Goshamahal : గోషామహల్ బీఆర్‌ఎస్‌లో టికెట్ వార్!

by Mahesh |   ( Updated:2023-08-30 05:30:31.0  )
Goshamahal : గోషామహల్ బీఆర్‌ఎస్‌లో టికెట్ వార్!
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : గోషామహల్ బీఆర్ఎస్ పార్టీలో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నాలుగు నియోజకవర్గాలు మినహా అన్ని ఇతర నియోజకవర్గాలలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా గోషామహల్ నియోజకవర్గాన్ని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక నేతలు టికెట్ దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న నందకిషోర్ వ్యాస్ టికెట్ ఆశిస్తుండగా ఇతర నాయకులు వ్యతిరేకిస్తున్నారని తెలిసింది.

నందకిషోర్ వ్యాస్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే నియోజకవర్గంలోని ఇతర బీఆర్ఎస్ నేతలంతా ఆయనకు వ్యతిరేకంగా సమావేశమై పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఆయనకు టికెట్ ఇవ్వవద్దంటూ అల్టిమేటం ఇచ్చారు. ఇలా కొన్ని రోజులు గడిచాయో లేదో మరోసారి అసమ్మతి నాయకులంతా మీటింగ్ పెట్టుకుని తమలో ఎవరికైనా టికెట్ ఇవ్వాలని, ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

కుదరని ఏకాభిప్రాయం..

గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులలో సఖ్యత లోపించిందని ఆ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ ఇన్‌చార్జి ఒకవైపు, అసమ్మతి నాయకులంతా మరోవైపు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్న నాయకులంతా ఎవరికి వారే తామే అభ్యర్థులమని, తమకే టికెట్ రాబోతోందని ప్రచారం చేసుకుంటున్నారు. ఉద్యమ సమయం నుంచి పార్టీ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ సీనియర్ నాయకులు ఆర్వీ.మహేందర్ తనకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్నారు. మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఆర్వీ.మహేందర్‌కు టికెట్ ఇవ్వాలని ఇటీవల నగరంలో జరిగిన ఆ సామాజిక వర్గం సమావేశంలో పాల్గొన్న నాయకులు తీర్మానం చేశారు.

దీనికి తోడు తనకు ఉన్న పరిచయాల ద్వారా మహేందర్ టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తనకే టికెట్ దక్కుతుందని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మరో మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్‌గుప్తా సైతం పార్టీ టికెట్ దక్కించుకునేందుకు తనకున్న శక్తి, యుక్తులను ఉపయోగిస్తున్నారు. వీరే కాకుండా మరికొంత మంది నాయకులు బీఆర్ఎస్ టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

అభ్యర్థి అంటూ ప్రచారం..

బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం గోషామహల్ టికెట్ కేటాయింపు విషయంలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పటికీ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి నందకిషోర్ వ్యాస్‌కు టికెట్ ప్రకటించారంటూ ఓ ఛానెల్‌లో ప్రచారం జరిగింది. దీంతో స్థానికంగా టికెట్ ఆశిస్తున్న నాయకులంతా ఆందోళనకు గురయ్యారు. చివరకు తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని పార్టీ పెద్దలతో, మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంకా పార్టీ ఎవరినీ ప్రకటించలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇదే సమయంలో కొంతమంది నాయకులు ఒక అడుగు ముందుకు వేసి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

సంబంధం లేని నాయకులు వస్తారా..?

గోషామహల్ నియోజకవర్గానికి సంబంధం లేని ఇతర నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో స్థానిక నాయకులు మరింత టెన్షన్‌కు గురౌతున్నారు. స్థానిక నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం, టికెట్ ఆశిస్తున్న నాయకులకు అంతగా ప్రజాబలం లేకపోవడాన్ని పార్టీ గుర్తించి అభ్యర్థి ఎంపిక వాయిదా వేసిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న నాయకులు కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద గోషామహల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో స్థానిక నేతలలో టెన్షన్ నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed