Telangana Assembly Sessions : స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు.. మరికాసేపట్లో స్పీకర్ కీలక నిర్ణయం

by M.Rajitha |
Telangana Assembly Sessions : స్పీకర్ పై జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు.. మరికాసేపట్లో స్పీకర్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోTelangana Assembly Sessions) రెండవరోజు తీవ్ర గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) స్పీకర్(Speaker) పై చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారాన్ని రేపాయి. "స్పీకర్ శాసనసభ సభ్యుల అందరి తరపున పెద్ద మనిషి అంతేగాని సభ మీ ఒక్కరిదే కాదు" అని అనడం పట్ల కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. స్పీకర్ దళితుడు కాబట్టే గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని అధికారపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. స్పీకర్ ను అగౌరవ పరిచేలా మాట్లాడలేదని బీఆర్ఎస్ సభ్యులు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. స్పీకర్ కు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఈ విషయమై సభలో ఇరు పార్టీల సభ్యులు పొటాపోటీగా నినాదాలు ఇవ్వడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశాడు. దళిత స్పీకర్ ను అవమానించినందుకు జగదీష్ రెడ్డి ఆయనకు క్షమాపణలు చెప్పాల్సిందేనని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దృష్టికి తీసుకు వెళ్లారు మంత్రి శ్రీధర్ బాబు.

తదుపరి కార్యచరణపై సీఎంతో చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) తో చర్చలు జరిపారు. కాగా మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిశారు. జగదీష్ రెడ్డి అగౌరవపరిచేలా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై అఖిలపక్ష భేటీ నిర్వహించి వారి నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోవాలని, కేవలం కాంగ్రెస్ సభ్యుల నిర్ణయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోకూడదని అన్నారు. మరోసారి అసెంబ్లీ లో జగదీష్ రెడ్డి మాట్లాడిన రికార్డులను పరిశీలించి, పొరపాటు ఉంటే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని, సభను ఆపకూడదని బీఆర్ఎస్ సభ్యుల తరపున ఎమ్మెల్యే హరీష్ రావు(MLA Harish Rao) స్పీకర్ ను కోరారు. అయితే ఈ వివాదంపై స్పీకర్ మరికాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story