- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో పోటీకి సై.. జనసేన సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. హాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోన్న అధికార బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోన్న కాంగ్రెస్, బీజేపీ గెలుపు గుర్రాల వేటలో నిమగ్నమయ్యాయి.
బీఆర్ఎస్‌పై వ్యతిరేకత.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పుంజుకోవడంతో ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పోటీకి జనసేన సిద్ధం కావడం సంచలనంగా మారింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 32 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆ నియోజక వర్గాలకు ఇన్ చార్జ్‌లను నియమించి.. ఎన్నికల కసరత్తు స్టార్ట్ చేసినట్లు తెలిపింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరా హోరి తప్పదనుకుంటున్న క్రమంలో.. ఎన్నికల యుద్ధంలోకి జనసేన ఎంట్రీ ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.
జనసేన పోటీ చేసే 32 స్థానాలివే:
తెలంగాణలో పోటీ చేయబోయే 32 స్థానాల లిస్ట్‌ను సోమవారం జనసేన ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా నియోజకవర్గాల జాబితాను విడుదల చేసింది. కూకట్‌పల్లి, ఎల్బీనగర్, నాగర్‌కర్నూల్, వైరా, ఖమ్మం, మునుగోడు, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్, కొత్తగూడెం, ఉప్పల్, అశ్వారావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్‌నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మల్కాజిగిరి, ఖానాపూర్, మేడ్చల్, పాలేరు, ఇల్లందు, మధిర స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
బీజేపీతో పొత్తు..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటామని జనసేన ప్రకటించడంతో.. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన.. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈ ప్రభావం ఫలితాలపై ఎఫెక్ట్ చూపించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో గతం కంటే బలంగా పుంజుకున్న బీజేపీ.. జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తే రిజల్ట్స్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. జనసేన బరిలో ఉంటామని ప్రకటించిన 32 స్థానాల్లో కొన్నింట్లో బీజేపీకి అనూకూల పవనాలు వీస్తున్నాయి.
దీనికి తోడు జనసేన బలం కూడా తోడైతే.. అక్కడ ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో పవన్ కల్యాణ్‌కు అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే పవన్ కల్యాణ్ ఇమేజ్ కూడా ఈ పార్టీలకు కలిసిరానుంది. అయితే, ప్రస్తుతానికి తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. ఒక వేళ ఎన్నికల చివరి నాటికి నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిగురిస్తే మాత్రం.. ఫలితాలపై ప్రభావం చూపించవచ్చు. ఇక, తెలంగాణలో జనసేన 32 చోట్ల బరిలో ఉంటామని ప్రకటించడంతో ఆ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి తీరని నష్టం జరుగుతుందో వేచి చూడాలి.
- Tags
- janasena party