పెండ్లికి అమ్మితే.. బిడ్డ పుట్టినా కాలె.. కాసులు కురిపిస్తున్న ధరణి అప్లికేషన్స్

by Rajesh |
పెండ్లికి అమ్మితే.. బిడ్డ పుట్టినా కాలె.. కాసులు కురిపిస్తున్న ధరణి అప్లికేషన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓ నెల రోజులు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్‌లు పెట్టినా.. వారం వారం వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా.. రైతుల సమస్యలకు పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వం ఎంత చెప్పినా అధికారుల మధ్య సమన్వయలోపం, నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. తహశీల్దార్ల మొదలు సీసీఎల్ఏ కార్యాలయం వరకు పరిష్కారానికి కాకుండా డ్యాష్ బోర్డు క్లియరెన్స్ కే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకే ఒక్కొక్కరి ఫైళ్లు నాలుగైదు సార్లు రిజెక్ట్ చేస్తున్నారు. అన్నీ కరెక్టుగా ఉన్నా.. మండల ఆఫీసు నుంచి రిపోర్ట్ పాజిటివ్‌గా పంపినా కలెక్టర్ లేదా సీసీఎల్ఏ కార్యాలయంలో తిరస్కరిస్తుండడం విశేషం.

అమ్మాయి పెళ్లప్పుడు అప్లై చేస్తే ఆమెకు బిడ్డ పుట్టినా భూ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. అది జస్ట్ డేటా కరెక్షన్ మాత్రమే. అది కూడా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తలెత్తిందే. బాధిత రైతులకు, ఈ తప్పొప్పులకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త పాసు పుస్తకం వచ్చినా.. ధరణి పోర్టల్ లో భూమి లేకుండా పోవడం, సర్వే నంబర్లు మిస్ చేయడం వంటి సమస్యలను రెవెన్యూ అధికారులే సృష్టించారు. ఐతే దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యతను బాధితుల మీద వేసి ఏండ్లకేండ్లు ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారు. రైతుల సమస్యలను ఉద్దేశ్యపూర్వకంగానే పెండింగులో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అందుకే సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ పెడితే వారం రోజులకు 32 జిల్లాల కలెక్టర్లు క్లియర్ చేసిన ఫైళ్ల సంఖ్య 24,778 మాత్రమే. అందులో రిజెక్ట్ చేసినవే అత్యధికం. ఇప్పటికీ 2,34,626 దరఖాస్తులు వివిధ స్థాయిలో పెండింగులో ఉండడం విశేషం. వీటిలో తహశీల్దార్ల దగ్గర 1,48,182, ఆర్డీవోల దగ్గర 53,478, అదనపు కలెక్టర్ల దగ్గర 20,451, కలెక్టర్ల దగ్గర 12,405 వంతున పెండింగులోనే ఉన్నాయి. ఇవి కూడా మరో వారం టైం ఇచ్చినా రిజెక్ట్ చేస్తారే తప్ప రైతుకు న్యాయం చేస్తూ పరిష్కరించేవి ఉండవనేది వాస్తవం. తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ల మీదున్న శ్రద్ధ రైతుల సమస్యల పరిష్కారంపై ఎందుకుంటుందని ఓ ఉన్నతాధికారి విమర్శించారు. అందుకే రికార్డులన్నీ చూసి రిపోర్టు రాసే ఓపిక, తీరిక వారికెక్కడ ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది.

ఎంత అన్యాయం?

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ముచ్చర్లలో ఎల్గపల్లి నర్సింహకు అరెకరం పొలం ఉంది. దాన్ని అమ్మాయి పెళ్లికి అమ్మేందుకు బేరం పెట్టిండు. కొన్నోళ్లు అడ్వాన్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ కి వెళ్దామంటే స్లాట్ బుక్ కావడం లేదు. అది సీలింగ్ ల్యాండ్ అని చూపిస్తున్నది. తరతరాలుగా అనుభవిస్తున్న తన పొలం సీలింగ్ ఎట్లా అంటరంటూ అధికారులను అడిగిండు. అప్లై చేసుకుంటే తీసేస్తమన్నారు. దరఖాస్తు చేసుకున్నాడు. తిరుగుతూనే ఉన్నాడు. అమ్మాయి పెళ్లి ఆపలేడు కదా.. ప్రైవేటు ఫైనాన్స్ లో అప్పు చేసి పెళ్లి చేశాడు. వడ్డీ కింద రూ.10 లక్షలకు పైగా కట్టిండు. ఇప్పుడు అమ్మాయికి బాబు కూడా పుట్టిండు. ఆ ఫంక్షన్ కూడా అప్పు చేసి పూర్తి చేసిండు. తన బిడ్డకు పెళ్లయ్యింది. ఇప్పుడు మనవడు కూడా వచ్చాడు.

ఇప్పటికీ ఆయన ఫైలు కలెక్టరేట్ లోనే ఉన్నది. అందరూ పని చేస్తున్నారు. తహశీల్దార్, ఆర్డీవోలు సహకరిస్తూనే ఉన్నారు. రిపోర్టులు పంపుతూనే ఉన్నారు. కానీ ఎందుకో తెలియదు.. ఇప్పటికి మూడు సార్లు ఎల్గపల్లి నర్సింహ ఫైల్ రిజెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నాల్గోసారి అప్లై చేశాడు. ఓ పెద్ద మనిషిని తీసుకెళ్లి కలెక్టర్ సార్ ని కూడా కలిశాడు. రేపే పని అవుతుందన్నారు. కానీ ఇంకేదో తక్కువైందని మళ్లీ ఫైల్ కిందికే వచ్చింది. ముచ్చర్ల సర్వే నం.293లో మొత్తం భూమి 63.11 ఎకరాలు. అందులో 3.29 ఎకరాలు మాత్రమే సీలింగ్.

కానీ ఆ సర్వే నంబరులోని అన్ని ఖాతాలను పీవోబీలు చేర్చి సీలింగ్ ల్యాండ్ గా నిర్ణయించారు. ఇదెక్కడి అన్యాయం? అలా రాయడానికి ఆ అధికారులకు మనసెట్లా ఒప్పిందంటూ బాధితులు రోజూ తిట్టుకుంటున్నారు. ఖాస్రా, సెస్సాలా, 1990‌‌–91 నుంచి అన్ని పహానీలు చూశాడు. సీలింగ్ రిజిస్టర్, ఐజీఆర్ఎస్ కాపీలు అన్ని పరిశీలించి నర్సింహది సీలింగ్ కాదని, పట్టా ల్యాండ్ అని తేల్చారు. చెక్ మెమో పంపి కూడా నాలుగు నెలలైంది. ఐనా కలెక్టర్ మరోసారి రిజెక్ట్ చేయడం విశేషం.. రైతులకు అధికారులకు ఎంత మమకారం ఉన్నదో, ఎంత అభిమానం ఉన్నదో ఇదొక్కటి చాలు.

ఎన్నోన్నో బాధలు

– హైదరాబాద్​కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలోని ఓ ఊరిలో రెండెకరాలు కొనుగోలు చేశారు. పాసు పుస్తకం కూడా వచ్చింది. ఇప్పుడేమో అవసరానికి అమ్ముకోవాలనుకుంటే ఆ సర్వే నంబరు మిస్సయ్యింది. టీఎం 33 కింద అప్లై చేస్తే కొనుగోలు చేసిన భూమి అని, పొషిషన్ లో కూడా రెండు ఎకరాలు ఉన్నదని మండల స్థాయిలో లిఖితపూర్వకంగా ఇచ్చారు. కానీ ఆర్ఎస్ఆర్ తేడా ఉందని సీసీఎల్ఏ లో పెండింగ్ పెట్టారు. ఇప్పుడేమో ఆ మొత్తం లెక్క తేల్చుకొని రావాలని ఆదేశిస్తున్నారు.

– గట్టుప్పల మండలంలో ఓ రైతు భూమిని మరో రైతు ఖాతాలోకి ఎక్కించారు. ఇదెక్కడి న్యాయం? మేం అమ్మలేదు. ఆయన కొనలేదు. ఆఖరికి సాదాబైనామా కూడా కాదు. మరి మా భూమిని మరొకరి పేరిట ఎట్లా రాస్తారంటూ మూడేండ్ల నుంచి తిరుగుతున్నారు. అవును.. పొరపాటు జరిగిందంటూ లిఖితపూర్వకంగా ఇచ్చారు. సరి చేయడానికి ఎవరి ఖాతాలోనైతే రాశారో ఆయన అనుమతి తీసుకోవాలంటున్నారు. ఆయనకు నోటీసులు ఇచ్చి సమాధానం వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు. ఇదెక్కడి ఘోరం? ఆయనకేం సంబంధం? ఇప్పుడా వ్యక్తి రాకపోతే చేయరా? ఈ బాధిత రైతుల అప్లికేషన్లు కూడా పలుమార్లు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అప్లై చేశారు. మళ్లీ అదే తంతు.

వెరిఫై చేస్తే సాధ్యమే

డేటా కరెక్షన్, ల్యాండ్ మ్యాటర్ సమస్యల పరిష్కారం కష్టంగా మారింది. పెరిగిన భూ విస్తీర్ణంతో సర్వే నంబర్ల మిస్సింగ్, ఎక్కువ/తక్కువ సవరణలు చేయలేకపోతున్నారు. అసాధ్యమేం కాదు. కానీ పాత రికార్డులన్నీ వెరిఫై చేసే సిబ్బంది అవసరమని అధికారులు అంటున్నారు. ఏ రైతు ఖాతా నుంచి అమ్మేసిన భూమిని తొలగించాలో డేటా వెతికితే సవరణ చేయడం కష్టం కాదు. ఐతే ప్రతి సంవత్సరం రికార్డును పరిశీలించి అధికంగా పడిన రైతు ఖాతా నుంచి తొలగించొచ్చు. కానీ ఇప్పటి దాకా ఈ దరఖాస్తులను పెండింగ్ పెట్టారు. ఆఖరికి డేటా తప్పుగా పడిందంటూ లిఖితపూర్వకంగా రాసిచ్చిన బాధితులకు కూడా న్యాయం చేయడం లేదు. ధరణి పోర్టల్​అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆర్ఎస్ఆర్(రీసెటిల్మెంట్​ఆఫ్​సర్వే రికార్డ్) తేడా ఉండడం కూడా కొందరు రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తున్నది.

ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్​, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, మెదక్​, వికారాబాద్​జిల్లాల్లో రికార్డుల్లోని భూమి కంటే ఎక్కువగా అమ్మినట్లు తెలుస్తున్నది. ఈ నాలుగైదు జిల్లాల్లోనే లక్ష డాక్యుమెంట్ల వరకు ఉండొచ్చునని అంచనా. అంటే విక్రయించిన భూమినే చూపి మళ్లీ అమ్మేసిన విస్తీర్ణం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. ఐతే కొన్ని మండలాల్లో ముందు కొనుగోలు చేసిన వారికి హక్కులు కల్పించకుండా.. తర్వాత కొనుగోలు చేసిన వారికే పాసు పుస్తకాలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపించాలంటే ఎన్నేండ్లు పడుతుందోనన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed