పంట నష్టపోతే ఆదుకునే పాలసీ రాష్ట్రంలో ఏముంది : గంగాడి కృష్ణారెడ్డి

by Sumithra |
పంట నష్టపోతే ఆదుకునే పాలసీ రాష్ట్రంలో ఏముంది : గంగాడి కృష్ణారెడ్డి
X

దిశ, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, వడ గళ్ళ వానలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ రూరల్, రామడుగు, చొప్పదండి మండలంలోని పలు గ్రామాలలో పూర్తిగా దెబ్బతిన్న మామిడి, వరి పంటలు, మిర్చి కూరగాయల తోటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంట నేడు చేతికిచ్చే సమయంలో అకాల వర్షం వడగండ్ల వాన కారణంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ముఖ్యంగా వరి పంట, మిర్చి, మామిడి, ఖరబూజ, మొక్క జొన్న వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిలిందని, పంటలకు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి రైతాంగానికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

9 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాత నష్టపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. అకాల వర్షాలు వడగండ్ల వానలతో, ఇతర కారణాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కెసిఆర్ ప్రభుత్వం వద్ద ఎలాంటి పాలసీ లేదని విమర్శించారు. అలాంటప్పుడు దేశవ్యాప్తంగా కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ఫసల్ బీమా యోజన పథకం తీసుకువచ్చిందని తెలిపారు. ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు పంట నష్టపోయిన రైతాంగానికి ఆదుకోవడానికి ఈ పథకం ఎంతో దోదపడుతుందని, ఈ పథకం ద్వారా రైతుల పంటకు తగిన బీమా రక్షణ లభిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం అనేక రాష్ట్రాల్లో అమలవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయకుండా రైతుల నోట్లో మట్టి కొడుతుందన్నారు.

దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఫసల్ భీమా యోజన తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వానికి చేతులు రావడంలేదని, ఇటీవల అకాల వర్షాలతో నష్టపోయిన పంట ప్రాంతాలలో ముఖ్యంగా రామడుగు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారనీ, నేటికీ ముఖ్యమంత్రి ప్రకటించిన ఆ మొత్తాన్ని రైతులకు ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు. దీంతో ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతాంగం పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా వడ గళ్ళ వాన తీవ్రతను ఉన్నతాధికారులు పట్టించు కోవడం లేదని, విస్తృతంగా పంటలు, నష్ట పోతే రెవెన్యూ, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖలతో కలసి వేగంగా సర్వే చేయించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఆయన దుయ్య బట్టారు.

వెంటనే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకునే వరకు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విడిచి పెట్టేది లేదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, భత్తుల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు మేకల ప్రభాకర్ యాదవ్ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి జెల్లా సుధాకర్, చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పెరుక శ్రావణ్, కరీంనగర్ రూరల్ మండలం అధ్యక్షులు మాడిశెట్టి సంతోష్, చొప్పదండి రూరల్ మండలం అధ్యక్షులు మావురపు సుదర్శన్ రెడ్డి, రామడుగు మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, దాసరి రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మేడి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed