ఒకరు పోతే.. పది మంది నేతలను తీర్చిదిద్దుకుంటాం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

by Shiva |
ఒకరు పోతే.. పది మంది నేతలను తీర్చిదిద్దుకుంటాం: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకరు పోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుకుంటుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. పార్టీయే నాయకులను తయారు చేస్తది తప్ప..నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరని స్పష్టం చేశారు. శుక్రవారం ఎర్రవెల్లి ఫాం హౌజ్ లో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కేడర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడైనా నేడైనా నాయకులను తయారు చేసుకున్నది పార్టీయేనన్నారు. మెరికల్లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తదని వెల్లడించారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపు నిచ్చారు. ఇంకా నెరవేరని ప్రజా ఆకాంక్షలను భవిష్యత్తులో నెరవేర్చే సత్తా, డెప్త్ మనకే ఉన్నదన్నారు. సమైక్యవాదులతో కలబడి.. నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఒక లెక్కనే కాదని, పార్టీ నుంచి పోయి దొంగల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలి ఉన్నాయని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నదన్నారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిష్కరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ కు మాత్రమే ఉన్నదని వివరించారు. మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ఇంకా బాగా ప్రజలకోసం పనిచేయాల్సి ఉందని, ప్రజలు అవకాశమివ్వడంతో గత పదేండ్లు చిత్తశుద్ధితో రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధనదిశగా లక్ష్యం ప్రకారం పనిచేసి ప్రగతిని సాధించి ప్రజల మన్ననలను పొందామన్నారు.

కుల మతాలకతీతంగా పని చేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. కుల వృత్తులను అభివృద్ధి చేసి గ్రామ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేశామన్నారు. కొన్ని కొన్ని సార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తాపడుతుంటారని, మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. అంతమాత్రాన నిరుత్సాహపడొద్దు అని, అధికారం ఉంటేనే పనిచేస్తామంటే పద్ధతికాదన్నారు. మనం ఏ హోదాలో ఉన్న కానీ ప్రజలకోసం పనోచేయాల్సిందేనన్నారు. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధి మాత్రమే అన్నారు. ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నెరవేరుస్తాం అన్నారు.

ఆనాడు మనం ఉద్యమాలకు దిగినప్పుడు మనతో ఎవరున్నారు.?నాడైనా నెడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే అన్నారు. మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండని, బాధ పడేదేమీలేదు... ఆయనను తయారుచేసింది పార్టీయేనన్నారు. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటదని వివరించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కె.సంజయ్ కుమార్ ఒక పక్క డాక్టర్ గా మరోపక్క ఎమ్మెల్యే గా ప్రజాసేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డా సంజయ్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్,జీవన్ రెడ్డి, జాజాల సురేందర్, గంప గోవర్ధన్, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జగిత్యాల జెడ్పీ చైర్మన్ వసంత సురేష్, పెద్దపల్లి టీఆర్ఎస్ నేత ఉష తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed