కరీంనగర్‌లో ఉనికి కోల్పోతున్న ఉద్యమపార్టీ

by Disha Web Desk 12 |
కరీంనగర్‌లో ఉనికి కోల్పోతున్న ఉద్యమపార్టీ
X

దిశ, బ్యూరో కరీంనగర్: ఒకప్పుడు ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో ఉనికిని చాటుకుని విస్తరించిన ఉద్యమ పార్టీ ఇప్పుడు ఇదే జిల్లాలో ఉనికి కోల్పోతూ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఓ వైపు ఆక్రమణలు, అరాచకాలతో నమోదైన కేసుల్లో ఉద్యమ పార్టీ నేతలు అరెస్టులు అయి కటకటాల్లోకి వెళ్లి ఆ పార్టి ప్రతిష్టను పబ్లిక్ లో మంటగలపగా మరోవైపు ఉద్యమ పార్టీని ఒక్కరొక్కరుగా వదిలి వెళ్లడంతో జిల్లాలో ఆ పార్టీ ఉనికి కోల్పోతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతా బిఆర్ఎస్ కు ఎదురు గాలి వీచినా కరీంనగర్ లో మాత్రం పట్టు సాధించినా.. ఆ పార్టీలో ఇప్పుడు పట్టుమని పదిమంది లేకపోవడంతో పార్టీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రభుత్వం మారగానే కరీంనగర్ లో వెలుగుచూసిన ఆ పార్టీ నేతల ఆగడాలు బీఆర్ఎస్ ప్రతిష్టను కరీంనగర్ లో అబాసుపాలు చేసింది.

అధికారం అడ్డుపెట్టుకుని చేసిన అరాచకాలతో ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ నేతలు జైలు పాలు కావడంతో ఆ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నం అయ్యింది. అయితే ఇప్పటికే పలు కేసులతో ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ నేతలు వీడడం కరీంనగర్ లో బీఆర్ఎస్ కు మూలిగే నక్క పై తాటిపండు పడ్డ చందంగా తయారైంది. పదేళ్లుగా ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించిన ఆ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగలడం ఇప్పుడు ఉద్యమ పార్టీ ఉనికి కరీంనగర్ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. అయితే అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకుడు అతని అనుచరుల వ్యవహారం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకోగా అధికారంలో ఉన్నా కొంతమంది నేతలకు అక్కడ ప్రాధాన్యత దక్కకపోవడంతో అదును కోసం చూసిన నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు.

అయితే అధికారం కోల్పోయిన ఆ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగేందుకు నేతలు పునరాలోచనలో పడుతూ పక్కదారి చూసుకుంటూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే మరో వారం రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో క్యాడర్ పార్టీని వదలడం ఆ పార్టీ గెలుపు సంగతి దేవుడెరుగు మనుగడే ప్రశ్నార్థకంలో పడిపోతుంది. ఓ వైపు పార్టీ రాష్ట్ర నాయకత్వం రాష్ట్రంలో పన్నెండు స్థానాలను గెలవబోతున్నాం అంటు ప్రగల్భాలు పలుకుతుండగా వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. అయితే ఇప్పటికే స్థానిక ఎంఎల్ఏ పార్టీ మారుతున్నట్టు పుకార్లు షికార్లు చేయడంతో క్యాడర్ లో నెలకొన్న నైరాశ్యంతో పార్టీ కొంత బలహీనపడగా ఆ పార్టీ నేతలు అడుగడుగునా అనుమానంతో వ్యవహరిస్తూ ఎవరు ఉంటారు? ఎవరు పార్టీ మారుతారో? అనే సందిగ్థంతో ప్రచారంలో కొంత వెనక పడగ ఇప్పుడు స్థానిక కార్పేరేటక్లు పదిమంది మూకుమ్మడిగా పార్టీని వీడడం ఆ పార్టీ భవితవ్యం గందరగోళంలో పడ్డట్టు అయ్యింది.

కాంగ్రెస్ కండువా కప్పుకున్న కార్పొరేటర్లు

కరీంనగర్ కు చెందిన సుమారు పదిమంది కార్పొరేటర్లు మూకుమ్మడిగా పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వారం రోజుల్లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పార్టీ మారడం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అయితే గత కొంతకాలంగా పార్టీలో నెలకొన్న పరిస్థితులతో పార్టీలో గందరగోళం నెలకొంది. గత వారం రోజుల్లో పార్టీ మారేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టడం ఆ పార్టీని కలవర పరుస్తుంది. పార్టీ మారుతున్న నేతలతో ఎన్నికల్లో ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతతో గత ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం కోల్పోయిన ఉద్యమ పార్టీ ఇప్పుడు పార్టీ మారుతున్న నేతలతో ఉనికే ప్రశ్నార్థకంగా మారింది.

Next Story

Most Viewed