జగిత్యాలలో రైతుల ఆందోళన

by Mahesh |
జగిత్యాలలో రైతుల ఆందోళన
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుందని జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట్ ఐకెపి సెంటర్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం బస్తాలు, చెట్ల కొమ్మలు ముళ్ల కంపలు రోడ్డుకు అడ్డంగా వేసి ధర్నా చేపట్టారు. నిరసన కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. లారీల కొరత లేదని చెప్తున్న అధికారులు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎందుకు ఆలస్యం అవుతుందని నిలదీశారు.

రోహిణి కార్తె ప్రవేశిస్తున్న ఇంకా కొనుగోలు పూర్తి కాలేదని మండిపడ్డారు. రైతుబంధు పేరుతో రైతులను దగా చేయడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదు అన్నారు. అనంతరం శ్రావణి మాట్లాడుతూ. తేమ, తాలు పేరుతో రైతులను మిల్లర్లు నిలువునా ముంచుతున్నారని ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు చేపట్టిన నిరసన కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Next Story

Most Viewed