షర్మిలకు కాంగ్రెస్‌తో డీల్ కుదిరింది.. జూలై 8న ఇడుపులపాయకు సోనియా గాంధీ?

by GSrikanth |   ( Updated:2023-06-20 14:07:21.0  )
షర్మిలకు కాంగ్రెస్‌తో డీల్ కుదిరింది.. జూలై 8న ఇడుపులపాయకు సోనియా గాంధీ?
X

దిశ, డైనమిక్ బ్యూరో: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం ద్వారా షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారని, పార్టీ విలీనం కోసం ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదింపులు చేశాడని ఆరోపించారు. ఈ మేరకు జులై 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఇడుపులపాయకు వచ్చి నివాళి అర్పించేలా అనిల్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీ పెట్టినప్పుడే తాను ఆమె వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని చెప్పానని ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. సోనియా దేశద్రోహి, ముఖ్యంగా ఆంధ్ర ద్రోహి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దోచుకోవడం, దాచుకోవడం, కుటుంబ పాలన, కుల పాలన కోసమే వీళ్లంతా ఏకం అవుతున్నారని ఆరోపించారు.

షర్మిల బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడానికి పార్టీ పెట్టలేదని మనల్ని మోసం చేసి ఓట్లను చీల్చి, కుటుంబాలను విభజించడానికే పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీలకు ప్యాకేజీ స్టార్ గా మారిపోతే షర్మిల నిన్నటి వరకు బీజేపీతో ఇప్పుడు కాంగ్రెస్ తో డీల్ కుదుర్చుకుందని ఆరోపించారు. వీరి కుట్రలకు ప్రజలు మోసపోవద్దన్నారు. షర్మిల కాంగ్రెస్ లో కలిస్తే అవినీతి, కుటుంబ గాంధీ ఫ్యామిలీలో కలిసి దేశాన్ని ఉద్దరిస్తారట అని ఎద్దేవా చేశారు. ఏపీ, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను భూస్థాపితం చేయాలన్నారు. షర్మిల పార్టీలో ఉన్న ఇద్దరు ముగ్గురు కూడా తనకు టచ్ లో ఉన్నారని అన్నారు.

Advertisement

Next Story