ఫ్యూచర్‌లో ఒక సామాన్య కార్యకర్తే తెలంగాణ సీఎం: ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు

by Satheesh |
ఫ్యూచర్‌లో ఒక సామాన్య కార్యకర్తే తెలంగాణ సీఎం: ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీజేపీకి కొత్త వ్యక్తి కాదని, ఆయన పాత వ్యక్తి అయిపోయారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. పార్టీలో కొత్త పాత లేదని, బీజేపీలో చేరిన వారందరూ పాతవారేనంటూ పేర్కొన్నారు. శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్ హాల్‌లో శక్రవారం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు నొవాటెల్‌లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడారు. రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని, కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందని తెలిపారు.

దక్షిణ భారతంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని, ఇందుకు కేరళలో బీజేపీ ఖాతా తెరవడంతో పాటు తమిళనాడులో మెరుగైన ఓటు బ్యాంక్ సాధించడమే నిదర్శనమని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీని నంబర్ వన్ పార్టీగా మార్చేందుకు తమవద్ద 1500 రోజుల ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి కూడా కాంగ్రెస్ వంద మార్క్‌ను టచ్ చేయలేదని ఎద్దేవాచేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని చురకలంటించారు. అయినా కాంగ్రెస్ నేతలు అహంకారంగా మాట్లాడుతున్నారని ధర్మేంద్ర ప్రధాన్ విమర్శనాస్త్రాలు సంధించారు. ఇండియా కూటమికి నాయకత్వమే లేదని ఫైరయ్యారు. కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తరచూ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్డీయే అధికారంలో ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంచేశారు. ప్రధానిగా మోడీ ఉన్నంత వరకు రిజర్వేషన్లకు ఎలాంటి ఢోకా ఉండబోదని భరోసానిచ్చారు.

తెలంగాణ ప్రభుత్వం హిందూ విరోధి అంటూ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ కోసం బీజేపీ మద్దతు ఇచ్చిందని, కానీ తెలంగాణ ఏర్పాటయ్యాక పదేళ్లు ఒక కుటుంబం రాష్ట్రాన్ని నాశనం చేసిందని విమర్శలు చేశారు. పదేళ్లలో తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర సహకారం అందించిందని తెలిపారు. రాష్ట్రంలో పోలింగ్ బూత్ లెవెల్‌లో బీజేపీని మరింత బలపర్చాల్సిన అవసరం ఉందని ఆయన శ్రేణులకు సూచనలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు నిద్రపట్టకుండా చేస్తేనే బీజేపీ ఫస్ట్ స్థానంలోకి వస్తుందని దిశానిర్దేశం చేశారు. ఊర్లో ఉన్న ప్రతి సమస్యను బీజేపీ కార్యకర్త సామరస్యంగా పరిష్కరించాలని సూచనలు చేశారు. అప్పుడే స్థానికంగా పార్టీ బలోపేతమవుతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అనేది నేతల పదవుల కోసం కాదని, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. నీట్ అంశంపై మీడియా ప్రశ్నించగా కేంద్ర విద్యాశాక మంత్రి మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ కేసు సుప్రీం కోర్టులో ఉందని, త్వరలో నిజాలు తేలుతాయని చెప్పారు.

Advertisement

Next Story