TNGO సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు..?

by Satheesh |
TNGO సంఘానికి బ్యాలెట్ ద్వారా ఎన్నికలు..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: త్వరలో జరుగనున్న టీఎన్జీవో రాష్ట్ర నాయకత్వం ఎన్నికకు ఈ పర్యాయం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగేలా పరిస్థితులు కనబడుతున్నాయి. ఉద్యోగ సంఘాలకు పెద్దన్నగా ఉన్న టీఎన్జీవో యూనియన్‌కు సుమారు 70 యేండ్లకు పైగా చరిత్ర ఉండగా సంఘానికి ఎన్నికైన నాయకులు మూడేండ్ల కాలం పాటు పదవులలో కొనసాగుతారు. యూనియన్ ఏర్పాటు నుండి ఇప్పటి వరకు యూనియన్ కు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించే అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి , కోశాధికారి వంటి ప్రధాన పోస్టులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం సంఘం అధ్యక్షుడుగా మామిండ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా రాయికంటి ప్రతాప్, కోశాధికారిగా రామినేని శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. వీరి పదవీ కాలం వచ్చే నెలలో ముగియనుండడంతో నూతన కార్యవర్గం ఎన్నికకు సన్నాహాలు జరుగుతుండగా కొత్తగా కొంత మంది ప్రధాన కార్యదర్శి పదవిని ఆశిస్తున్నారు. అధ్యక్షుడుగా మామిండ్ల రాజేందర్ మరోమారు ఎన్నిక అయ్యే అవకాశాలు కనబడుతుండగా ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి .

అవకాశం ఇవ్వండి..

టీఎన్జీవో కేంద్ర సంఘానికి త్వరలో జరిగే ఎన్నికలలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వాలని సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ కోరుతున్నారు. సంవత్సరాలుగా టీఎన్జీవో జిల్లా సంఘాలకు సేవలు అందిస్తున్నా తమకు కేంద్ర సంఘంలో అవకాశం దక్కడం లేదని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ముజీబ్ హుసేనీ ఏకంగా జిల్లా కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కార్యవర్గం నుండి తీర్మాణం చేసి కేంద్ర సంఘానికి పంపారు. అంతేకాకుండా అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో ఫోన్ ద్వారా మాట్లాడి తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతుండడం బ్యాలెట్‌కు దారితీస్తుందా ? అనే అనుమానాలు ఉద్యోగులందరిలో వ్యక్తమౌతున్నాయి.

Advertisement

Next Story