ఆ ఆరుగురికి లూప్ లైన్ తప్పదా..? CM రేవంత్ నిర్ణయంపై సస్పెన్స్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-12-15 11:18:50.0  )
ఆ ఆరుగురికి లూప్ లైన్ తప్పదా..? CM రేవంత్ నిర్ణయంపై సస్పెన్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు, అవినీతి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని మంత్రులకు సైతం వ్యూహాత్మకంగా బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు ఆయా శాఖల కార్యదర్శుల నియామకం విషయంలోనూ లోతుగా స్టడీ చేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమర్థతతో పాటు నిబద్ధత, చిత్తశుద్ధి, హార్డ్ వర్క్ తదితరాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో దీర్ఘకాలం పాటు పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారుల విషయంలో రేవంత్ ఎలా వ్యవహరిస్తారన్నది సచివాలయ వర్గాల్లోనే ఆసక్తికరంగా మారింది.

వారికి లూప్ లైన్ తప్పదా?

ప్రభుత్వ మార్పుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటకాగిన కొందరు సీనియర్ బ్యూరోక్రాట్ల పోస్టింగ్ లపై ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి కార్యదర్శిగా వ్యవహరించి స్మితా సభర్వాల్ మిషన్ భగీరథ స్కీమ్‌తో పాటు గ్రామీణాభివృద్ధి లాంటి అంశాలలో సీఎంఓ తరఫున బాధ్యతలు చూశారు. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్టుమెంటుకు సైతం అదనపు బాధ్యతలు చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను ఎక్కడకు బదిలీ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది.

మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ వ్యవహరించిన టైమ్‌లో ఆయనకు అన్నీ తానై వ్యవహరించిన అరవింద్ కుమార్ ఇకపైన లూప్‌లైన్‌లోకి వెళ్ళక తప్పదని, ఔటర్ రింగు రోడ్డు వ్యవహారంలో ఆయన వ్యవహారశైలిపై గతంలోనే రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినందున ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్ ఇస్తారన్న చర్చ జరుగుతున్నది. అలాగే కేటీఆర్ నిర్వహించిన ఐటీ, పరిశ్రమల శాఖకు దాదాపు పడేండ్లుగా కార్యదర్శిగా వ్యవహరించేన ప్రస్తుత స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ విషయంలోనూ సచివాలయం సర్కిళ్లలో చర్చలు జరుగుతున్నాయి. ఐటీ మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిన్న నిర్వహించిన సమావేశంలో ఐటీ శాఖకు సంబంధించిన అంశాలపై రివ్యూ చేశారు.

అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఇప్పటి ప్రభుత్వంపై బురదజల్లే తీరులో మీడియాకు ఇన్‌పుట్స్ అందించి రాయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో దీన్ని ఆ మీటింగులో మంత్రి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆయనను కూడా లూప్‌లైన్‌లోకి బదిలీ చేయవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. జలమండలికి దీర్ఘకాలంగా ఎండీగా వ్యవహరించిన దానకిషోర్, వ్యవసాయ శాఖకు కార్యదర్శిగా, కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రఘునందన్‌రావు, ప్రస్తుతం రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ తదితరులను కూడా బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది సీనియర్ అధికారుల వాదన. అయితే వీరిని ప్రభుత్వం లూప్ లైన్ లోనే ఉంచుతుందా లేకా వేరే ఇతర బాధ్యతల్లోకి మారుస్తుందా అనేది తేలాల్సి ఉంది.

సీఎస్, డీజీపీ పోస్టులపై ఉత్కంఠ

బాధ్యతలు చేపట్టాక క్రమంగా అధికారుల బదిలీలు, వారికి పోస్టింగ్ లపై చక చక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మిగతా పోస్టులపై కూడా కూడా విస్తృతంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో నియమించబడిన సీఎస్ శాంతికుమారి విషయంలో రేవంత్ రెడ్డి డిసిషన్ ఏంటో తెలియాల్సి ఉంది. కేసీఆర్ సర్కార్ నియమించిన డీజీపీ అంజనీ కుమార్ పై సీఈసీ సస్పెన్షన్ వేటు వేయడంతో ఆయన స్థానంలో రవీ గుప్తా డీజీపీగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇటీవలే అంజనీకుమార్ పై విధించిన సస్పెన్స్ ను ఈసీ ఎత్తివేసింది. దీంతో సీఎస్, డీజీపీ పోస్టులను యధావిథిగా కొనసాగిస్తారా లేక వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తారా అనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొంత మంది సీనియర్లు ఈ రెండు పోస్టులపై ఆసక్తితో ఉన్నట్లు చర్చ జరుగుతున్న వేళ రేవంత్ రెడ్డి వీరినే కొనసాగిస్తారా లేక మార్చివేస్తారా అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story

Most Viewed