ప్రభుత్వానికి సమస్యగా మారిన ‘కౌలు’ గుర్తింపు ప్రాసెస్.. ఇక గ్రామ సభలే ఫైనల్..?

by Satheesh |
ప్రభుత్వానికి సమస్యగా మారిన ‘కౌలు’ గుర్తింపు ప్రాసెస్.. ఇక గ్రామ సభలే ఫైనల్..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: కౌలు రైతుల గుర్తింపు, వారికి అందే రైతుభరోసా విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాలేదు. ప్రభుత్వం సైతం స్పష్టమైన విధానం రూపొందించలేదు. వారిని ఏ ప్రాసెస్ ప్రకారం.. ఎంపిక చేస్తారు.. సాయం అందేందుకు ఎలాంటి మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయి అనేది స్పష్టం కాలేదు. కానీ కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ గ్రామ సభల ద్వారా చేయొచ్చని ధరణి కమిటీ సభ్యులు చెబుతున్నారు. కౌలుదారు తెల్లకాగితంపై తన సాగు వివరాలు స్పష్టం చేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దానికి గ్రామ సభలో పెట్టి బహిరంగంగా ప్రకటించాల్సి ఉంటుందని, పట్టాదారులెవరూ ఆబ్జెక్షన్ చెప్పక పోతే అతన్ని కౌలు రైతుగా గుర్తించొచ్చని చెబుతున్నారు. ఒక వేళ హక్కుదారుడు దీనిపై ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎవరేం చేయలేరని పేర్కొంటున్నారు.

కౌలు రైతులుగా గుర్తింపునకు ఎన్నో ప్రశ్నలు

కౌలుదారుడి గుర్తింపునకు సవాలక్ష ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. తన సొంత భూమికి వచ్చే సాయం కౌలుదారుడికి అందితే కొన్నేండ్ల తర్వాత ఆ భూమి ఎక్కడ తనదంటాడోని, రికార్డుల్లోనూ పేరు మారుతుందోననే భయం పట్టాదారునిలో ఉన్నది. ఈ భయాలు తొలగిస్తే తప్ప కౌలు రైతుల గుర్తింపు, సాయం అందే పరిస్థితి ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో ‘ది క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్’ని అమలు చేస్తున్నారు. గతంలో ‘భూమి ఆధీకృత సాగుదారు చట్టం–2012’ ప్రకారం గుర్తింపు ప్రక్రియ ఉండేది. ఇవన్నీ భూమి హక్కుదారుడికి నష్టం వాటిల్లకుండా ఏర్పాటు చేసినవే. వీటిని ప్రచారంలో పెట్టక పోవడంతో పట్టాదారులెవరూ భూములు కౌలుకు ఇచ్చినట్లు వెల్లడించే అవకాశం లేదు.

అందరి డిమాండ్.. కానీ

ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ కౌలురైతులకు సైతం రైతుభరోసా అందిస్తామని ప్రకటించింది. కానీ ఈ గుర్తింపు ప్రక్రియ ప్రభుత్వానికి ఒకింత కష్టతరంగానే మారింది. వారికి సాయం అందించాల్సిందేనని అన్ని సంఘాల నుంచి డిమాండ్ వస్తున్నది. కానీ ఏ కార్మిక, రైతు సంఘ నాయకుడు గుర్తింపునకు ఉన్న అంశాలపై మాత్రం మాట్లాడడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ప్లాన్ చేస్తున్నారు. రైతుభరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న అంశంపై నిర్వహిస్తున్న మీటింగుల్లోనూ ఈ ఇష్యూనే హైలెట్ చేస్తున్నారు. కనీసం దీనికి అనువుగా ఉన్న చట్టాల గురించి నాయకులెవరూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లేదు.

అందుబాటులో చట్టం

– కౌలు రైతుల గుర్తింపునకు ఆధీకృత సాగుదారు చట్టం–2012(ల్యాండ్ లైసెన్స్ కల్టివేటర్స్ యాక్ట్) అమల్లో ఉంది. దీని ద్వారా 2012–2013లో ఆరు లక్షల మందిని కౌలుదారులుగా గుర్తించారు. వారికి గుర్తింపు కార్డులు సైతం జారీ చేశారు. వాటితో ప్రభుత్వ సాయం అందుకున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు కూడా పొందారు.

– పట్టాదారుల అనుమతితో గుర్తింపు కార్డు ఇస్తారు. రాతపూర్వకంగా లేకపోయినా ఫర్వాలేదు. ప్రతి మార్చి, ఏప్రిల్ నెలల్లో గ్రామ స్థాయిలోనే గుర్తించాల్సి ఉంటుంది.

– ఈ గుర్తింపు ప్రక్రియను రెవెన్యూ రికార్డుల్లో ఎక్కడా ఎంట్రీ చేయరు. లోన్స్ రిజిస్టర్‌లో మాత్రమే రాస్తారు. దీని ద్వారా లోన్ ఎలిజిబుల్ కార్డులు జారీ చేస్తారు. దాని ద్వారా పంట రుణాలు, సబ్సిడీ పథకాలు పొందొచ్చు.

ప్రశంసలు పొందిన చట్టం

కౌలురైతుల గుర్తింపు కార్డు విలువ ఏడాదికే పరిమితం. దాని ద్వారా పట్టాదారుడికి ఎలాంటి సమస్యా ఉండదు. ఈ చట్టం అమలు తీరును వ్యవసాయ నిపుణుడు డా.హక్ ప్రశంసించారని భూ చట్టాల నిపుణులు, ధరణి కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ తెలిపారు. వరల్డ్‌బ్యాంకు, నీతి అయోగ్ వంటి సంస్థలు సైతం అంగీకరించాయి. దీని కంటే ముందు మహిళా స్వయం సహాయక గ్రూప్ ల్యాండ్ లీజ్ యాక్ట్ కూడా రూపొందించారు. దీని ద్వారా ఈ గ్రూపు ద్వారా కౌలుకు తీసుకొని అదే గ్రూపు సభ్యుల్లో ఒకరు సాగు చేసుకునేవారు.

ఒప్పందం గ్రూపు పేరిట ఉండడం వల్ల పట్టాదారుడికి ఎలాంటి ఇబ్బందీ లేదు. రుణం, సబ్సిడీ వంటివి కూడా గ్రూపులకు అందించేటట్లు తయారు చేశారు. ఈ చట్టాల రూపకల్పనలో రెవెన్యూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ కీలక పాత్ర పోషించారు. కేవలం ఏడాది కాలపరిమితితో లోన్ ఎలిజిబిలిటీ కార్డులు జారీ చేయడం ద్వారా ఎలాంటి సమస్యా ఉత్పన్నం కాదన్న వాస్తవాలపై పట్టాదారులకు అవగాహన కల్పించాలి. ఐతే గ్రామ స్థాయిలో సిబ్బంది ఉండడం ద్వారానే ఈ గుర్తింపు ప్రక్రియ సాధ్యమవుతుంది.

గ్రామసభ తీర్మానమే..!

కౌలుదారు తెల్లకాగితంపై తన సాగు వివరాలను స్పష్టం చేస్తూ తెల్ల కాగితం మీద దరఖాస్తు చేసుకోవాలి. ఒక రోజు గ్రామ సభ పెట్టి బహిరంగంగా ప్రకటించాలి. పట్టాదారులెవరూ ఆబ్జెక్షన్ చేయకపోతే కౌలురైతుగా ఆ ఏడాదికి గుర్తించొచ్చునని భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. ఇక్కడెక్కడా పట్టాదారుడు సంతకం చేయరు. అగ్రిమెంట్ పేపరు ఉండదు. గ్రామ సభ ద్వారా మాత్రమే వివరాలు నమోదు చేసి రైతుభరోసా కింద సాయం అందించే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. హక్కుదారుడు ఏమైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఎవరేం చేయలేరని క్లారిటీ ఇస్తున్నారు. పట్టాదారుడి సంతకం కావాలంటే మాత్రం సాధ్యమయ్యే పని కాదంటున్నారు. ఎక్కడా సంతకాలు లేకుండా చేసే ప్రక్రియతో సాగుదారుడికి వచ్చే ప్రమాదమేమీ ఉండదు.

సందేహాల నివృత్తి అవసరం

ప్రభుత్వం కౌలుదారు గుర్తింపు విధానం, సందేహాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి తెలిపారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మంతెని గౌరెల్లిలో లీఫ్స్ సంస్థ చేపట్టిన భూన్యాయ శిబిరంలో ఈ చర్చ వచ్చింది. అక్కడ కూడా ఈ గుర్తింపు ప్రక్రియపై చర్చ నడిచింది. భూమి హక్కుదారులకు లీగల్ చిక్కులు రాకుండా గుర్తింపు ప్రక్రియను అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు.

విధి విధానాలపై మంత్రి పొంగులేటి కసరత్తు

కౌలు రైతుల గుర్తింపునకు విధి విధానాలను ఖరారు చేసేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో రైతు, కార్మిక సంఘాల ప్రతినిధులు, మేథావులు, నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. కనీసం వెయ్యి మందితో చర్చించి కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ, విధి విధానాలపై నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed