కలెక్టర్ ముందే గ్రామస్తులు ఫైర్.. దానికి అనుమతి ఇవ్వొద్దంటూ..

by Satheesh |
కలెక్టర్ ముందే గ్రామస్తులు ఫైర్.. దానికి అనుమతి ఇవ్వొద్దంటూ..
X

దిశ, చిగురుమామిడి: చిగురుమామిడి గ్రామ శివారు, పీచుపల్లి గ్రామ సమీపంలోని పెద్దగుట్ట వద్ద ఉన్న శ్రీరాధ గ్రానైట్స్ అనుమతుల కొరకు శుక్రవారం అడిషినల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌లాల్ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. ఇక్కడ గ్రానైట్‌కు అనుమతులు ఇవ్వవద్దని.. అనుమతులు ఇస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. వన్యప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గుట్టపై గ్రానైట్ కొరకు అనుమతులు ఇస్తే, ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రారంభించిన మంకీ ఫుడ్ కోర్టు దెబ్బతింటుందని చిగురుమామిడి గ్రామానికి చెందిన ముక్కెర సదానందం.. అడిషినల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో తెలిపారు. తమ పొలాలు పాడైపోయే ప్రమాదం ఉందని, పొలాల్లో బండరాళ్లు, దుమ్ముధూళి పడి పంటలు పండవని, రైతులు పుట్ట ప్రతాప్ రావు, పీచు రాజిరెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తుల సహకారం లేకుండా గ్రానైట్ పరిశ్రమను ఎలా నడిపిస్తారని గ్రానైట్ యాజమాన్యాన్ని స్థానికులు ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణకు లోబడి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాల మేరకు శ్రీరాధ గ్రానైట్ వారికి అనుమతులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాధ గ్రానైట్స్ యాజమాన్యంతో పాటు, తహశీల్దార్ సయ్యద్ ముబిన్ అహ్హ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story