స్ తీసుకోకుండా అక్రమంగా మందుగుండు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంలో ఉపేక్షించేది లేదని సీపీ స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై ప్రత్యేకంగా నిఘా పెడతామన్నారు. మందుగుండు సామాగ్రి సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లకూడదన్నారు. అర్థరాత్రి వరకు నడిచే బార్లపై కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలు నిలువరించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని సీపీ సత్యనారాయణ అన్నారు. రేషన్ బియ్యం దందాపైనా కఠినంగా వ్యవహరిస్తున్నామని, రేషన్ బియ్యం దందా కొనసాగించే వారిని గుర్తించామని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు.

Advertisement

Next Story

Most Viewed