విద్యుత్‌శాఖలో బయటపడ్డ అక్రమాలు.. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి!

by GSrikanth |
విద్యుత్‌శాఖలో బయటపడ్డ అక్రమాలు.. ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి!
X

దిశ, ఖమ్మం: ఎన్పీడీసీఎల్ శాఖలో తిన్న ఇంటి వాసాలు లెక్కపెడుతున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అనే చందంగా తయారైంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది అక్రమంగా డబ్బులు సంపాదించే ధ్యేయంగా తప్పటడుగులు వేస్తున్నారు. మన సంస్థలో మనల్ని పట్టుకునే వారు ఎవరు అంటూ హద్దులు దాటుతున్నారు. ఖమ్మం డివిజన్ పరిధిలోని టౌన్ టూ సెక్షన్‌లో అనధికార మీటర్ దొరికిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టౌన్ సెక్షన్ పరిధిలోని బాబు రావు పెట్రోల్ బంక్ సందులోని ఓ హాస్పిటల్‌కు అనధికార మీటర్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు డీపీఈ అధికారులు పక్క సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. అక్కడ జరుగుతున్న తతంగం చూసి అధికారులే షాక్‌కు గురయ్యారు.

అసలు ఏం జరిగింది..?

ఖమ్మం డివిజన్ పరిధిలోని టౌన్ వన్ ప్రాంతమైన మేకల నారాయణ నగర్ ఏరియాలో ఓ వినియోగదారుడు సింగిల్ ఫేజ్ మీటర్ ద్వారా విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుందని గ్రహించి తనకు త్రీ ఫేజ్ మీటర్ కావాలంటూ విద్యుత్ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అధికారులు వినియోగదారుడి విద్యుత్ వినియోగం తగ్గట్టు త్రీ ఫేజ్ మీటర్ మంజూరు చేశారు. అయితే సింగల్ ఫేజ్ మీటర్ స్థానంలో త్రీ ఫేస్ మీటర్ బిగించారు. తీసిన సింగిల్ ఫేజ్ మీటర్ ఎల్టి ల్యాబ్‌కి హ్యాండ్ ఓవర్ చేయకుండా అధికారులు కార్యాలయంలోనే ఉంచుకున్నారు. అయితే ఈ మీటర్ 2017లో మంజూరు చేసినట్లు సమాచారం. 2017 నుంచి ఈ సింగిల్ ఫేజ్ మీటర్ ఖమ్మం నగరంలో పలు వినియోగదారులు సింగిల్ ఫేజ్ మీటర్ ద్వారా అక్రమంగా విద్యుత్ వాడినట్టు సిబ్బందే బహిరంగంగా చెబుతున్నారు. అదే మీటర్ డీఈపీ అధికారుల తనిఖీలో బయట పడిందని సిబ్బంది చెబుతున్నారు.

అసలు కార్యాలయంలో ఉంచిన మీటర్ బయటకు ఎలా వచ్చిందో అర్థంకాని విషయం. అపుడు పనిచేస్తున్న ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్, జూనియర్ లైన్ మేన్ ఎవరు కూడా సింగిల్ ఫేజ్ మీటర్‌ను ఎల్టీటీ ల్యాబ్‌లో ఇచ్చారో లేదో అధికారులు కూడా పట్టించుకోలేదు. అసలు ఈ మీటర్ ఎక్కడ ఉందో...? అసలు ఈ మీటర్ బిల్లు వస్తుందో లేదో..? ఇప్పటివరకు అధికారులు అది ఆ దిశగా దృష్టి సారించ లేదంటే వారి పనితనం ఎలా ఉందో అర్థమవుతుంది. ఈ డీపీఈ అధికారుల విచారణలో తేలింది ఏమిటీ అంటే విద్యుత్ శాఖలో స్పాట్ బిల్డర్ కృష్ణ అనే వ్యక్తి డబ్బులు తీసుకుని ఆసుపత్రిలో బిగించాడు. అయితే ఆసుపత్రిలో 15 రోజుల పాటు అధికార మీటర్ ద్వారా నడిచిన తర్వాత మీటర్ గుడ్డును పీకి అనధికార మీటర్‌ను బిగిస్తారు. అయితే అ ప్రాంతానికి అతనే బిల్లు తీస్తారు కాబట్టి ఇది సాధ్యం అయిందని సిబ్బంది చెబుతున్నారు. అయితే అక్రమంగా విద్యుత్ వాడకం చేసిన ఆసుపత్రికి భారీగా జరిమానా విధించినట్లు సమాచారం. అనధికార మీటర్ ఇచ్చిన సిబ్బంది కృష్ణపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి

2017 సంవత్సరంలో మంజూరు అయినా మీటర్ వినియోగదారుడు నుంచి తీసుకొని వచ్చిన తర్వాత అధికారులు ఎందుకు ఎల్ టీ ల్యాబ్‌కు హ్యాండ్ ఓవర్ చేయలేదు అధికారులు ఆ దిశగా విచారణ చేపట్టలేదు. తనిఖీల్లో దొరికిన సిబ్బందిపై కేసులు నమోదు చేస్తున్నారో తప్ప అసలు దొంగలను ఎందుకు పట్టుకోవడం లేదని ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది బహిరంగంగా విమర్శిస్తున్నారు. గతంలో అర్బన్ సెక్షన్‌లో సిటీ మీటర్లు దొరికినప్పుడు అసలైన వారిని వదిలి పెట్టి సబ్ ఇంజినీర్ సస్పెండ్ చేశారు. ఆదే కేసులో ఏఈపై బదిలీ వేటు పడింది. ముదిగొండ మండలంలో మీటర్లు పోయిన అని కేసు నమోదు చేశారు. నెలకొండపల్లిలోని రాజేశ్వరపురం గ్రామంలో కూడా అనధికార మీటర్లు దొరికినట్టు సమాచారం. మధిర, రఘునాథ పాలెం ప్రాంతాల్లో సింగిల్ ఫేజ్ మీటర్లు దొరికాయి. అక్కడ అసలైన వారిని వదిలి పెట్టి క్రింది స్థాయి సిబ్బంది పై చర్యలు తీసుకోని చేతులు దులుపుకున్నారు. ఎన్పీడీసీఎల్ జరుగుతున్న ఇంటి దొంగల తతంగం పై సిఎండి దృష్టి సారించి అసలైన వారిపై చర్యలు తీసుకోవాలని సిబ్బంది, వినియోగదారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed