రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన బీఆర్ఎస్.. ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన విషయాలివే!

by GSrikanth |
రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన బీఆర్ఎస్.. ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన విషయాలివే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: 60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని మాజీ సీఎం కేసీఆర్ పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా అప్పులు మాత్రం ఐదారు రెట్లు పెరిగిపోయాయి. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం రూ.61,711.50 కోట్ల రుణభారం (ఆర్‌బీఐ నుంచి తీసుకున్నవి) ఉంటే ఈ ఏడాది మార్చి నాటికి అది రూ.3,66,306 కోట్లకు చేరుకున్నది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మరో రూ.36,378 కోట్లను స్టేట్ డెవలప్‌మెంట్ లోన్ పేరుతో అప్పు తీసుకున్నది. దీంతో మొత్తం అప్పు రూ.4,02,684 కోట్లకు చేరుకున్నది. ఇక ఉత్తర, దక్షిణ డిస్కంల అప్పులు మరో రూ.57,239 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నది రూ.97,449 కోట్లు, మిషన్ భగీరథ కోసం తీసుకున్న రూ.23,984 కోట్లు కలిపితే మొత్తం అప్పు రూ.5,81,356 కోట్లకు చేరుకున్నది. ఇదే కాకుండా కొన్ని కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల వివరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం గోప్యంగానే ఉంచింది. అవి కూడా కలిపితే అప్పుల భారం మరింత ఎక్కువగానే ఉంటుంది.

దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, దళితబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి.. ఇలా అనేక రకాలుగా ఏయే స్కీమ్ కింద ప్రజలకు ఏ మేరకు లబ్ధి చేకూర్చిందో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతి నివేదిక రూపంలో వెల్లడించింది. తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిందని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నామని పేర్కొన్న స్టేట్ గవర్నమెంట్ తలసరి అప్పు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ‘అప్పుచేసి పప్పుకూడు’ తరహాలో ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, రాబోయే ప్రభుత్వాలమీద మోయలేని భారాన్ని మోపిందని విపక్షాలు తూర్పారబట్టాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇప్పటి వరకూ ఉన్న ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేసే పనిలో ఉన్నది.

అన్నింటికీ అప్పులపైనే ఆధారం :

రాష్ట్రం ఏర్పడే నాటికి ఉమ్మడి రాష్ట్రానికి రూ.1.48 లక్షల కోట్ల అప్పు ఉంటే తెలంగాణ వాటా రూ. 61,711 కోట్లుగా ఫిక్స్ అయింది. ఆ తర్వాత ప్రతి ఏటా రిజర్వు బ్యాంకు నుంచి, కేంద్ర ప్రభుత్వం దగ్గరా, ద్రవ్య సంస్థల నుంచి రుణాలు తీసుకుంటూనే ఉన్నది. ప్రతి ఏటా సగటున రూ.40 వేల కోట్ల చొప్పున అప్పు తీసుకుంటూ ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ రూపంలో తీసుకున్న రుణం, ప్రస్తుతం ఔట్ స్టాండింగ్ (తీర్చాల్సింది)గా ఉన్నది రూ. 4,02,684 కోట్లు. 25 ఏండ్లలో తీర్చేలా రుణం తీసుకున్నందున ఇకపైన వచ్చే ప్రభుత్వాలు 2045 వరకూ క్రమంగా తీర్చడం అనివార్యంగా మారింది.

ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు అదనం

కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు వీటికి అదనం. కాళేశ్వరం, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని ‘కాగ్’ పలుమార్లు తన వార్షిక నివేదికలో పేర్కొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.97,449 కోట్లను ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్నది. 2035 ఆగస్టుకల్లా వడ్డీతో సహా ‘అసలు’ చెల్లించాల్సి ఉన్నది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు రూ.9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% (రూ.23,984 కోట్లు) రుణం రూపంలో తీసుకున్నదే.

తీర్చడానికి దారేది?

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టులను అప్పులు తీసుకుని నిర్మించి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రీపేమెంట్ చేయడానికి ఉన్న మార్గమేంటని కాగ్ తన నివేదికల్లో ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క పైసా ఆదాయం రాకపోగా ప్రతి ఏటా పంపుల వినియోగం కోసం విద్యుత్ బిల్లుల చెల్లింపు మోయలేని భారంగా ఉంటుందని, అప్పులు తీర్చడానికి వేటి మీద ఆధారపడుతుందని ప్రభుత్వంపై అక్షింతలు వేసింది. మిషన్ భగీరథ విషయంలోనూ ఆదాయం రాని స్కీమ్‌గానే ఉన్నదని, తిరిగి రుణాల చెల్లింపునకు ఉన్న మార్గాలేంటని నిలదీసింది. దీనికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కరువైంది. గతంలో చేసిన అప్పుల్ని తీర్చేందుకు తిరిగి అప్పులు చేయాల్సి వస్తున్నది. వాటిపైన వడ్డీ చెల్లింపులే ప్రభుత్వానికి గుదిబండగా మారింది.

ఏటేటా పెరుగుతున్న వడ్డీ చెల్లింపులు

పాత అప్పులు తీర్చేందుకు ఏడాది మొత్తానికి రూ.5,925 కోట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో బడ్జెట్‌లో పేర్కొంటే ఆ తర్వాతి సంవత్సరానికి అది రూ.7,554 కోట్లకు చేరుకున్నది. ఈ పదేండ్లలో చేసిన అప్పులకు ప్రతి నెలా/క్వార్టర్‌కు వడ్డీ చెల్లించడం అనివార్యం కావడంతో డెట్ సర్వీస్ పేరుతో ఈ ఏడాది రూ.22,407 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. ఇలా చెల్లిస్తున్న వడ్డీ మొత్తం కేవలం రిజర్వు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించినదే. ఇక కాళేశ్వరం, భగీరథ ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులపై వడ్డీ చెల్లింపులు దీనికి అదనం. కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అప్పులు చేయడంతో గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించింది. రిజర్వుబ్యాంకు ద్వారా తీసుకునే అప్పుల్లో కోత పెట్టింది. ఆ ఆంక్షలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటివరకూ కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను వెల్లడించలేదు.

అప్పుల ఊబిలో డిస్కంలు

రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ డిస్కంలు పీకల్లోతు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఏటేటా వీటి అప్పులు పెరిగిపోతున్నాయి. వ్యవసాయానికి ఉచిత కరెంటు మొదలు ప్రభుత్వ ఆఫీసులకు వాడే విద్యుత్ వరకు ప్రభుత్వం నుంచి బిల్లుల చెల్లింపు సక్రమంగా జరగక బకాయిలు పేరుకుపోతున్నాయి. ట్రూ అప్ చార్జీల భారాన్ని ఐదేళ్ల పాటు భరిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. ఆ చెల్లింపులూ లేవు. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి కొంటున్న విద్యుత్ కోసం సుమారు రూ.3 వేల కోట్లు బకాయి ఉన్నట్లు సమాచారం. సింగరేణి సంస్థకు కూడా తెలంగాణ జెన్ కో దాదాపు రూ.20 వేల కోట్లకు పైగా బకాయి పడినట్లు అధికారుల సమాచారం. డిస్కంల ఆస్తులకంటే అప్పులే ఎక్కువ ఉన్నట్లు తేలింది. రెండు డిస్కంలకు కలిపి సుమారు రూ.57,239 కోట్ల మేర అప్పులున్నట్లు వార్షిక నివేదికల ద్వారా వెల్లడైంది.

ఆర్థిక నిర్వహణలో వైఫల్యం

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై తలసరి రుణభారాన్ని మోపిందంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని విపక్షాలు తూర్పారబట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ స్కీముల ద్వారా వచ్చే ఫండ్స్‌ను సైతం రాష్ట్ర అవసరాలకు వేరే స్కీములకు డైవర్ట్ చేసిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆర్థిక వ్యవస్థపై రివ్యూ చేశారు. అన్ని శాఖల నుంచి గణాంకాలను కోరిన ప్రభుత్వం వివరాలన్నీ అందిన తర్వాత సమగ్ర నివేదికను తయారు చేసి శ్వేతపత్రం రూపంలో విడుదల చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నది. పదేండ్లలో జరిగిన ఆర్థిక అవకతవతలు, దుబారా అంశాలను ఖుల్లం ఖుల్లాగా విడమర్చి చెప్పాలని, కొత్త ప్రభుత్వంపై మోపిన భారాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటున్నది.

రాష్ట్రం ఏర్పడేనాటికి (ఆర్‌బీఐ) అప్పు : 61,711 కోట్లు

2015 మార్చి నాటికి : రూ. 83,845 కోట్లు

2016 మార్చి నాటికి : రూ.1,29,531 కోట్లు

2017 మార్చి నాటికి : రూ.1,52,190 కోట్లు

2018 మార్చి నాటికి : రూ.1,75,281 కోట్లు

2019 మార్చి నాటికి : రూ. 2,05,858 కోట్లు

2020 మార్చి నాటికి : రూ. 2,44,019 కోట్లు

2021 మార్చి నాటికి : రూ. 2,88,452 కోట్లు

2022 మార్చి నాటికి : రూ. 3,22,993 కోట్లు

2023 మార్చి నాటికి : రూ. 3,66,306 కోట్లు

2023 డిసెంబరు ఫస్ట్ వీక్ నాటికి : 4,02,684 కోట్లు

రెండు డిస్కంల అప్పులు : రూ. 57,239 కోట్లు

మొత్తం రుణ భారం : రూ. 5,81,356 కోట్లు

ఉత్తర డిస్కం రుణాలు :

2015 మార్చి నాటికి : రూ. 4,762 కోట్లు

2016 మార్చి నాటికి : రూ. 5,983 కోట్లు

2017 మార్చి నాటికి : రూ. 7,132 కోట్లు

2018 మార్చి నాటికి : రూ. 9,009 కోట్లు

2019 మార్చి నాటికి : రూ. 11,670 కోట్లు

2020 మార్చి నాటికి : రూ. 15,540 కోట్లు

2021 మార్చి నాటికి : రూ. 15,351 కోట్లు

2022 మార్చి నాటికి రూ. 19,023 కోట్లు

దక్షిణ డిస్కం రుణాలు :

2015 మార్చి నాటికి : రూ. 12,601 కోట్లు

2016 మార్చి నాటికి : రూ. 15,146 కోట్లు

2017 మార్చి నాటికి : రూ. 17,303 కోట్లు

2018 మార్చి నాటికి : రూ. 20,667 కోట్లు

2019 మార్చి నాటికి : రూ. 25,448 కోట్లు

2020 మార్చి నాటికి : రూ. 27,801 కోట్లు

2021 మార్చి నాటికి : రూ. 30,946 కోట్లు

2022 మార్చి నాటికి : రూ. 38,216 కోట్లు

రెండు డిస్కంలకు కలిపి పదేండ్లలో రుణం : రూ.57,239 కోట్లు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న మొత్తం రూ.97,449 కోట్ల రుణంలో...

ఆంధ్రాబ్యాంకు కన్సార్టియం నుంచి : రూ. 7,400 కోట్లు

పంజాబ్ నేషనల్ బ్యాంకు : రూ.11,400 కోట్లు

బరోడా బ్యాంకు : రూ.2,150 కోట్లు

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ : రూ. 37,737 కోట్లు

రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ : రూ.30,536 కోట్లు

నాబార్డు : రూ.8,226 కోట్లు

అసలు తీర్చింది రూ.3,621 కోట్లు

వడ్డీ చెల్లించింది : రూ.14,178 కోట్లు

అప్పు తీర్చాల్సింది : 2035 ఆగస్టు చివరికల్లా

డిస్కంలకు విద్యుత్ వినియోగం బకాయి : రూ. 9,200 కోట్లు

మిషన్ భగీరథ

ప్రాజెక్టు వ్యయం : రూ.46,123 కోట్లు

ఖర్చు చేసింది : రూ.29,010 కోట్లు

రుణాలు తెచ్చుకున్నది : రూ.23,984 కోట్లు

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి : రూ.2,392 కోట్లు

కేంద్రం స్కీముల నుంచి వెచ్చించింది : రూ.704 కోట్లు

రీపేమెంట్ చేసిన రుణం : రూ.2,898 కోట్లు

Advertisement

Next Story