మూసీ విషయంలో దూకుడు.. అధికారుల మీటిం‌గ్‌లో సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2024-11-27 16:06:23.0  )
మూసీ విషయంలో దూకుడు.. అధికారుల మీటిం‌గ్‌లో సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పున‌రుజ్జీవ‌నం విష‌యంలో రాష్ట్ర ప్రభుత్వ చేప‌డుతున్న చ‌ర్యల‌కు సానుకూలంగా హైకోర్టు తీర్పును ఇవ్వడంతో ఊరటనిచ్చింది. మూసీ పున‌రుజ్జీవ‌నం ప్రాజెక్టులో భాగంగా ఇళ్ల కూల్చివేత‌, ఆక్రమ‌ణ‌ల తొల‌గింపును స‌వాల్ చేస్తూ దాఖ‌లైన 46 పిటిష‌న్లను హైకోర్టు విచారించింది. త‌న తీర్పులో హైద‌రాబాద్ న‌గ‌ర చరిత్ర, మూసీ వ‌ర‌ద‌లు, నిజాం కాలం నాటి చ‌ట్టాలు, త‌ర్వాత కాలంలో చ‌ట్టాల‌ను కోర్టు ఉదహరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వం చేప‌డుతున్న మూసీ పున‌రుజ్జీవ‌నంతో పాటు జ‌ల వ‌న‌రుల సంర‌క్షణ‌కు అనుకూలంగా ఉన్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు దీనిపై మంగ‌ళ‌వారం స‌మాలోచ‌న‌లు జ‌రిపారు.హైకోర్టు తీర్పు ఆధారంగా భ‌విష్యత్‌లో చేప‌ట్టాల్సిన కార్యాచ‌ర‌ణ రూప‌క‌ల్పన, తీర్పు అమ‌లుపై చ‌ర్చించారు.

మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) అధికారులు సమావేశమయ్యారు. నిజాంకాలం నాటి చట్టాలతో ప్రభుత్వానికి బలంచేకూనట్టైంది. మూసీ పున‌రుజ్జీవ‌నంతో ప్రభావిత‌మ‌య్యే వారిపై ప్రభుత్వం స‌ర్వే చేయించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్రకారం వారికి త‌గిన ప్రదేశాల్లో ఆవాసం క‌ల్పించే అంశంపై చర్చించినట్టు అధికారులు ప్రకటించారు. ఒక‌వేళ ప‌ట్టా, శిఖం ప‌ట్టాలు ఉంటే వారికి అధికారులు నోటీసులు ఇచ్చి ఆ భూమిని సేక‌రించి చ‌ట్ట ప్రకారం వారికి ప‌రిహారం చెల్లించడానికి తీసుకునే చర్యల గురించి చర్చించినట్టు తెలిపారు.

‘మూసీ న‌ది ప‌రిధిలో ఆక్రమ‌ణ‌ల తొల‌గింపున‌కు సంబంధించి ట్రయ‌ల్ కోర్టులు స్టేలు, ఇన్‌జంక్షన్ ఆర్డర్లు ఇచ్చే ముందు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫ్ హైద‌రాబాద్ వ‌ర్సెస్ ఫిలొమెనా ఎడ్యూకేష‌న్ ఫౌండేష‌న్ ఆఫ్ ఇండియా, హైద‌రాబాద్ కేసులో హైకోర్టు డివిజ‌న్ బెంచ్ ఇచ్చిన మార్గద‌ర్శకాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి’ అనే అంశంపై ప్రత్యేకంగా చర్చించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు మూసీ రివ‌ర్ బెడ్‌, ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్ జోన్లలో చేప‌ట్టే స‌ర్వేల‌ను అడ్డుకోవ‌ద్దని పిటిష‌న‌ర్లు, ఆక్రమ‌ణదారులకు కోర్టు సూచించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed