- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత సమస్యను ప్రపంచ సమస్యగా చిత్రీకరిస్తున్నారు : ప్రొఫెసర్ కోదండరాం
దిశ, ముషీరాబాద్ : కవిత సమస్యను ప్రపంచానికి చెందినదిగా చిత్రీకరిస్తున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. అదేమన్నా అమరుల కుటుంబాల కన్నీరు, నిరుద్యోగులు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సమస్యా అని ప్రశ్నించారు. తెలంగాణ పేరునే తొలగించిన వారికి ఇక్కడి సమస్యల పై మాట్లాడే హక్కు లేదని స్పష్టం చేశారు. దుష్టపాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. ఇక నుంచి ఊరుకునేది లేదని, దేనికైనా తయారుగా ఉన్నామని స్పష్టం చేశారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో " తెలంగాణ బచావో " పేరిట బాగ్‌లింగంపల్లి వీఎస్టీ ఫంక్షన్ హాల్‌లో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... తెలంగాణ రావడం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరుల గాధల నుండి స్ఫూర్తి పొందాలని కోరారు.
తెలంగాణలో ప్రజాస్వామ్య రాజకీయాలను నిర్మించేందుకు చర్చ జరగాలన్నారు. తెలంగాణ పురోభివృద్ధికి ఆటంకం ఎవరంటే అది కేసీఆరే అని చెప్పారు. తాను కేసీఆర్ ను గద్దె దించమనడం లేదని, ఆయన పరిపాలననే తొలగించాలని అంటున్నానని స్పష్టం చేశారు. దోపిడీ పాలనను అంతమొందించడానికి అందరం ఐక్యంగా కలిసి పోరాడాల్సి ఉందన్నారు. భవిష్యత్ లో ప్రజాస్వామిక తెలంగాణ, సామాజిక తెలంగాణ సాధ్యం, ఆచరణ పెట్టడం తమ వల్లనే అవుతుందని, అందుకోసం అందరం కలిసి రాష్ట్రంలో నడుస్తున్న దుష్టపాలన పై ప్రచారం చేస్తామన్నారు. త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. పోడు రైతుల కోసం కొట్లాడుతున్నామని తెలిపారు. ఎంత మంది ఎన్ కౌంటర్లు అయితే, ఎంత మంది త్యాగాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో గుర్తించుకోవాలన్నారు. మల్లన్న సాగర్ బాధితులు ఎన్నో పోరాటాలు చేస్తే చివరకు సమస్య పరిష్కరించారన్నారు. నేటి నుంచి డిసెంబర్ వరకు పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
మిలియన్ మార్చ్ తరహాలోనే మరో ఉద్యమం చేస్తామన్నారు. ప్రొఫెసర్ హర గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్లంతా సమాజాన్ని నాశనం చేసే రాజకీయ నాయకుల కోసం త్యాగం చెయ్యలేదన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల కోసమే తమ లాంటి వాళ్లం ఉద్యమాల్లో పాల్గొన్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఉద్యమించిన నాయకులు ఉన్నారు కానీ, ఇప్పుడు దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థ చూస్తున్నామని పేర్కొన్నారు. మనం అనుకున్న తెలంగాణ ఎటు పోయిందో తెలియని పరిస్థితి ఉందన్నారు. అసలు ఊహించని, దిగజారిన రాజకీయాలతో వ్యవస్థ నాశనం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. మాజీ ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళీ మాట్లాడుతూ రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, ల్యాండ్ మాఫియా నడుస్తుందన్నారు. ఆలీ బాబా చాలిస్ చోర్ మాదిరిగా కేసీఅర్ సవ్ చోర్ దొంగల ముఠా ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వస్తే అభివృద్ధి జరుగుతుందని అనుకున్నానని, కానీ కేసీఅర్ సీఎం అయ్యాక అభివృద్దిలో వెనక్కు వెళుతున్నారని విమర్శించారు. కేసీఅర్ దేశంలో రాజకీయ వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రొఫెసర్ రమా మేల్కోటి మాట్లాడుతూ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఆధిపత్యం, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న పరిస్థితి తెలంగాణలో ఇంకా ఉందని తెలిపారు. 1990-2000 లో రైతుల ఆత్మహత్యలు ఉన్నట్టే ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో సమస్యలపై ఎలా పోరాడతామనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుందన్నారు. స్త్రీల ఆత్మ హత్యలు, చంపుకోవడాలు, హింస పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
అంగన్వాడీలో ఆయాలకు జీతం సరిగ్గా రావడంలేదని, చాలా మంది ఆడపిల్లలకు టాయిలెట్లు లేవన్నారు. సమస్యలన్నీ సామాజిక అంశాలు మాత్రమే కాదు, ఇవి రాజకీయ అంశాలే అని గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ తదితరులు హాజరై మాట్లాడారు. రెండవ సేషన్ లో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజా గాయకులు గద్దర్, సీపీఐ న్యూ డెమోక్రసి రాష్ట్ర నాయకుడు గోవర్థన్, డాక్టర్.వినయ్, వేణు గోపాల్, పీఓడబ్ల్యు నాయకురాలు సంధ్య, ఉషా లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అద్దంకి దయాకర్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.నర్సయ్యతో పాటు రాష్ట్రం నలుమూలాల నుంచి జన సమితి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.