KTR మెడకు మరో ఉచ్చు.. పక్కా ప్లాన్ ప్రకారం వేట మొదలెట్టిన రేవంత్ సర్కార్..?

by Satheesh |
KTR మెడకు మరో ఉచ్చు.. పక్కా ప్లాన్ ప్రకారం వేట మొదలెట్టిన రేవంత్ సర్కార్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫార్ములా ఈ-రేస్, ‘రెరా’ శివ బాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం ఐఏఎస్ అరవింద్ వయా మాజీ మంత్రి కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్‌ కనుసన్నల్లోనే ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్‌మెంట్లు, లావాదేవీలు జరిగాయన్న ఓపెన్ టాక్ ఉన్నది. ఆ శాఖకు మంత్రే అయినా డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారన్న ఆరోపణలూ గతంలో ఉన్నాయి. ‘ఫార్ములా ఈ-రేస్‌ అంతా మంత్రి మాట ప్రకారమే’ అంటూ గతంలో అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు శివబాలకృష్ణ స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనకు నోటీసు ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ పేరు వెలుగులోకి వస్తుందనే టాక్ వినిపిస్తున్నది. శివ బాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైన పదవుల్లో కొనసాగడానికి కేటీఆర్ అండదండలే కారణమనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.

పక్కా ప్లాన్ ప్రకారం వేట

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఇష్యూలో ఐఏఎస్ అరవింద్.. మంత్రి కేటీఆర్ పేరు వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం అరవింద్‌ను పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించి విపత్తు నిర్వహణ విభాగానికి బదిలీ చేసింది. స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం కోరడంతో జనవరి 24న సీఎస్‌కు రిప్లైలోనూ ‘మంత్రి ఆదేశంతోనే..’ అనే క్లారిటీ ఇచ్చారు.

సెకండ్ ఎపిసోడ్‌గా ‘రెరా’ బాలకృష్ణ

ఓ వైపు ఐఏఎస్ అరవింద్ వ్యవహారం నడుస్తుండగానే ‘రెరా’ సెక్రటరీ శివ బాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన, బంధువుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. రూ.కోట్ల నగదు, బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రియల్ సంస్థలతో ఒప్పందాలు.. ఇలాంటివెన్నో బయట పడ్డాయి. ఎనిమిది రోజుల కస్టడీలో వెలుగులోకి వచ్చిన అంశాలు, వీటి వెనుక ఉన్నదెవరు, అధికారుల అండదండలు, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలున్నాయి, బినామీ పేర్లతో స్థిరాస్తుల కొనుగోళ్లు.. తదితర విషయాలను శివ బాలకృష్ణ తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నట్లు ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి.

అన్ని దారులూ కేటీఆర్ వైపే..

ఫార్ములా ఈ-రేస్, శివ బాలకృష్ణ అక్రమార్జన వ్యవహారం అరవింద్ ద్వారా చివరకు కేటీఆర్ దగ్గరకే చేరేలా కనిపిస్తున్నది. ఉన్నతాధికారి అండదండలు లేకుండా శివ బాలకృష్ణ పెద్ద మొత్తంలో సంపాదించేవారు కాదని, మంత్రి ప్రమేయం లేకపోతే అరవింద్ కూడా సాహసించేవారు కాదన్న జనరల్ టాక్ వినిపిస్తున్నది. ఏయే రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి.. నిబంధనల ఉల్లంఘన ఏ మేరకు జరిగింది.. పర్మిషన్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది.. దీని ద్వారా ప్రయోజనం పొందిందెవరు.. ఏయే స్థాయిలో ఎవరికి ఎంత ముట్టింది.. ఎవరికి ఎవరు బినామీలుగా ఉన్నారు.. కేటీఆర్‌కు ఉన్న సంబంధాలు.. వాటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పొందిన ప్రయోజనం, ఆ సంస్థల్లో ఉన్న డైరెక్టర్లు, షేర్ హోల్డర్లలో ఉన్నవారితో ఉన్న లింకులు.. ఇలాంటివి దర్యాప్తులో కీలకంగా మారాయి.

ఎన్నికల ప్రచారంలోనే రేవంత్ కామెంట్లు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం టైంలోనే పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు పది వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, మంత్రి కేటీఆర్ సహా కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి చర్యగా ఫార్ములా ఈ-రేస్ దర్యాప్తు మొదలైంది. దానికి కొనసాగింపే శివ బాలకృష్ణ ఆస్తులపై ఏసీబీ సోదాలు అని చెప్పొచ్చు. ఇక భూముల లావాదేవీలు, ప్రభుత్వం నుంచి మంజూరైన అనుమతులు, మంత్రి కనుసన్నల్లో సంపూర్ణ సహకారం అందించిన అరవింద్.. ఇష్యూస్ వంటివన్నీ మరింత స్పష్టంగా త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story