కేసీఆర్‌కు కర్ర కాల్చి వాతపెట్టినట్లు బుద్ధి చెప్పాలి: ఈటల రాజేందర్

by S Gopi |   ( Updated:2023-02-24 10:32:44.0  )
కేసీఆర్‌కు కర్ర కాల్చి వాతపెట్టినట్లు బుద్ధి చెప్పాలి: ఈటల రాజేందర్
X

దిశ, మల్యాల: మండల కేంద్రంలో కొత్తపేట వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగోష బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ... 'నా ఈ 20 ఏళ్ల చరిత్రలో శాసనసభలో బడ్జెట్ సమావేశాలు 41 రోజులు జరగగా 30 రోజులు వర్కింగ్ డేస్ ఉండేవి. రాష్ట్ర బడ్జెట్ పై గవర్నర్ ప్రసంగం ఏ విధమైన బడ్జెట్ కు ఎంత కేటాయించాలి అనే దానిపై రాత్రి వరకు చర్చించి నిర్ణయం తీసుకుంటే గానీ ఆమోదం పొందేది కాదు. ఇందిరా పార్కు వద్ద పెద్దపెద్ద టెంట్లు వేసుకుని రైతుల సమస్య గానీ, వీఆర్ఏల సమస్య గానీ, మహిళా సంఘాల సమస్య గానీ నిరసన కారులు నిరసన తెలుపుతూ మిమ్మల్ని శాసనసభలో మాట్లాడమని కోరేది. అలాంటిది కేసీఆర్ ముఖ్యమంత్రి అయిననుండి టెంట్లు వేసుకోవడానికి అనుమతులు లేవు. సభలు నిర్వహించడానికి అనుమతులు లేవు. ధర్నాలు చేయడానికి అనుమతులు లేవు. పోలీస్ కబంధ హస్తాలలో ప్రజలను ఉంచుతున్న సీఎం కేసీఆర్.. ప్రశ్నించే తత్వాన్ని పూర్తిగా రూపు మారుస్తున్నాడు. మహిళా సంఘాల రుణ వడ్డీని కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత వడ్డీని భరిస్తున్నాయి. మహిళలు సంఘాల ద్వారా రుణం తీసుకుని ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించుకునేవాళ్ళు కానీ ఆరు సంవత్సరాల క్రితం విడుదల చేసిన వడ్డీ ఇప్పటికీ మళ్ళీ ఆ ఊసే ఎందుకు తీయట్లేదు' అని ఆయన అన్నారు.

యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ గద్దెనెక్కిన పార్టీ ఉద్యోగాలు ఇవ్వకపోగా మేనిఫెస్టోలో ప్రస్తావించిన నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం పంప్ హౌస్ పంపుల వల్ల కరెంట్ బిల్లు తప్ప లాభం ఏమీ లేదని ఆయన అన్నారు. ఎండాకాలం రాకముందే రైతులకు కరెంటు తిప్పలు తప్పట్లేదని కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నాలుగు ఎకరాలు సాగు చేసే రైతు రెండు ఎకరాలు కూడా సాగు చేయడం కష్టమవుతుందన్నారు. మధ్య తరగతి వారి నడ్డి విరిచేలా విద్యుత్ బిల్లుపై ఏసీడీ ఛార్జీలు అంటూ ప్రజలను గోస పెడుతున్నారు. గ్రామాలలో గెలిచిన సర్పంచులు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అప్పులు తెచ్చి మరీ అభివృద్ధి పనులు చేస్తే వారికి బిల్లులు ఇవ్వకుండా వారికి కేంద్రం నుంచి వచ్చే రూపాయలను వేరే వైపు మళ్ళించడం వారిని ఆత్మహత్యలకు పురిగొలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు. డిసెంబర్ 2023 వరకల్లా సీఎం కేసీఆర్ కు కర్ర కాల్చి వాతపెట్టినట్లు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యురాలు బుడిగ శోభ, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, పదాధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: కేసీఆర్ ఏలుబడిలో అణగారిన, దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుంది: ఈటల

Advertisement

Next Story