YSRTP విలీనం లేనట్లే..!

by srinivas |
YSRTP విలీనం లేనట్లే..!
X
  • వైఎస్సార్టీపీ షర్మిలకు నో చెప్పిన కాంగ్రెస్నేటితో డెడ్ లైన్ పూర్తి
  • స్టేట్ లీడర్ల ఒత్తిడా? హైకమాండే వద్దనుకుందా?
  • క్యాడర్ లేకపోవడమే కారణమా?
  • కాంగ్రెస్ షరతులతో షర్మిలే వద్దనుకున్నారా?
  • నేటితో ఊహాగానాలకు బ్రేక్

దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిలను కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందా?, విలీనానికి హస్తం పార్టీ నో చెప్పిందా?, మొన్నటి వరకు పార్టీ విలీనం చేసేందుకు షర్మిల ఢిల్లీ వయా కర్ణాటకకు చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరిపినా వృథా ప్రయాసగానే మిగిలిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. కాంగ్రెస్‌లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ విలీనానికి బ్రేకులు పడినట్లు విశ్వసనీయ సమాచారం. మొన్నటి వరకు ఇదిగో విలీనం.. అదిగో విలీనం అని లీకులిచ్చిన లోటస్ పాండ్ వర్గీయులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. విలీనంపై ఆరా తీసినా దాటవేస్తున్నారు. కాగా ఇటీవల లోటస్ పాండ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా విలీనం లేనట్లేననే సంకేతాలకు మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. దీంతో విలీనం అంశం లేనట్లేనని విశ్వసనీయ సమాచారం. అయితే వైఎస్సార్ టీపీ విలీనంలో హస్తం పార్టీ స్టేట్ లీడర్ల పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతోంది. హైకమాండ్‌కు పలు నివేదికలు సైతం వెళ్లినట్లు సమాచారం. దీనికి తోడు పార్టీలో షర్మిల వన్ మ్యాన్ షో తప్పితే బలమైన క్యాడర్ లేకపోవడం కూడా మైనస్ అయిందని చర్చించుకుంటున్నారు. అయితే విలీనానికి సంబంధించిన ఊహాగానాలకు శనివారంతో తెరపడనుంది.

కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ కారణంగానే కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్‌టీపీ విలీనానికి బీజం పడింది. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలుపుతో షర్మిల విలీనానికి ఒకే చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఒంటరిగా తన శక్తి సరిపోదని భావించి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సంబంధం లేకుండా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో విలీనానికి చక్రం తిప్పింది. హైకమాండ్‌తో పలుమార్లు సంప్రదింపులు జరిపింది. అయినా అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు అందలేదు. దీంతో చేసేదేం లేక ఇటీవల షర్మిల నేరుగా.. ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసింది. అయినా ఇప్పటి వరకు స్పష్టత రాకపోవడంతో విలీనానికి షర్మిల డెడ్ లైన్ విధించింది. ఈనెల 30వ తేదీలోపు తాడో పేడో తేల్చుకోవాలని ఫిక్స్ అయింది. రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలోనూ షర్మిల నాయకులు, కార్యకర్తలకు ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. విలీనం లేకుంటే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుదామని క్లారిటీ ఇచ్చింది. 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది. కాగా అక్టోబర్ రెండో వారం నుంచి ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ కూడా షర్మిల సిద్ధం చేసుకునే పనిలో పడింది. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని షర్మిల నాయకులకు స్పష్టం చేసింది.

కాంగ్రెస్‌లో చేరుదామనుకుంటున్న షర్మిలకు హస్తం పార్టీ నుంచి వ్యతిరేకత ఎక్కువైంది. షర్మిల వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇరు వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. దీంతో షర్మిల కాంగ్రెస్‌లో చేరితే పార్టీకి నష్టమని స్థానిక నేతలు ఎన్నో రోజులుగా అడ్డుకుంటున్నారు. షర్మిల వల్ల పార్టీకి ఎలాంటి నష్టం చేకూరుతుందనే విషయంలో రేవంత్ రెడ్డి హైకమాండ్ కు పలు నివేదికలు కూడా పంపించారు. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల గతంలో ప్రకటించారు. అలాంటి పరిస్థితి ఎదురైతే ఇబ్బంది అని భావించిన రేవంత్ రెడ్డి స్వయంగా తుమ్మల నాగేశ్వర్ రావును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారనే చర్చ జరుగుతోంది. ఇక్కడి నేతలు ఆమెను అడ్డుకోవడంతోనే షర్మిల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్యవర్తిత్వంతో హైకమాండ్‌ను అప్రోచ్ అయ్యారు. పలు దఫాలుగా డీకే శివకుమార్, హైకమాండ్‌తో సంప్రదింపులు జరిగాయి. కానీ ఎలాంటి ముందడుగు పడలేదు.

షర్మిలను ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బలోపేతం కోసం వినియోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ షర్మిల మాత్రం తెలంగాణ పాలిటిక్స్‌పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హస్తం పార్టీ షరతులకు షర్మిల ఒకే చెప్పకపోవడానికి తోడు స్థానిక నేతలు వద్దని చెప్పడంతో హైకమాండ్ విలీనంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ ఒక్క అంశంలోనే పార్టీ విలీనంపై తాత్సారం జరుగుతోందని సమాచారం. కాగా తాజాగా షర్మిల వ్యాఖ్యలతో తాను తెలంగాణలో తప్పితే ఏపీలో పనిచేయబోననే సంకేతాలు ఇవ్వడంతో విలీనం దాదాపు లేనట్లేననేది స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా గతంలో తన తండ్రి మరణించాక కూడా వారెంట్ పంపించిన పార్టీ అని కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన షర్మిల విలీనం అంశం కోసం తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని షర్మిల తలొగ్గింది. విలీనం విషయంలో హైకమాండ్ పాజిటివ్‌గా ఉన్న సమయంలో షర్మిల కాంగ్రెస్‌కు, రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవడం గమనార్హం. తీరా ఇప్పుడు విలీనం అంశంపై హస్తం పార్టీ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని షర్మిల భావిస్తోంది.

తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలనే లక్ష్యంగా వైఎస్ షర్మిల తన తండ్రి పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని 2021లో ఏర్పాటుచేశారు. రాబోయే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అని చెప్పుకుంది. అప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తన పోరాటాన్ని కొనసాగించారు. ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ప్రజలకు చేరువయ్యేందుకు, వారి కష్టాలు తెలుసుకునేందుకు ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర కూడా చేపట్టారు. బీఆర్ఎస్ పై ఏ పార్టీ చేయని విధంగా నిరసనలు తెలిపినా షర్మిలను ఎవరూ ఆదరించలేదు. ఆ పార్టీలో కీలక నేతలు కూడా చేరలేదు. చివరకు తాను తెలంగాణ కోడలిని అని చెప్పుకున్నా ఏమాత్రం ఆదరణ దక్కలేదు. దీంతో తమ పార్టీలో ఎవరినీ చేర్చుకోబోమని లీడర్లను సృష్టిస్తామని ఆమె చెప్పారు. కానీ ఎలాంటి ముందడుగు పడలేదు. ఇకపోతే పార్టీలో వచ్చే వారి సంగతి పక్కన పెడితే.. పార్టీని వీడేవారే ఎక్కువయ్యారు. పార్టీ ప్రారంభంలో ఉన్న నేతలు కూడా ఇప్పుడు పార్టీ వీడటంతో మరింత అధ్వాన్న స్థితికి వెళ్లింది. పార్టీ ప్రకటను నుంచే ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజల కోసం పోరాటాలు చేసినా షర్మిలను ఎవరూ పెద్దగా ఆదరించలేదు. కాస్తో.. కూస్తో.. వైఎస్సార్ బిడ్డగా ఆమాత్రం ఆదరణ దక్కినా ప్రజలను తమ వైపునకు తిప్పుకోవడంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పూర్తిగా విఫలమైంది. పార్టీ పెట్టిన రెండేండ్లలోనే విలీనం చేసేందుకు సిద్ధమైంది.

వైఎస్సార్‌టీపీలో అవమానాలు భరించలేక ఇందిరాశోభన్ పార్టీనీ వీడారు. ఆమెతో పాటు వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన కొండా రాఘవరెడ్డి సైతం పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈయనను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన చెంది ఎలాంటి కార్యక్రమాలకు ఆయన హాజరవడంలేదు. బీఆర్ఎస్ నుంచి వైఎస్సార్ టీపీలో చేరిన గట్టు రామచంద్రారావుది కూడా అదే పరిస్థితి. వచ్చిన కొద్దిరోజులకే ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఆయన కూడా పార్టీ కార్యకలాపాలకు

దూరంగా ఉంటున్నారు. తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇకపోతే తుంగతుర్తి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ఏపూరి సోమన్నును షర్మిల ప్రకటించింది. వైఎస్సార్ టీపీ నుంచి ప్రకటించిన తొలి అభ్యర్థి అయిన ఏపూరి కూడా పార్టీని వీడారు. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా విలీనం వ్యవహారం తెరపైకి రావడంతో సొంత పార్టీ నేతలే ఆ పార్టీ చీఫ్ షర్మిలపై తిరగబడ్డారు. తమతో కనీసం చర్చలు కూడా జరపకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడమేంటని నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేశారు. విలీనం అంటే క్యాడర్ అంతా వెళ్లాలని, షర్మిల మాత్రమే వెళ్తే అది చేరిక అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా షర్మిల.. కాంగ్రెస్‌కు పెట్టిన డెడ్ లైన్ ఈనెల 30వ తేదీతో ముగియనుంది. మరి హస్తం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ వారు విలీనానికి అంగీకరించకుంటే క్యాడర్ లేకుండా 119 అసెంబ్లీ స్థానాల్లో ఎలా పోటీ చేస్తుందనేది అంతకుమించి ఆసక్తి రేకెత్తిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed