భూములపై ‘ఐ మార్క్’.. కేటీఆర్ ఫుల్ సపోర్ట్ అంటూ జోరుగా దందా

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-22 04:14:32.0  )
భూములపై ‘ఐ మార్క్’.. కేటీఆర్ ఫుల్ సపోర్ట్ అంటూ జోరుగా దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో: సదాశివ పేటలో ఐ మార్క్ డెవలపర్స్ కంపెనీ 1668 ఎకరాల్లో మెగా ది ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నది. వెస్ట్ సిటీ క్యాపిటల్ పేరిట 500 ఎకరాస్సో లగ్జరీస్ మెగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ టౌన్ షిప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటున్నది. ‘తెలంగాణ ప్రభుత్వం, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మెగా టౌన్ షిప్ లకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు.’ అంటూ ప్రచారం చేసుకుంటూ అమ్మకాలను మొదలుపెట్టింది. ‘ఇప్పటికే బై బ్యాక్ ఆఫర్ కింద 300 ఎకరాలు అమ్మేశాం.

ల్యాండ్ షేరింగ్ కింద 30 ఎకరాలు విక్రయించాం. ఏడాదిన్నరలోనే 50 శాతం లాభాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం గజం ధర రూ.10 వేలకు పైగా పలుకుతున్నది. మేం డెవలప్ చేసిన తర్వాత అది రూ.20 వేలకు ఈజీగా పెరుగుతుంది.’ అంటూ అందమైన బ్రోచర్లు తయారు చేసి కస్టమర్లను ఆకట్టుకుంటున్నది. కానీ అంత పెద్ద విస్తీర్ణాన్ని కొనుగోలు చేసేదెప్పుడు? డీటీసీపీ అనుమతులు వచ్చేదెప్పుడు? విల్లాలు, కమర్షియల్ భవనాలకు అనుమతులు ఇచ్చేదెప్పుడు? ఇదంతా పక్కన పెట్టి 18 నెలల్లోనే పెట్టిన పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి ఇస్తామంటూ జనాన్ని మభ్యపెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

రెండున్నర ఏండ్లల్లోనే..

ఐ మార్క్ డెవలపర్స్ అనే కంపెనీని 2021 డిసెంబరు 27 న స్థాపించారు. అంటే కరోనా సంక్షోభంలోనే మొదలైంది. డిసిగ్నేటెడ్ పార్టనర్స్ గా అల్లు వెంకట్ రెడ్డి, అల్లు శ్రీదేవిలు ఉన్నారు. రెండేండ్లు కూడా కాకముందే ఏకంగా 1668 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టే స్థాయికి ఈ కంపెనీ ఎదగడం గమనార్హం. అంతకు ముందు ఏమేం ప్రాజెక్టులు చేశారో తెలియదు. కానీ అతి తక్కువ కాలంలోనే రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టుని మార్కెట్లోకి తీసుకురావడం గమనార్హం. కాగా, ‘గుజరాత్ లో 580 ఎకరాల్లో నిర్మించిన అదాని శాంతిగ్రామ్ మాదిరిగా డెవలప్ చేస్తాం.

700 ఎకరాల్లో నిర్మించిన రాంకీ డిస్కవరీ సిటీ లెక్కన కడతాం. మనీలాలో 610 ఎకరాల్లో రూపొందిన అనానస్ కమ్యూనిటీ డిజైన్ లో ప్రాజెక్టు చేపట్టాం.’ అంటూ బ్రోచర్లు ముద్రించింది. 15 ఎకరాల్లో రిసార్ట్, వీకెండ్ హోమ్స్, ఇండిపెండెంట్ హౌజెస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఇంటర్నేషనల్ స్కూల్, నైబర్ హుడ్ స్టోర్స్, ఆర్గానిక్ సూపర్ మార్కెట్, ఫామ్ ల్యాండ్స్ అండ్ హౌజెస్, ప్రీమియం/లగ్జరీస్ విల్లాస్, 120 అడుగుల వరల్ క్లాస్ రోడ్లు ఉంటాయని బ్రోచర్లలో పేర్కొన్నది. ఇంత తక్కువ కాలంలోనే లాభాలను చూపిస్తామంటుండడం అనుమానాలకు తావిస్తున్నది.

కంపెనీ చెబుతున్న ఆఫర్లు ఇలా..

– రూ.90 లక్షలు వెచ్చించి ఎకరం భూమిని కొనుగోలు చేయాలి. బై బ్యాక్ ఆఫర్ కింద 18 నెలల తర్వాత మరో రూ.45 లక్షలు కలిపి రూ.1.35 కోట్లు ఇస్తారు. ల్యాండ్ కావాలంటే డెవలప్ చేసి 12 నెలల్లో తర్వాత రూ.1500 గజాలు ఇస్తారు. దీనిలో 8 విల్లాలు నిర్మించొచ్చు. బై బ్యాక్ ఆఫర్ ని ఎంపిక చేసుకుంటే కార్పొరేట్ చెక్కులు ఇస్తారు.

– రూ.45 లక్షలు పెట్టి అరెకరం భూమిని కొనుగోలు చేయాలి. బై బ్యాక్ ఆఫర్ కింద 18 నెలల తర్వాత మరో రూ.22.50 లక్షలు కలిపి రూ.67.50 లక్షలు ఇస్తారు. ల్యాండ్ కావాలంటే డెవలప్ చేసి 12 నెలల తర్వాత 750 గజాలు ఇస్తారు. దీంట్లో 4 విల్లాలు కట్టుకోవచ్చు. బై బ్యాక్ ఆఫర్ ని ఎంపిక చేసుకుంటే కార్పొరేట్ చెక్కులు ఇస్తారు.

ఎంత భూమి?

సంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి మండలం మునిపల్లి, పెద్ద గోపులారం, కోనాపూర్, నాగులపల్లి గ్రామాల సరిహద్దులో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. ఈ మేరకు క్లయింట్లతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాల్లో కంపెనీ పేరిట ఉన్న భూమిని వివిధ సర్వే నంబర్లలో చూపించారు. పెట్టుబడి పెట్టినట్లు టెర్మ్స్ అండ్ కండిషన్లపై ముందుగానే సంతకాలు చేయించుకుంటున్నారు.

20 గుంటల ల్యాండ్ కొనుగోలు చేస్తే 18 నెలల తర్వాత డీటీసీపీ అనుమతితో వెంచర్ వేసి 750 గజాల ప్లాటెడ్ ఏరియాను అప్పగిస్తామంటూ పేర్కొంటున్నారు. మధ్యలోనే ఎవరికైనా విక్రయిస్తే అగ్రిమెంట్ చెల్లదు. ఆ కొనుగోలు చేసిన వ్యక్తితో బై బ్యాక్ ఆఫర్ లేదా ప్లాటెడ్ ఏరియాను ఇచ్చేది లేదు. అంటే 18 నెలల కాలం ఎవరికీ అమ్మొద్దు. కంపెనీ ల్యాండ్ ఇచ్చేదాకా వేచి చూడాల్సిందే. ఐ మార్క్ డెవలపర్స్ తరపున ఎండీ అల్లు వెంకటరెడ్డి మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ పైన సంతకం చేస్తున్నారు.

ప్రాజెక్టు ఆగితే..

భూమి కొనుగోలు చేయకముందే ప్రాజెక్టుని మార్కెట్లో పెట్టారు. పైగా రైతుల నుంచి కనీసం బేరసారాలు చేయలేదు. కస్టమర్లు చెల్లించే సొమ్ముతోనే భూములను కొనాలన్న ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారు. సొమ్మొకరిది సోకొకరిదిలా కనిపిస్తున్నది. పైగా ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారంటూ కస్టమర్లకు చెప్తూ ఆకట్టుకుంటున్నారు.

వేలాది ఎకరాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణలో పది ఎకరాలు కొనుగోలు చేయాలంటేనే అనేక చిక్కులు, సమస్యలు, వివాదాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భూ సేకరణ అంత ఈజీగా అవుతుందనుకోవడం పొరపాటే. పైగా బై బ్యాక్ ఆఫర్ కింద ఏడాదిన్నరలోనే పెట్టిన పెట్టుబడికి మరో సగం అమౌంట్ కలిపి ఇస్తామంటున్నారు. ఈ కాలంలో భూ సేకరణ పూర్తి చేయడం కూడా కష్టమేనని స్థానిక పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

మరి ప్రాజెక్టు డిజైనింగ్ కి అనుగుణంగా పూర్తి చేయాలంటే 1600 ఎకరాలు అవసరం. ఏ మాత్రం తగ్గిన కస్టమర్లకు ఇచ్చిన హామీ నెరవేర్చలేరు. ప్రాజెక్టు మధ్యలోనే నిలిపివేయరన్న గ్యారంటీ ఏం లేదు. అప్పుడు డబ్బులు చెల్లించిన కస్టమర్లకు బై బ్యాక్ లేదా ల్యాండ్ హామీ మేరకు ఇస్తారన్న నమ్మకం లేదని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే బ్రోచర్లలో ప్రకటించిన మొత్తం భూమిని సేకరించినట్లు డాక్యుమెంట్లు చూసిన తర్వాతే కొనుగోలు చేయాలని కస్టమర్లకు సూచిస్తున్నారు.

Read more:

కబ్జాలను అడ్డుకుంటే.. నాపైనే ఆరోపణలు చేస్తారా..?

భూములపై ‘ఐ మార్క్’.. కేటీఆర్ ఫుల్ సపోర్ట్ అంటూ జోరుగా దందా

Advertisement

Next Story