కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి

by Sridhar Babu |
కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలి
X

దిశ, కాటారం : కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి అంచనాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ కోరారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు కాళేశ్వర క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు చేసిన సలహాలు, సూచనల మేరకు దేవస్థానం అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ నివేదికలను త్వరితగతిన సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గోదావరి నదిలో భక్తులు వ్యర్థాలు వేయకుండా చెత్త డబ్బాలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే క్షేత్రంలో వాహనదారుల నుంచి టోల్ వసూలు ద్వారా వచ్చే ఆదాయంతో ఘాట్ వద్ద పారిశుద్ధ్య పనులు, స్నాన ఘట్టాలు, అస్తికలు నిమజ్జనం ఘాట్ వద్ద విడిచిన బట్టలు, వ్యర్థాలు ట్రాక్టర్ ద్వారా తరలించేందుకు, పారిశుద్ధ్య కార్మికులు నియామకాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పిండప్రదానాలు భద్రపరిచేందుకు ప్రత్యేకంగా లాకర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

100 గదుల సత్రం, అన్నదాన సత్రం, యాత్రికుల సౌకర్య కేంద్రం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోదావరి ఒడ్డున భక్తులు బట్టలు మార్చుకునేందుకు శాశ్వత ప్రాతిపదికన గదులు ఏర్పాటుతో పాటు షవర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సులభ్​ కాంప్లెక్స్ నుండి మురుగునీరు గోదావరిలో కలువకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. దేవాలయ పరిసరాల్లో శివనామం మోగేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గోదావరి వద్ద భక్తులు పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కోసం హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలన్నారు. లైటింగ్, తాగునీటి సరఫరాకు ప్రతిపాదనలు అందచేయాలని ఆదేశించారు. భక్తులు గుర్తించడానికి అనువుగా సైన్ బోర్డ్స్, శాశ్వత మరుగుదొడ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించాలని అన్నారు.

రానున్న జనవరి మాసం వరకు 100 గదుల సత్రం పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సైడ్ డ్రైన్లు, మంచినీటి సమస్య పరిష్కారానికి ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. జిల్లా స్థాయి కమిటీ ఆమోదం ద్వారా ఫర్నిచర్ కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ విద్యుత్, ఆర్ ఓ ప్లాంటు, బయో మరుగుదొడ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్నారు. కాళేశ్వరం వచ్చే భక్తులు ఎక్కడి నుండైనా రూములు బుక్ చేసుకునేందుకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తేవాలని దేవస్థానం ఈఓను ఆదేశించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణ రావు, సీపీఓ బాబూరావు, పంచాయతి రాజ్ ఈ ఈ దిలీప్, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ నిర్మల, దేవస్థానం ఈఓ మారుతి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed