Tirupathi Reddy: హరీశ్ రావు, కేటీఆర్ కుట్రలో భాగంగానే కలెక్టర్ పై దాడి.. సీఎం అన్న సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Tirupathi Reddy: హరీశ్ రావు, కేటీఆర్ కుట్రలో భాగంగానే కలెక్టర్ పై దాడి.. సీఎం అన్న సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటన బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు, కొడంగల్ కాంగ్రెస్ ఇన్ చార్జి తిరుపతి రెడ్డి (Tirupati Reddy) ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేరును బద్నాం చేయడానికి అమాయకులైన రైతులను హరీశ్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) రెచ్చగొట్టి ఈ రకంగా దాడులకు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ (Pratik Jain) ను పరామర్శించిన తిరుపతి రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్, అధికారులపై దాడిని ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలనే అరెస్టు చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కొడంగల్ (Kodangal) లో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. వారందరినీ అరెస్టు చేస్తున్నారా అని ప్రశ్నించారు. దాడి ఘటనలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉన్నదో వారినే అరెస్టు చేస్తున్నారన్నారు. అభివృద్ధి నిరోధకులను చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. కానీ దాని ముసుగులో అధికారులపై దాడులు సరికావన్నారు. మల్లన్నసాగర్ లో వందలాది మంది రైతులను రాత్రులంతా ఊర్లు తిప్పుతూ వారిని కొట్టి భూసేకరణ చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అలా ఏమైనా జరుగుతుందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలను ఒప్పించి భూసేకరణ చేసే ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed