మెట్రో మతలబు అదే..! డిసెంబర్‌లోనే చెప్పిన ‘దిశ’

by S Gopi |   ( Updated:2023-03-24 04:51:32.0  )
Hyderabad Metro Trains
X

ఖర్చు, దూరం తక్కువగా ఉన్న ఇతర మార్గాలను కాదని ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో వేసేందుకు సర్కారు రాయదుర్గం రూట్‌ను ఎంచుకున్నది. ఆగమేఘాల మీద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. స్టేట్‌లో మూడు కారిడార్లను పీపీపీ మోడల్‌లో ఎల్‌అండ్‌టీ కంపెనీకి అప్పగించగా, ఈ రూట్‌లో మాత్రం తామే రైళ్లను నడుపుతామని సర్కారు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల విలువను పెంచేసి, ఆ తర్వాత అమ్మేందుకు ప్రభుత్వం ఈ రూట్‌ను ఎంచుకున్నదని మూడు నెలల కిందే ‘దిశ’ చెప్పింది. బుద్వేల్‌లోని ప్రభుత్వ భూముల్లో వెంచర్లు వేసి విక్రయించేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాయదుర్గం టు ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాజెక్టు పనులకు గతేడాది డిసెంబర్‌లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. బుద్వేల్‌లో ఉన్న ప్రభుత్వ భూముల విలువ పెంచి, ఆ తర్వాత విక్రయించుకోవడం కోసమే మెట్రోకు సర్కారు ఈ రూట్ ఎంచుకున్నదని అప్పుడే ‘దిశ’ గుర్తించింది. ప్లాట్లు చేసి, వేలం వేసి రూ. వేల కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం రాబడిని ఆశిస్తున్నదని గతేడాది డిసెంబరు 30న ‘మెట్రో మతలబు!’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడదే నిజమవుతున్నది. అనుకున్నట్లుగానే హెచ్ఎండీఏ బుద్వేల్‌లో ప్రభుత్వ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తున్నది. మొదట 182 ఎక‌రాల్ని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అభివృద్ధి చేస్తామని హెచ్ఎండీఏ ప్రకటించింది. ఒక్కో ప్లాటు విస్తీర్ణం 6.13 ఎకరాల నుంచి 14.58 ఎక‌రాల వరకు ఉండే అవకాశమున్నది. మొదటి దశలో 60.08 ఎక‌రాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడు ప్లాట్లను విక్రయించ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ సర్వే నెం. 283/పీ, 284/పీ, 287/పీ, 288/పీ, 289, 290, 291, 292, 293, 294, 205, 296, 297, 298, 299/పీ లలో ఈ స్థలాలు ఉన్నాయి. ఓ వైపు రింగ్ రోడ్డు, మరోవైపు హిమాయత్ సాగర్.. పక్కనే వ్యవసాయ యూనివర్సిటీ ఉండడంతో ఈ లే అవుట్‌కు అత్యంత ప్రాధాన్యత లభించనున్నది.

కబ్జా కాకుండా అమ్మకం

భూములు కబ్జాకు గురికాకుండా కాపాడే బదులు, ప్రభుత్వం వాటిని ఆదాయ మార్గంగా మార్చుకుంటున్నది. బాచుపల్లి, మేడిపల్లి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ లే అవుట్లు చేసి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నది. అదే క్రమంలో రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 180 ఎకరాలను లే అవుట్ చేసి ఆన్‌లైన్ ద్వారా అమ్మేందుకు డ్రాఫ్ట్ లే అవుట్ సిద్ధం చేశారు. మాదాపూర్‌ నుంచి గచ్చిబౌలి, కోకాపేట వరకు ఐటీ కారిడార్‌ ఉన్నది. రాజేంద్రనగర్‌, హిమాయత్‌సాగర్‌, శంషాబాద్‌ ప్రాంతాల్లో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా పారిశ్రామిక వాడలు, నివాస ప్రాంతాలుగా మలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆదాయ మార్గంగా..!

రాయ‌దుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు దాకా మెట్రో రైలు ప్రాజెక్టును చేపడితే రూ. 6 వేల కోట్లు ఖర్చవుతుంది. కానీ దాని వల్ల రూ. 40 వేల కోట్ల ఆదాయాన్ని సమీకరించే వీలుందని సర్కారు అంచనా వేసినట్లు తెలుస్తున్నది. బుద్వేల్‌లో అభివృద్ధి చేస్తున్న ఈ లేక్ సిటీని మ‌ల్టీపుల్ యూజ్ జోన్‌గా ప్రక‌టించారు. దాని వల్ల ఆఫీసులు, రెసిడెన్షియల్ జోన్లు, రిటైల్‌, ఎంట‌ర్‌ టైన్‌‌మెంట్‌, హెల్త్‌‌కేర్ వంటి అనేకం కొలువుదీరే అవకాశం ఉన్నది.

ఇవి కూడా చదవండి: పేపర్ లీక్ కేసు.. సమగ్ర నివేదికనివ్వండి: సీఎస్, డీజేపీ, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌లకు మరోసారి తమిళిసై లేఖ

Advertisement

Next Story