- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెస్ మనుగడ ప్రశ్నార్థకమేనా..! బకాయిలు ఫుల్.. వసూళ్లు నిల్
దిశ, సిరిసిల్ల ప్రతినిధి, వేములవాడ: 50 ఏళ్ల చరిత్ర కలిగిన సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)లో పెద్ద ఎత్తున విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉండి నష్టాల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. ధార్మిక కార్మిక కర్షక క్షేత్రానికి నెలవైన సిరిసిల్లలో వెలుగులు నింపిన సెస్ సంస్థ ఇప్పుడు చితికినపడి బకాయిలు ఫుల్.. వసూళ్లు నిల్ అన్న చందంగా తయారైంది. అయితే, డిస్కంలకు సెస్ సంస్థ సుమారు రూ.550 కోట్లకుపైగా బకాయిలు చెల్లించవలసి ఉండగా.. రూ.700 కోట్లకుపైగా సెస్‌కు బకాయిలు రావాల్సి ఉంది. అందులో గత ప్రభుత్వ బకాయిలతో పాటు గ్రామ పంచాయతీ మొదలుకొని కలెక్టరేట్ కార్యాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న బకాయిలు అధికారులను కలవరపెడుతున్నాయి. ఓ వైపు అధికారులు వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించిన్నప్పటికి వినియోగదారుల నుంచి మాత్రం ఆశించిన మేర స్పందన రావడం లేదని తెలుస్తోంది. దీంతో ఏమి చేయాలో.. ఏం చేస్తే బకాయిలు వసూలు అవుతాయో తెలియక సంబంధిత శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాల విద్యుత్ కనెక్షన్లను తొలగించే పనిలో అధికారులు ఉన్నారు.
బకాయిలు ఫుల్.. వసూళ్లు నిల్
ఇక సెస్ పరిధిలోని అన్ని ప్రాంతాలతో పోలిస్తే ధార్మికక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారు కొలువై ఉన్న వేములవాడ, చేనేత, మర మగ్గాల కార్మికులకు నెలవైన కార్మిక క్షేత్రం సిరిసిల్ల పట్టణాలలో సెస్ బకాయిలను చూస్తే మాత్రం అధికారుల గుండెల రైళ్లు పరిగెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయం వారికి కంటిమీద కునుకు లేకుండా తయారైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అన్ని విభాగాలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నట్లు ప్రాథమిక అంచనా.. ఈ పరిస్థితిని, జిల్లా పరిధిలో సెస్ విద్యుత్ బకాయిల పరిస్థితి ఎలా ఉందనేది, సంస్థ గణాంకాలే చెబుతున్నాయి.
పెండింగ్ జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలు
ఇక మిగతా అన్నింటితో పోలిస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ బకాయిలు ఉండటం అనేది కలవరపెడుతోంది. ఓ వైపు కార్యాలయాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతాయనే వాదనలు వినిపిస్తున్నప్పటికీ, చాలా కార్యాలయాలకు సంబంధించి విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉండటం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల రూ.2.53 లక్షల మేర విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా రోజులుగా బిల్లులు చెల్లించలేదనే కారణంతో వేములవాడ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అక్కడ రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పడంతో అధికారులు మళ్లీ కార్యాలయానికి విద్యుత్ సరఫరాను అందించారు.
అదే దారిలో ప్రైవేటు సంస్థలు..
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలో దారిలోనే పట్టణంలోని పలు ప్రైవేటు సముదాయాల యాజమానులు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలకు ధీటుగా కొనసాగుతున్న ప్రైవేటు భవనాలు, వాణిజ్య సముదాయాలు, కుల సంఘాల భవనాలు, అపార్టుమెంట్లతో పాటు చాలా నివాస సముదాయాలకు సంబంధించి రూ.కోట్ల విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
తర్జనభర్జనలో అధికారులు
ఇక ఇప్పటికే పెండింగ్ బిల్లుల వసూళ్లలో నిమగ్నమైన అధికారులకు, సిబ్బందికి ఆశించిన మేర ఫలితాలు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెండింగ్ బిల్లులు కోట్లలో ఉంటే వసూళ్లు మాత్రం వేలు, మహా అయితే రూ.లక్షల్లో మాత్రమే వసూలవుతన్నాయి. అది కూడా అతి కష్టం మీద, మరి కఠినంగా వ్యవహరిస్తేనే తప్పితే లేకుంటే అది కూడా రానట్లేనని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇన్నేళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో పెరుకుపోయిన బకాయిలను ఎలా వసూలు తెలియక సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పెండింగ్ బకాయిలు మాత్రం అధికారులను కలవరపెట్టడమే కాకుండా సంస్థ అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
మనుగడ ప్రశ్నార్థకమే..
మొండి బకాయిలతో నెట్టుకొస్తున్న సెస్ పనితీరు ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో సెస్ మనుగడ ప్రశ్నార్థకమేనని అంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు. ఇదే జరిగితే 54 ఏళ్ల చరిత్ర కలిగి ఉండి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన విద్యుత్ సహకార సంస్థ త్వరలోనే కనమరుగవనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పెరుకుపోయిన బకాయిలతో పాటు సంస్థలో అవినీతి, అక్రమాలు, పాలన అంశాలలో రాజకీయ జోక్యం వల్ల చివరకు సంస్థ లాభాల బాటను వీడి నష్టాల బాట పట్టిందని, సంస్థను కాపాడి, పునర్వైభవం తేవాలంటే సెస్‌ను ఎన్పీడీసీఎల్‌లో కలపాలని తెలంగాణ రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో నష్టాల బాటలో ఉన్న సెస్‌ను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సెస్ పాలకవర్గం, అధికారులు పెండింగ్ బకాయిలను వసూలు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.
రికవరీకి చర్యలు: శ్రీనివాస్ రెడ్డి, సెస్ ఇంచార్జీ ఎండీఎల్
జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బకాయిల రికవరీ చేపడుతున్నాం. పెండింగ్ బకాయిలను రాబట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిత్యం బిల్లులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ కార్యాలయాలకు ప్రతినెల నోటీసులు పంపిస్తున్నాం. నిధులు మంజూరు అయినప్పుడు ప్రభుత్వ కార్యాలయాల పెండింగ్ బిల్లులు కొంతమేర చెల్లిస్తున్నారు. మొదట ఎక్కువ మొత్తంలో పెండింగ్ బిల్లులు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. అయినప్పటికీ వినియోగదారుల నుండి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వినియోగదారులే పెద్ద మనసుతో ఆలోచించి పెండింగ్ బకాయిలను సకాలంలో చెల్లించి, సంస్థ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం.
పెండింగ్ విద్యుత్ బిల్లుల వివరాలు
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం - రూ.3.72 కోట్లు
కలెక్టర్ కార్యాలయం - రూ.19.38లక్షలు
జిల్లా ఆసుపత్రి - రూ.77.99లక్షలు
డీపీఓ (నూతన భవనం) - రూ.21.88లక్షలు
మెడికల్ కళాశాల - రూ.10.55లక్షలు
ఎస్పీ కార్యాలయం - రూ.2.66లక్షలు
ఆర్డీవో కార్యాలయం - రూ.4.82లక్షలు
గర్ల్స్ హైస్కూల్ - రూ.3.65లక్షలు
తహసీల్దార్ కార్యాలయం (సిరిసిల్ల) - రూ.1.46లక్షలు
ఎస్టీఓ కార్యాలయం - రూ.56 వేలు
జడ్పీ కార్యాలయం - రూ.78వేలు
పొదుపు భవన్ - రూ.6.30లక్షలు
ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)- రూ.3.15లక్షలు
యూపీఎస్ గీత నగర్- రూ.20వేలు
ఆర్ అండ్ బీ ఆఫీస్- రూ.3.81లక్షలు
టి.హబ్- రూ.13.78లక్షలు
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు- రూ.4.23 లక్షలు..
వేములవాడ మున్సిపల్ కార్యాలయం-రూ.3.24 కోట్లు
ఏరియా ఆస్పత్రి-రూ.13.19లక్షలు
సబ్ రిజిస్టర్ కార్యాలయం-రూ.2.53లక్షలు
తహసీల్దార్ కార్యాలయం(రూ)- రూ.3.55లక్షలు
ఎంపీడీవో కార్యాలయం-రూ.51వేలు
ఆర్డీవో కార్యాలయం-రూ.3లక్షలు