పోలింగ్‌కు కౌంట్ డౌన్ షురూ.. మొదలైన ప్రలోభాల పర్వం

by Disha Web Desk 23 |
పోలింగ్‌కు కౌంట్ డౌన్ షురూ.. మొదలైన ప్రలోభాల పర్వం
X

దిశ,హైదరాబాద్ బ్యూరో : లోక్ సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది . పోలింగ్ కు గంటల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచడంతో పాటు ప్రలోభాలకు తెరతీశాయి . ఈ పర్యాయం గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ , ఎంఐఎం లకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవడానికి ఓ వైపు ఎంఐఎం, బీజేపీలు ఆరాట పడుతుండగా మరోవైపు ఆయా సెగ్గెంట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెస్ అగ్రనాయకులు ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు, పాదయాత్రలు చేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను ప్రాధేయపడటం ఆసక్తి కరంగా మారింది . ఇదిలా ఉండగా ఈ పర్యాయం పాతబస్తీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలను ఓటర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు . ఇందులో భాగంగా అమ్ముల పొదలోంచి అన్ని అస్త్రాలను వినియోగిస్తుంది . రాబోయే ఎన్నికల్లో పాతబస్తీలో గతం కంటే భిన్నమైన తీర్పునిస్తారనే నమ్మకంతో బీజేపీ శ్రేణులు ఉన్నారనే టాక్ నడుస్తోంది .

ప్రభావం చూపని బీఆర్ఎస్, కాంగ్రెస్ లు ...?

హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే కనబడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిని పార్టీ చివరి నిమిషంలో ప్రకటించడంతో ప్రచారం చేసేందుకు అంతగా సమయం లేకుండా పోయింది. అయితే బీఆర్ఎస్ మాత్రం ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన అంతగా ప్రభావం చూపలేకపోయారనే టాక్ నడుస్తోంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ దక్కడం కూడా కష్టమేనని చర్చ వినబడుతోంది. పాతబస్తీలో పూర్తి స్థాయిలో బూత్ కమిటీలు కూడా వేసుకో లేని దుస్థితిలో అభ్యర్థి ఉన్నారనే విమర్శలు సైతం వినబడుతున్నాయి.

మొదలైన ప్రలోభాల పర్వం …

పార్లమెంట్ ఎన్నికలలో ప్రలోభాల పర్వం మొదలైంది. గ్రేటర్ పరిధిలో తమకు విశ్వాసంగా ఉండే నాయకులు, అనుచరులతో పంపకాలు జరుగుతున్నాయి . ఓ వైపు అధికారులు తనిఖీలు చేపడుతూ అక్రమంగా రవాణా చేస్తున్న నగదును పట్టుకుంటున్నా వారి కండ్లు గప్పి గమ్యస్థానాలకు చేరుతుందనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల నిఘా ఉంటుందనే ముందే ఊహించిన పార్టీల నాయకులు ముందుగానే తమకు కావాల్సిన చోట్లకు నగదు తరలించి చివరి రెండు రోజుల్లో పంపకాలు జరిపేందుకు చూస్తున్నారని తెలిసింది. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమై రోడ్లపై చెకింగ్ లు మరింత తీవ్రతరం చేశారు .

మద్యం డంప్ ...?

ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం పోలింగ్ ముగిసేంత వరకు మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు చేసిన ఆదేశాలతో అన్ని పార్టీల నాయకులు అప్రమత్తమయ్యారు. ముందుగానే మద్యం దుకాణాల నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి డంప్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ఏ ఎన్నికలైనా మద్యం, మాంసాహారం, నగదు పంపిణీలది ప్రధాన పాత్ర కావడం , అవి లేనిదే నాయకులు, కార్యకర్తలు ముందుకు రాకపోవడం తో తప్పనిసరి పరిస్థితుల్లో వీటి కొరత రాకుండా నాయకులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు . ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు పోటా పోటీగా ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed