- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొడుకు మృతి.. కోడలిని గెంటేసిన అత్తమామలు..
దిశ, హుజురాబాద్ రూరల్ : మానవత్వం మంటగలిసింది. కొడుకు మరణిస్తే కోడలు, పిల్లలను ఆదరించి అక్కున చేర్చుకోవాల్సిన అత్తమామలు మానవత్వాన్ని మరిచి కోడల్ని గెంటేశారు. సంవత్సర కాలంగా ఇంటికి రానివ్వకుండా నరకయాతన చూపించారు. కనీసం భర్త సంవత్సరీకం చేసుకునేందుకు ఇంటికి వస్తే తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. దీంతో భర్త సంవత్సరీకాన్ని హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కాలనీలో తాళం వేసిన ఇంటి ముందే నిర్వహించి తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామానికి చెందిన రావుల మంజుల సురేందర్ కూతురు రవళిని హుజురాబాద్ కు చెందిన వీరగోని మొగిలి లచ్చమ్మల కుమారుడు శ్రావణ్ కు ఇచ్చి ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం చేశారు. రవళికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శ్రావణ్ పట్టణంలోని కాకతీయ కాలనీలో నివాసముంటూ ఒక గిఫ్ట్ చాపులో పనిచేస్తూ భార్య పిల్లల్ని పోషించేవాడు. అంతా సవ్యంగా సాగుతున్న సంసారంలో అనుకోకుండా శ్రావణ్ కు క్యాన్సర్ సోకడంతో గత సంవత్సరం ఆగస్టులో మరణించాడు. భర్త మరణంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న రవళికి అత్తమామలు మరో నరకం చూపించారు.
శ్రవణ్ మరణానంతరం రవళిని అత్తమామలు మొగిలి, లచ్చమ్మలు తన కొడుకే లేనప్పుడు నీతో మాకేం పని అంటూ బయటికి గెంటేశారు. దీంతో సంవత్సరం పాటు ఇల్లు వదిలేయాల్సిందిగా పూజారులు చెప్పడంతో రవళి కూడా చేసేదేం లేక వేరే చోట ముగ్గురు పిల్లలతో అద్దె ఇంట్లో జీవనం సాగించింది. పలుమార్లు అత్తమామలతో తనను తన పిల్లల్ని చేరదీయాల్సిందిగా విజ్ఞప్తి చేసినా ససేమిరా అనడంతో సంవత్సరం పాటు దొరికిన పని చేసుకుంటూ పిల్లలను సాకింది. కనీసం సంవత్సరీకం రోజైనా తనను చేరదీస్తారని ఎంతో ఆశతో ఎదురు చూసింది. కానీ సంవత్సరీకం రోజు కూడా ఆమెకు చేదు అనుభవమే ఎదురైంది. భర్త సంవత్సరీకం రోజు కూడా రవళిని ఇంటికి రానివ్వకుండా అత్తమామలు తాళం వేసుకొని ఎటో వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక తన భర్త సంవత్సరీకం ఇంటి ముందే నిర్వహించింది. చిన్న పిల్లలతో రవళి ఇంటి ముందు సంవత్సరికం నిర్వహించడం చూసినా చుట్టుపక్కల ప్రజలు సైతం బాధాతప్త హృదయంతో ఆమెకు న్యాయం చేయాలని పేర్కొన్నారు. ఈ విషయమై రవళి అత్తమామలను సంప్రదించే ప్రయత్నం చేయగా వారు అందుబాటులోకి రాలేదు.