రాష్ట్ర లోగో మార్పులపై BRS ఆందోళనలు.. పొలిటీషియన్లతో CM రేవంత్ సమావేశం

by Gantepaka Srikanth |
రాష్ట్ర లోగో మార్పులపై BRS ఆందోళనలు.. పొలిటీషియన్లతో CM రేవంత్ సమావేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నానికి చిక్కులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఉన్న లోగోలో మార్పులు చేయడంపై బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ ఇమేజ్‌లను తొలగించడంపై వివిధ పక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) లోగోను పోలి ఉన్నదంటూ సోషల్ మీడియా వేదికగా సెటైర్లు కూడా వినిపించాయి. వీటన్నింటిని నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన సుమారు 45 మందితో ముఖ్యమంత్రి రేవంత్ సచివాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలకు ప్రభుత్వం తరఫున ఆహ్వానం వెళ్ళింది. సాయంత్రానికి లోగో విడుదలపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనున్నది. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే సభలో లోగో ఆవిష్కరణ ఉండకపోవచ్చని, కేవలం రాష్ట్ర గీతం లాంచింగ్ మాత్రమే ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తప్పనిసరి అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో సైతం లోగోను ఫైనల్ చేయడానికి దాదాపు ఏడాది పాటు కష్టపడాల్సి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే లోగోపై కేంద్ర హోంశాఖ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుందని, ఆ తర్వాతనే నిర్ణయాన్ని వెలువరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా చేయడానికి వీలుండదన్నారు. కేంద్ర హోంశాఖ నుంచి అనుమతి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం లోగోను రిలీజ్ చేసినా, ఫైనల్ చేసినట్లు అధికారికంగా ప్రకటన చేసినా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్ర గీతం, అధికారిక చిహ్నంపై సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి కాంగ్రెస్ సహా సీపీఐ, సీపీఎం, మజ్లిస్, తెలంగాణ జనసమితి పార్టీలకు చెందిన ప్రతినిధులకు ఆహ్వానం వెళ్ళింది. రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా పార్లమెంటు సభ్యులుగా ఉన్న పలువురిని కూడా ఆహ్వానించినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగానే విజయశాంతిని కూడా ఆహ్వానించారని, కానీ ఆమె ఒక సినిమా షూటింగ్‌లో భాగంగా వేరేచోట ఉన్నందున హాజరు కాలేనంటూ సమాచారం పంపినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. సచివాలయంలో సమావేశం కంప్లీట్ అయిన తర్వాత అధికారిక చిహ్నం రిలీజ్‌పై ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశమున్నది. కానీ సచివాలయ వర్గాలు మాత్రం జూన్ 2న రాష్ట్ర గీతం లాంచింగ్ మాత్రమే ఉంటుందని, లోగో విడుదల ఉండకపోవచ్చని సూచనప్రాయంగా తెలిపాయి.

Advertisement

Next Story

Most Viewed