స్కూల్ యూనిఫామ్ కుట్టిన పైసలు ఇస్తలేరు

by Mahesh |
స్కూల్ యూనిఫామ్ కుట్టిన పైసలు ఇస్తలేరు
X

దిశ, పెద్దపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం కుట్టిన దుస్తుల పైసలు సర్కార్​ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు స్కూల్​ డ్రెస్​లు కుట్టిన ఏజెన్సీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బట్టలు అప్పగించి ఏడు నెలలు గడిచినా నేటికీ డబ్బులు రాక ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితిని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వివరించినా సమస్య పరిష్కారం కాలేదు. తక్కువ ధరకు బట్టలు కుట్టి ఇచ్చిన ఏజెన్సీలు బిల్లులు విడుదల కాక ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా రెండు జతల స్కూల్​ డ్రెస్స్​లను ప్రభుత్వం అందజేస్తోంది.

ఇందుకు కావాల్సిన క్లాత్​ను కొనుగోలు చేసి ఆయా మండలాల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి మండల విద్యాధికారి కార్యాలయానికి ప్రభుత్వం పంపిస్తుంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా ఆయా మండలాల్లో ఉన్న మహిళ స్వయం సహాయ సంఘాలను సంప్రదించి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దుస్తులు కుట్టడానికి ముందుకు వస్తే వారికి వారు రాని పక్షంలో ఇతర ఏజెన్సీలు ఎవరైనా ముందుకు వస్తే వారికి పని అప్పగిస్తుంది. నిర్ణయించిన ధరకు దుస్తుల కుట్టుపని పూర్తి చేసి మండల విద్యాధికారి ఆయా మండలాల్లో ఉన్న పాఠశాలలకు ఎన్ని దుస్తులు పంపించాలో చెబితే కుట్టు పని పూర్తి చేసి రవాణా చార్జీలు భరించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి దుస్తులు అందించే బాధ్యత కుట్టు ఏజెన్సీలది.

తక్కువ ధరకు కుట్టిండ్రు..

విద్యార్థులకు ప్రభుత్వం అందించే దుస్తులను తక్కువ ధరకే కుట్టి ఇచ్చారు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు రెండు నిక్కర్లు, రెండు షార్ట్స్​, ఒక్కటి నుంచి 7 విద్యార్థినులకు బాడీ ప్రాక్స్​, లంగాలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వారికి రెండు ప్యాట్లు రెండు షార్ట్స్​, విద్యార్థినులకు రెండు పంజాబీ డ్రెస్సులు కుట్టించి ఇవ్వాలి. ఒక్క యూనిఫాం కుట్టి ఇచ్చినందుకు రూ. 50 మాత్రమే ప్రభుత్వం చెల్లించింది.

వాస్తవానికి ప్రస్తుతం టైలరింగ్​ చేసుకుంటున్న వాళ్ళు మహిళలకు సంబంధించి ఒక జాకెట్​ కుట్టి ఇస్తే రూ. 200 నుంచి రూ. 300 వరకు తీసుకుంటున్నారు. ప్యాంట్​, షార్ట్​ కుట్టిస్తే రూ. 800 నుంచి రూ. 900 వరకు తీసుకుంటున్నారు. విద్యార్థికి అందించే డ్రెస్​ను రూ. 50కి కుట్టి ఇచ్చాయి ఏజెన్సీలు. పంద్రాగస్టు వరకు యూనిఫాం అందించాలని డెడ్​ లైన్​ పెట్టడంతో ఆగస్టు 15 తేదీ లోపు కొత్త దుస్తులను అందజేశారు.

రూ. కోటి వరకు బాకీ..

ప్రభుత్వం పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్కువ ధరకే దుస్తులు కుట్టించిన ఏజెన్సీలకు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. రాష్ర్టవ్యాప్తంగా 2022–23 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రూ. 26 కోట్లు 9‌‌0లక్షల వరకు ప్రభుత్వం బాకీ ఉన్నది. ఉమ్మడి కరీంనగర్​ జిల్లా పరిధిలోని పెద్దపల్లి, కరీంనగర్​, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలోని యూనిఫాం కుట్టిన ఏజెన్సీలకు ప్రభుత్వం నుంచి దాదాపు కోటి చెల్లించాల్సి ఉంది.

మంత్రికి చెప్పినా ఫలితం శూన్యం..

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్కువ ధరకు బట్టలు కుట్టిన వారి బిల్లులు రాకపోవడంతో మండల విద్యాధికారిని, జిల్లా విద్యాధికారిని కలిసి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో నెల రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరారు. మంత్రికి కలిసి నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు బిల్లులు జాడ లేదని బట్టలు కుట్టిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూనిఫాంలు కుట్టించిన ఏజెన్సీలు కొంతమందిని తమ వద్ద పనికి నియమించుకొని ప్రభుత్వం చెప్పిన సమయానికి బట్టలు కుట్టించి అప్పగించారు. యూనిఫాం కుట్టడానికి పెట్టుకున్న వారికి డబ్బులు తాము చెల్లించినప్పటికీ తమ బిల్లులు మాత్రం పాస్​ కావడం లేదని ఏజెన్సీలు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు పట్టించుకోని విద్యా సంవత్సరం పూర్తి కాకముందే తమ బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed