ఢిల్లీ బహుత్ దూర్ హై!

by S Gopi |   ( Updated:2023-10-10 16:20:47.0  )
ఢిల్లీ బహుత్ దూర్ హై!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ వెళ్లడానికి సీఎం కేసీఆర్ ఇంట్రస్ట్ చూపడం లేదు. నూతన సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన హస్తిన దారి పట్టలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూతురు కవిత పేరు బహిర్గతమైనప్పటి నుంచే ఆయన ఢిల్లీ వెళ్లేందుకు ఆసక్తి చూపడంలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈడీ విచారణ సమయంలో వెళ్తే కొత్త చిక్కులు వస్తాయని టూర్లకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. బీఆర్ఎస్ కు ఈసీ గుర్తింపు లభించాక కేసీఆర్ ఢిల్లీ టూర్లు ఎక్కువగా ఉంటాయని భావించారు. హస్తినలో మేధావులతో సంప్రదింపులు జరుపుతారని అనుకున్నారు. జాతీయ మీడియాతో బీఆర్ఎస్ ఏర్పాటు ఉద్దేశ్యాలను వివరిస్తారని అంచనా వేశారు. కానీ వాటన్నింటిని లిక్కర్ కేసు కారణంగా వాయిదా వేసుకున్నట్టు పార్టీ వర్గాల్లో టాక్ ఉన్నది.

మూడు నెలలుగా...

హస్తిన వేదికగా సీఎం కేసీఆర్ రాజకీయ కార్యక్రమాలు ఉంటాయని విశ్లేషకులు అంచనా వేశారు. ప్రతి వారంలో రెండు రోజులు అక్కడే ఉండి పార్టీ విస్తరణపై దృష్టి పెడుతారని పార్టీ సైతం లీకులు ఇచ్చింది. కానీ డిసెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన తర్వాత కేసీఆర్ ఢిల్లీకి వెళ్లలేదు. లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణ వేగవంతమైన తర్వాత కేసీఆర్ డిల్లీ టూర్ ఊసే లేకుండాపోయింది. ఈ మధ్య కేసీఆర్ డిల్లీకి వెళ్లే అవకాశం ఉందని, అందుకు ఏర్పాట్లు కూడా జరిగాయని ప్రచారం జరిగింది. కానీ ఆ టూర్లు కూడా వాయిదా పడినట్టు చెప్తున్నారు. అయితే లిక్కర్ కేసు విచారణ సమయంలో హస్తినకు వెళ్తే జాతీయ మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు ఏం సమాధానాలు ఇవ్వాలో తెలియక టూర్లను వాయిదా వేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

గతంలో వారాల కొద్దీ ఢిల్లీలోనే...

బీఆర్ఎస్ కు ఈసీ గుర్తింపు ఇవ్వకముందు సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్తే కనీసం వారం రోజులపాటు అక్కడే ఉండేవారు. అక్కడి నుంచే రాష్ట్ర పాలనపై రివ్యూలు చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. కీలకమైన అంశాలు ఉంటే లీడర్లను అక్కడికే పిలిచి మాట్లాడేవారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత పార్టీ ఎజెండా ఎలా ఉండాలి? ఏ విధంగా పార్టీని విస్తరించాలి? దేశంలో గుణాత్మక రాజకీయాల కోసం ఏం చేయాలి? అనే అంశాలపై రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లు, వర్సిటీ ప్రొపేసర్లు, ఆర్మీ అధికారులతో చర్చలు జరపాలని భావించారు. కానీ ఈడీ విచారణ కారణంగా ఆయన తన షెడ్యూల్ ను పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పార్టీ కార్యాలయంలో కూడా ఎలాంటి యాక్టివిటీస్ లేవు. సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లినప్పుడు మాత్రమే ఆ ఆఫీసులో లీడర్లు కనిపిస్తారని టాక్ ఉంది.

మంత్రులకు ఢిల్లీ డ్యూటీలు

ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత డిల్లీకి వెళ్లిన ప్రతిసారి సగం మంది మంత్రులకు ఢిల్లీ డ్యూటీలు పడుతున్నట్టు కామెంట్స్ ఉన్నాయి. ఆమె విచారణకు ముందు రోజు ఢిల్లీకి వెళ్లి, విచారణ పూర్తవగానే హైదరాబాద్ కు రావడం పరిపాటిగా మారిందని విమర్శలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ డిల్లీకి వెళ్లి కూతురు కవితకు బాసటగా ఉండలేని పరిస్థితి ఉందని, అందుకే ఆయన తనకు బదులుగా మంత్రులను ఢిల్లీకి పంపుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే కొందరు మంత్రులకు పదే పదే ఢిల్లీకి వెళ్లడం ఇష్టం లేదని, కాని కేసీఆర్ ఆదేశాల మేరకు మౌనంగా ఉంటున్నట్లు చర్చ జరుగుతున్నది.

Advertisement

Next Story

Most Viewed