చిన్నారి పై కుక్కల దాడి.. తప్పిన ప్రాణాపాయం

by Shiva |   ( Updated:2023-04-11 12:37:47.0  )
చిన్నారి పై కుక్కల దాడి.. తప్పిన ప్రాణాపాయం
X

దిశ, వెల్గటూర్: చిన్నారిపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన ధర్మపురి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రాయికల్ కు చెందిన రోహిణి, వెంకటేశ్ దంపతులు తమ అమ్మగారి ఊరు ధర్మపురికి వచ్చారు. వారికి మూడేళ్ల బాబు షాన్ ఉన్నాడు. ఈ క్రమంలో బాబు ఆరుబయట ఆడుకుంటుండగా అభంశుభం తెలియని ఆ చిన్నారిపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి. చిన్నారి అరుపులు విన్న తల్లి రోహిణి ఇంట్లోంచి బయటకు రాగా కుక్కలు ఆమెపై కూడా దాడికి దిగాయి. అనంతరం ప్రతిఘటించగా అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి.

తల్లి రోహిణి రావడం ఏమాత్రం ఆలస్యం అయినా హైదరాబాద్ ఘటన పునరావృతం అయ్యేదని స్థానికులు అంటున్నారు. దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారి షాన్ ను కుటుంబ సభ్యులు హటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాణాపాయం తప్పింది. గతంలో ధర్మపురిలో పలువురి పై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటనలు చాలానే ఉన్నాయి. కుక్కల బెడద గురించి స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏమత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story