సహకారం ఉత్తిమాటే !

by Sumithra |
సహకారం ఉత్తిమాటే !
X

ఖరీఫ్ ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతు కష్టాలను తీర్చాల్సిన సహకార సంఘాలు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పంట పండించడం ఒక ఎత్తయితే .. దానిని ఆరబోసుకోవడానికి.. అమ్ముకోవడానికి మరిన్ని కష్టాలు పడుతున్నారు. ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెబుతున్నా.. శంకరపట్నం మండలంలోని కరీంపేట సహకార సంఘం చైర్మన్, సెంటర్ నిర్వాహకుల తీరుతో రైతులు అవస్థలు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులతో తగ్గిన దిగుబడులతో అల్లాడుతుంటే కాంటా ఫలానా దగ్గర మాత్రమే వేస్తాం అనడంతో రైతులు దిగులు చెందుతున్నారు. సరిపడా స్థలం లేకపోవడంతోనే రహదారుల వెంట ఇండ్ల మధ్యలో ధాన్యం ఆరబోస్తున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పదేపదే చెబుతున్నా కింది స్థాయి అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని కరీంపేట్ గ్రామ రైతులు ధాన్యం ఆరబొసుకునేందుకు, అమ్ముకునేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. వర్షాలకు, మబ్బులకు భయపడి వరి కోతలు పూర్తి చేసుకున్న రైతులు ధాన్యం కొనుగోలు చేసే ప్రాంతంలో ఖాళీ స్థలం లేకపోవడంతో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆరబోసుకున్నారు. హార్వెస్టర్ ద్వారా కోత కోసి ట్రాక్టర్ల ద్వారా తరలించడానికి ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు 500 రూపాయల వ్యయం అవుతుందని రైతులు తెలిపారు. ధాన్యం పోసుకున్న దగ్గరే కాంటా వేస్తారు అనుకోని నిశ్చింతగా ఉన్న రైతులకు సొసైటీ నిర్ణయంతో రైతులకు ఖర్చు తడిసి మోపెడవుతుంది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తేనే కాంట వేస్తాం అనడంతో ట్రాక్టర్లో వడ్లు పోయడానికి రూ.400, ట్రాక్టర్ కిరాయి రూ.500 చొప్పున ఒక్కో ట్రిప్పుకు 900 రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇదేంటని రైతులు ప్రశ్నిస్తే మీ దిక్కున్నచోట చెప్పుకోండి ధాన్యం ఇక్కడికి తీసుకు వస్తేనే కాంటా వేస్తాం లేదంటే లేదు అని మొహం మీదనే చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది రైతులు కలిసి ఒక దగ్గర కల్లం ఏర్పాటు చేసుకొని ఆరబెట్టుకుంటున్నారు.

మరి కొంత మంది పెద్ద రైతులు ధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం లేకపోవడంతో దారుల వెంట ఆరబోసుకున్నారు. ఇంకొంత మంది ఇండ్ల వాకిళ్లలో ఆరబోసుకున్నారు. ధాన్యం పోసుకునే స్థలం తక్కువగా ఉండడంతో ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే అక్కడ ధాన్యం ఆరబోసుకున్నారు. కాంట వేయమంటే తాడికల్ సొసైటీ చైర్మన్ కేతిరి మధుకర్ రెడ్డి ఎస్సారెస్పీ కాల్వ వద్ద పోసుకుంటేనే ధాన్యం కాంట వేయాలని హుకుం జారీ చేశాడు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధిక పెట్టుబడులతో తగ్గిన దిగుబడులతో అల్లాడుతుంటే కాంట ఫలానా దగ్గర మాత్రమే వేస్తాం అనడంతో రైతులు దిగులు చెందుతున్నారు. సరిపడా స్థలం లేకపోవడంతోనే రహదారుల వెంట ఇండ్ల మధ్యలో ధాన్యం పోసుకోవలసిన పరిస్థితి అని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఓవైపు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టొద్దని పదేపదే చెబుతున్నప్పటికీ కింది స్థాయి అధికారులు, సహకార సంఘాల చైర్మన్లు చెవికెక్కించుకోకపోవడంతో అన్నదాత అష్టకష్టాలు పడుతున్నారు. ఏ సహకార సంఘంలో లేని షరతులు నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారని పలువురు రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా రైతుల ధాన్యాన్ని ఆరబోసుకున్న ప్రాంతంలోనే కాంట వేయించేటట్లు చూడాలని ఉన్నతాధికారులను రైతులు వేడుకుంటున్నారు.

చింతం సుధాకర్

సహకార సంఘం చైర్మన్ రైతు కాకపోవడం వల్లనే రైతుల కష్టాలు అర్థం కావడంలేదు. కావాలనే చైర్మన్ ధాన్యం కొనుగోలులో కొంతమంది పట్ల వివక్ష పాటిస్తున్నాడు.

పాలేటి కనకయ్య, రైతు

గతంలో ధాన్యం ఎక్కడ పోసుకున్నా తూకం వేసే వారు. ఇప్పుడు మాత్రం అలా వేయకపోవడం వల్ల తనకు అదనంగా రూ.6 వేలు ఖర్చు అయ్యింది.

చింతం కుమారస్వామి, రైతు

సెంటర్ నిర్వాహకుడు బీఆర్ఎస్ పార్టీకి చెందిన క్రియాశీలకమైన వ్యక్తి. ప్రభుత్వానికి రైతుల పట్ల వ్యతిరేకతను తీసుకురావడం కోసం ప్రభుత్వ ప్రతిష్టని దిగజార్చే విధంగా అతని చర్యలు ఉన్నాయి.

చింతి రెడ్డి మల్లారెడ్డి రైతు..

గ్రామాల్లో ప్రత్యేకంగా స్థలం లేకపోవడంతో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆరబోసుకున్నాం. అక్కడికి ట్రాక్టర్లు వచ్చి కాంటా వేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయినా సహకార సంఘం విచిత్రమైన పోకడలకు పోతుంది.

Advertisement

Next Story