కాళేశ్వరం నిర్వహణ టెన్షన్.. ఖజానాకు గుదిబండలా సీఎం కలల ప్రాజెక్టు

by Sathputhe Rajesh |   ( Updated:2023-06-07 14:43:42.0  )
కాళేశ్వరం నిర్వహణ టెన్షన్.. ఖజానాకు గుదిబండలా సీఎం కలల ప్రాజెక్టు
X

తెలంగాణ నీటిపారుదల రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్వరాష్ట్రం ఏర్పడిన తొలి ప్రసంగంలోనే సీఎం కేసీఆర్​ ప్రకటించారు. అందుకనుగుణంగా ప్రభుత్వం ఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆరంచెల వ్యూహాన్ని రూపొందించుకున్నది.ఇప్పటికే కట్టిన ప్రాజెక్టులను ఆధునికీకరించడంతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, ‘మిషన్ కాకతీయ’తో చెరువుల పునరుద్ధరణ, నదుల పునరుజ్జీవనం, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఇరిగేషన్ వ్యవస్థ పునర్ వ్యవస్థీకరణ.. ఇలాంటివన్నీ టార్గెట్‌గా పెట్టుకున్నది.

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు పేరు మార్చి, రీడిజైన్ చేసి మేడిగడ్డ దగ్గర ‘బాహుబలి’గా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటికి లక్ష ఎకరాలకు కూడా నీరందలేదు. ఆదాయమే రాని ప్రాజెక్టు అప్పును ఎలా తీరుస్తారంటూ ‘కాగ్’ సైతం రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కాళేశ్వరంతో 18 లక్షల కొత్త ఆయకట్టు, మరో 18 లక్షల స్థిరీకరణ జరుగుతుందని కేసీఆర్ చెప్పుకున్నా చివరకు అదేమీ జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత భక్తరామదాసు ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేయగలిగింది. అదేసమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2015 జూన్‌లోనే కరివెన దగ్గర పునాదిరాయి వేసినా ఇప్పటికీ అది అసంపూర్ణంగానే మిగిలిపోయింది. మొత్తంగా రాష్ట్రంలోని సాగునీటి పారుదల రంగంపై ప్రభుత్వం చేస్తున్న క్లెయిమ్​లకు క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలా ఉన్నాయి. - దిశ, తెలంగాణ బ్యూరో

లక్ష కోట్ల అప్పుతో కాళేశ్వరం

క్లెయిమ్​: కాళేశ్వరంతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. 13 జిల్లాల్లో మూడు ఆనకట్టలు 22 లిప్టులు, 21 భారీ పంప్‌హౌజ్‌లు, సొరంగమార్గాలు... వీటన్నింటినీ 36 నెలల వ్యవధిలోనే పూర్తిచేశాం.

వాస్తవం: యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, నాబార్డ్, బరోడా బ్యాంకు నుంచి రూ. 97,449 కోట్ల రుణాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ సమకూర్చుకున్నది. ఇందులో ఇప్పటివరకు కేవలం రూ. 79 కోట్లను మాత్రమే ‘అసలు’ రూపంలో రీపేమెంట్ (2022 జూన్ నాటికి) చేసింది. రూ. 4,427 కోట్ల మేర వడ్డీగా చెల్లించింది.

ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 87,450 కోట్ల మేర ఖర్చయింది. సంవత్సరానికి సగటున రూ. 13 వేల కోట్ల చొప్పున పదేండ్ల పాటు అసలు, వడ్డీ చెల్లించాల్సి ఉంది. ఇదికాక రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా ప్రతి ఏటా ఫండ్స్ రిలీజ్ అవుతున్నాయి. రాష్ట్ర వాటర్ రిసోర్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి 2018-19 నుంచి 2022-23 వరకు సుమారు రూ. 16,092 కోట్ల మేర అప్పులు తీసుకున్నది. వీటికి ఇప్పటికే వడ్డీల రూపంలో రూ. 4,616 కోట్లను చెల్లించింది. కేవలం రూ. 545 కోట్లను మాత్రమే ‘అసలు’ రూపంలో చెల్లించింది.

ఎత్తిపోతలకు భారీ వ్యయం

క్లెయిమ్​: రెండు పంటలకు 45 లక్షల ఎకరాల చొప్పున నీరు అందిస్తున్నాం. గోదావరిలో నిరంతరం 100 టీఎంసీల నీరు నిల్వ ఉంటున్నది.

వాస్తవం: ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసే 165 టీఎంసీల నీటితో కొత్తగా సుమారు 18 లక్షల ఎకరాల మేర పొడి భూమి సాగులోకి వస్తుందని ప్రభుత్వం చెప్పుకుంటున్నది. కానీ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి వస్తున్నందున ఒక్కో సీజన్‌కు ఒక్కో ఎకరాకు సుమారు రూ. 50 వేల మేర విద్యుత్ కోసమే ఖర్చవుతున్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది.

దీనికి తోడు ఇతర నిర్వహణాపరమైన ఖర్చులు దాదాపు రూ. 20 వేల వరకు ఉండొచ్చని అంచనా. సగటున 45 మెగావాట్ల మోటార్లను వాడుతున్నందున ఒక్కో టీఎంసీ నీటిని లిఫ్ట్ చేయడానికి సుమారు రూ. 50 కోట్ల మేర ఖర్చు కానున్నట్లు ఇంజినీర్లు తేల్చారు. ఇప్పటివరకు 164 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి అయిన విద్యుత్ వినియోగంలో సుమారు రూ. 9,200 కోట్లు డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది.

ఆదాయమే లేని ప్రాజెక్టు అప్పులు తీరేదెలా?

క్లెయిమ్​: మౌలిక సదుపాయాలతో రాష్ట్ర సంపదను సృష్టించడానికే లక్ష కోట్లు ఖర్చయినా కాళేశ్వరంను నిర్మించాం.

వాస్తవం: తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా చిత్రీకరిస్తున్నప్పటికీ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) మాత్రం తీవ్రస్థాయిలోనే తప్పుపట్టింది. అప్పులు తెచ్చి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నా దీన్ని తీర్చడానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని 2022 వార్షిక ఆడిట్ రిపోర్టులో వ్యాఖ్యానించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లో ఆదాయాన్ని సృష్టించే మార్గాలేవీ లేవని, అలాంటిప్పుడు ఎక్కడి నుంచి రీపేమెంట్, వడ్డీ చెల్లింపులకు ప్రభుత్వం తీసుకొస్తుందని ప్రశ్నించింది. తిరిగి బడ్జెట్ నుంచే చెల్లించాల్సి వస్తుందని, ఇది ప్రభుత్వానికి భారంగా మారుతుందని స్పష్టం చేసింది.

పన్నెండేళ్ళలో ‘అసలు’ తీర్చాల్సిందే

క్లెయిమ్​: ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటిపారుదల రంగం దుర్భరంగా ఉండేది.. సాహసోపేతమైన నిర్ణయాలతో కోటి ఎకరాల మాగాణిని సృష్టిస్తున్నాం.

వాస్తవం: కాళేశ్వరంను ‘బాహుబలి’గా మాత్రమే కాక ప్రశంసలు అందుకున్న ప్రాజెక్టుగా ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ లక్ష కోట్ల రుణాన్ని తీర్చడం ఇప్పుడు సర్కారుకు సవాలుగా మారింది. నాబార్డు నుంచి తీసుకున్న రూ. 1,500 కోట్ల రుణాన్న 2021 జూన్ నుంచే రీపేపెంట్ మొదలు పెట్టింది. మొత్తం పన్నెండు క్వార్టర్లీ ఇన్‌స్టాల్‌మెంట్లలో 9.75% వడ్డీతో 2035 మార్చి నెల వరకు తీర్చాల్సి ఉన్నది. నాబార్డు నుంచి సెకండ్, థర్డ్ ఫేజ్‌లలో తీసుకున్న రుణాలను, పీఎఫ్‌సీ నుంచి తీసుకున్న లింక్-1,2,4 అప్పులను ఈ ఏడాది జూన్, సెప్టెంబరు మాసాల నుంచి ప్రతీ క్వార్టర్ (త్రైమాసికం)కు 10.90% వడ్డీతో చెల్లించాల్సి ఉన్నది.

తెలంగాణ గ్రోత్ ఇంజిన్‌గా కాళేశ్వరం

క్లెయిమ్​: ప్రపంచంలోని అతి పెద్దదైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.83 లక్షల ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది.

వాస్తవం: ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినట్లు ప్రభుత్వం చెప్పినా టార్గెట్ ప్రకారం కొత్త ఆయకట్టు రాలేదు. లింక్-7లో భాగంగా రెండు పంపుల్లో ఒకదాని ద్వారా మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల పరిధిలో 74 వేల ఎకరాలకు మాత్రమే సాగులోకి వచ్చింది. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన చెరువుల పునరుద్ధరణ ప్రోగ్రామ్‌తో వర్షపు నీరు నిల్వచేసుకునే వెసులుబాటు కలిగింది. ఏటా ఈ ప్రాజెక్టు ద్వారా 195 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని టార్గెట్‌గా పెట్టుకున్నా నాలుగేళ్ళలో కేవలం 164 టీఎంసీలకే పరిమితమైంది. ఇందులోనూ దాదాపు 60 టీఎంసీలు సముద్రంలోకే పోయాయి.

క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర కామెంట్ల వెనక

క్లెయిమ్​: మనం ఊహించని తీరులో 28 లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో పంపు హౌజ్‌లు మునిగిపోయాయి. ఇంతటి భారీ వర్షానికి కారణం క్లౌడ్ బరస్ట్ అయినా విదేశీ కుట్ర ఉన్నది.

వాస్తవం: లక్ష కోట్ల ఖర్చుతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినా భారీ వర్షాలకు కన్నేపల్లి, అన్నారం పంపు హౌజ్‌లు మునిగిపోవడం నిర్మాణ వైఫల్యానికి నిదర్శనమంటూ విపక్షాలు విమర్శించాయి. డయాఫ్రం వాల్ సరిగ్గా నిర్మించకపోవడంతోనే 45 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 17 పంపులు నీట మునిగిపోయాయన్నారు. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి ముఖ్యమంత్రి క్లౌడ్ బరస్ట్, విదేశీ కుట్ర అంటూ దృష్టి మళ్ళించే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనే వివాదానికి దారితీశాయి. ప్రాజెక్టు నిర్మాణంలోని లోపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమేననే అపవాదును కేసీఆర్ మూటగట్టుకున్నారు.

లక్షన్నర కోట్లతో పెరిగింది 17 లక్షల ఎకరాలే

క్లెయిమ్​: కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ రూపొందింది. త్వరలో కోటింబావు ఎకరాల సాగు సాకారం కానున్నది.

వాస్తవం: తెలంగాణ ప్రభుత్వం గడచిన తొమ్మిదేళ్ళలో రూ. 1.55 లక్షల కోట్లను సాగునీటిరంగంపై ఖర్చు పెట్టింది. ఇంత ఖర్చు చేసినా అదనంగా నీటిపారుదల విస్తీర్ణం కలిగింది 17 లక్షల ఎకరాలకు మాత్రమేనని స్వయంగా ప్రభుత్వమే తన ప్రగతి నివేదికల వెల్లడించింది. పెరిగినదంతా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమే అనే నిర్ధారణకు రాలేమని, మిషన్ కాకతీయతో చెరువుల్లోకి నీరు చేరడం మరో కారణమని ఇంజినీర్లు పేర్కొన్నారు. కాళేశ్వరం కట్టినా కాల్వల నిర్మాణం చేపట్టలేదు. చెరువులకు మాత్రమే నీటిని ఎత్తిపోసే వ్యవస్థ ఏర్పడింది.

ఏడేళ్లయినా ముందుకు సాగని ‘పాలమూరు’

క్లెయిమ్​: ‘ఇది మీ ప్రభుత్వం... ఇది నా మాట.. రెండున్నరేళ్లలోనే మీ పొలాలకు నీళ్లొస్తాయి..’ పాలమూరు ప్రాజెక్టుతో వచ్చే 90 టీఎంసీలకు అదనంగా వేమసముద్రం ద్వారా మరో 10 టీఎంసీలు అందుతాయి.

వాస్తవం: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 2015 జూన్ 11న భూత్‌పూర్ మండలం కరివెన గ్రామం దగ్గర పునాది రాయి వేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట. మూడేండ్లలోనే ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని, రూ. 32,500 కోట్లను ఖర్చు పెడతామని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ ప్రాజెక్టు అసంపూర్ణంగానే ఉండిపోయింది.

దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై వివక్ష

క్లెయిమ్​: నిరంతర ప్రయత్నాలు, నిబద్ధతతో చేపట్టిన చర్యలతో నీటి వినియోగ సామర్థ్యం డబుల్ అయింది.

వాస్తవం: ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులపై చూపిన శ్రద్ధ దక్షిణ తెలంగాపై లేదని, ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నదంటూ ఈ ప్రాంత విపక్షాల నేతలు బహిరంగంగానే పలుమార్లు విమర్శించారు. ఇది నిజమేనంటూ రెండేండ్ల క్రింద కేసీఆర్ సన్నిహితులొకరు బహిరంగంగానే అంగీకరించారు.

పొరుగు రాష్ట్రంతో జల వివాదాలు

క్లెయిమ్​: ‘భేషజాల్లేవ్.. బేసిన్ల గొడవ లేదు.. అపోహల్లేవ్.. వివాదాలు అక్కర్లేదు..’ రెండు రాష్ట్రాల ప్రజలూ మనవారే..

వాస్తవం: ఆంధ్రప్రదేశ్‌తో నెలకొన్న జల వివాదాలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో 2019 జూన్ 28న ప్రగతి భవన్‌తో కేసీఆర్ చర్చలు జరిపి పై కామెంట్లు చేశారు. స్వచ్ఛమైన హృదయంతో జగన్ వ్యవహరించారు.. కలిసి నడుద్దామనుకున్నాం.. ప్రజలు నమ్మి ఓటేశారు... ప్రజల కోణం నుంచే ఆలోచిస్తాం..

రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి.. అంటూ ఆ సమావేశం తర్వాత వివరాలను కేసీఆర్ వెల్లడించారు. కానీ కృష్ణా జలాల పంపిణీతో పాటు గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ సర్కారు నిప్పులు చెరుగుతున్నది. నాలుగేండ్లవుతున్నా కృష్ణా జలాల పంచాయతీ తెగలేదు. కేంద్ర జల సంఘానికి ఫిర్యాదు వెళ్లింది.

జాతీయ వాటర్ పాలసీ ఎలా?

క్లెయిమ్​: బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే వాటర్, అగ్రికల్చర్, పవర్ పాలసీలను తెస్తాం...

వాస్తవం: తొమ్మిదేళ్లయినా పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో జల వివాదాలను పరిష్కరించుకోలేకపోయిన తెలంగాణ ఇప్పుడు జాతీయ స్థాయిల వాటర్ పాలసీ ఎలా తెస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అనేక రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఉన్నాయని ప్రస్తావిస్తున్న కేసీఆర్ ఏపీతో ఉన్నదాన్నే తేల్చలేకపోయారనే నిందను మోస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రకు విస్తరించడంలో భాగంగా గోదావరి జలాలను తీసుకోవచ్చంటూ ఆఫర్ ఇచ్చి విమర్శల పాలయ్యారు.

సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా

క్లెయిమ్​: కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి...

వాస్తవం: పూర్తిగా అప్పులతోనే కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. కానీ ఇప్పటివరకు హామీ లభించలేదు. కాళేశ్వరం నిర్మాణానికి దాదాపు లక్ష కోట్లు అప్పు తెచ్చుకుని నిర్మించినా భవిష్యత్తులో దీని నిర్వహణ ప్రభుత్వానికి భారంగా మారనున్నది. ఇందులో సింహభాగం లిఫ్టు పంపులకు వాడే విద్యుత్ కోసమే వెచ్చించాల్సి ఉంటుంది. ఈ సంగతి తెలిసినందునే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించుకుని ఆ భారాన్ని కేంద్రం మీదకు నెట్టేయాలని చూస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రాజెక్టుల పేర్లు, రీడిజైన్ మార్పులు

తుపాకులగూడెం : ములుగు జిల్లా ఏటూరునాగారం దగ్గర నిర్మించే ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం గిరిజన దేవతల పేరు మీద సమ్మక్క బ్యారేజీగా నామకరణం చేసింది.

దుమ్ముగూడెం : కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దగ్గర రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ రుద్రమకోట జంట ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం పేరు మార్చి ఒకే బ్యారేజీ సరిపోతుందనే భావనతో సీతారామ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ పేర్లను పెట్టింది.

ప్రాణహిత-చేవెళ్ళ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుగా గుర్తింపు పొందినప్పటికీ రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చింది ప్రభుత్వం.

పాలేరు లిఫ్ట్ : ఖమ్మం జిల్లా పాలేరు ఎత్తిపోతల ప్రాజెక్టుగా గతంలో పిలిచినప్పటికీ ప్రభుత్వం దీన్ని భక్తరామదాసు ప్రాజెక్టుగా పేరు మార్చింది.

దేవతల పేరుతో బ్యారేజీలు : కాళేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీలకు దేవతల పేర్లు పెట్టిన ప్రభుత్వం భూపాలప్లి జిల్లా మేడిగడ్డ బ్యారేజీకి లక్ష్మి, అదే జిల్లా అన్నారం బ్యారేజీకి సరస్వతి, పెద్దపల్లి జిల్లా సుందిళ్ళ బ్యారేజీకి పార్వతి అని పేర్లు పెట్టింది.

Advertisement

Next Story