ఓటమి తాత్కాలిక విరామం మాత్రమే : కేసీఆర్

by Disha Web Desk 23 |
ఓటమి తాత్కాలిక విరామం మాత్రమే : కేసీఆర్
X

దిశ,వీణవంక: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం మంచిర్యాలలో జరిగిన బస్సు యాత్ర లో పాల్గొని అర్ధరాత్రి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వగృహమైన వీణవంక లో బస చేశారు. ఆదివారం కౌశిక్ రెడ్డి స్వగృహంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ...ఓటమి ఒక తాత్కాలిక విరామం అని, ఇది శాశ్వతం కాదని రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమని తెలంగాణ ప్రజలకు 24 గంటల కరెంటు ఇచ్చామని, రైతు బంధు,రైతు బీమా, కల్యాణ లక్ష్మి,పెన్షన్ లాంటి అనేక పథకాలు అమలు చేశామని కానీ కాంగ్రెసోళ్లురూ. 2000 పెన్షన్ అధికంగా ఇస్తామనగానే తెలంగాణ ప్రజలు ఉబ్బిపోయారని ఇప్పుడు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను చాచి బండకు కొట్టాడని ఎద్దేవా చేశాడు.నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారని నేను తెలంగాణలో అనేక పార్లమెంట్ నియోజకవర్గం పర్యటన చేస్తున్నానని ఎక్కడ చూడు కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత కనిపిస్తుందని అన్నారు.

రైతుబంధు నాటు వేసి పంట కోసినాక తొమ్మిదో తేదిన పూర్తి చేస్తానని, ప్రస్తుత ముఖ్యమంత్రి అంటున్నారని, నేనేమో పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందజేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి వరిగోసినాక రైతుబంధు అందజేస్తానని అంటున్నాడని, ఇది తలా తోక లేని మాటని ఈరోజు నేను పేపర్ చదివితే నా కంట కన్నీళ్లు వచ్చాయని అన్నారు. నరేంద్ర మోడీ కూడా అసూయపడే పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, కానీ నేడు కరెంట్ కోతలతో రూ. 1000 కోట్లతో నడిచే పరిశ్రమ తమిళనాడుకు వెళ్లిపోయిందని కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణను ఆగం చేశారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 2001 నాడు బీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు రాష్ట్రంలో పెద్ద నాయకులు లేనపడ్డికి హుజురాబాద్ గడ్డ అనేక మంది జడ్పీటీసీలను, ఎంపీపీ లను,సర్పంచ్లను ఇచ్చిందని దాని ఫలితమే తెలంగాణ వచ్చింది అని అన్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.9 సంవత్సరాలలో నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేశామని నిరంతరాయంగా మంచినీరు సరఫరా చేశామని, కానీ నాలుగు నెలల్లో కరెంట్ ఎక్కడికి పోయాయని, నీళ్లు ఎక్కడికి పోయాయని కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నాలుగు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో వరంగల్ ఎంజీఎం లో ఎయిర్ కండిషనర్స్ లేక తల్లి బిడ్డలు అల్లాడిపోతున్నారని, ఆదిలాబాద్ రిమ్స్ లో సచ్చిపోయిన పీనుగులు దుర్వాసన పడుతున్నాయని అన్నారు.నరేంద్ర మోడీ గోదావరి నీళ్లను తమిళనాడుకు తీసుకుపోతానని అనేక సందర్భాల్లో బహిరంగ బహిరంగంగానే చెబుతున్నారని కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి దానిమీద కనీసం స్పందిస్తలేదని దానిలో ఉన్న మతలబు ఎందని ప్రశ్నించారు. ఇంత ప్రధానమైన సమస్య మీద ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం స్పందిస్తులేడని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రపోజల్ వచ్చిందని, కానీ నేను ముందు నా తెలంగాణ వాటా తేల్చని, తెలంగాణ వాటా తేల్చినంకనే మాట్లాడుతానని అప్పటి వరకు నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో అని అన్నానని కేసీఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 12 సీట్ల మీద వస్తే ఇలాంటి వాటిని ప్రశ్నించడానికి వీలు ఉంటుందని లేకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను ఆగం చేస్తాయని వినోద్ కుమార్ ని గెలిపించే బాధ్యత మనదేనని భారీ మెజార్టీతో వినోద్ కుమార్ ను గెలిపించాలని కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కనుమల విజయ, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Next Story

Most Viewed