క్యూనెట్ చీటింగ్!

by S Gopi |
క్యూనెట్ చీటింగ్!
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: క్యూ నెట్ సంస్థ ఈ కామ‌ర్స్ పేరుతో డైరెక్ట్ సెల్లింగ్ చేస్తామ‌ని చెబుతున్నా, అస‌లు ల‌క్ష్యం నిరుద్యోగుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డ‌మేనని స్పష్టంగా తెలుస్తున్నది. చెక్కుల రూపంలో శాల‌రీ ఖాతాలో జ‌మ అవుతుంద‌ని ఆశ‌లు కల్పించిన నిర్వాహకులు, ఉద్యోగం కావాలంటే రూ.1.50 లక్షలు క‌ట్టాల‌ని ష‌ర‌తు విధించారు. నెల తర్వాత ఎలాంటి జీతం చెల్లించకపోగా, ఫ్యామిలీ మెంబర్స్ ను జాయిన్ చేయించుకోవాల‌ని, దీనికి రూ.30 వేలు క‌డితే స‌రిపోతుందంటూ మోసం చేస్తున్నారు. ఆ త‌ర్వాత మ‌రొక‌రిని జాయిన్ చేయిస్తేనే మీకు చెక్కులు వ‌స్తాయ‌ని నమ్మబలికారు. సంస్థ గుట్టును తెలుసుకున్న కొంత‌మంది తిర‌గ‌బ‌డితే, ఏం చేసుకుంటారో చేసుకోండ‌ని నిర్వాహకులు తెగేసి చెప్పారు. కొద్దిరోజుల క్రితం వ‌రంగ‌ల్ జిల్లా న‌ర్సంపేట‌కు చెందిన ర‌చ‌న త‌ల్లి స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని ప్రధాన కార్యాల‌యానికి వెళ్లి నిర్వాహకులను నిల‌దీయ‌గా, ఆమెపై దాడికి య‌త్నించిన‌ట్లుగా బాధితురాలు ఆరోపిస్తున్నది.

ఒకరి వెంట ఒకరు..

స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్ని ప్రమాదంలో మృతిచెందిన వారంతా క్యూ నెట్ సంస్థలో ప‌నిచేస్తున్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. మృతిచెందిన వారిలో ప్రమీల, వెన్నెల, శ్రావణి, శివ, ప్రశాంత్‌ లు వ‌రంగ‌ల్‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల‌కు చెందినవారు. ఈ ఐదుగురితోపాటు మ‌రికొంత‌మంది న‌ర్సంపేట‌, మ‌హ‌బూబాబాద్‌కు చెందిన వారు కొద్ది నెల‌ల క్రిత‌మే క్యూ నెట్‌ సంస్థలో చేరారు. అంద‌రూ కూడా టెన్త్‌, ఇంట‌ర్, డిగ్రీ, బీటెక్ క్లాస్‌మేట్స్‌, లేదా బంధుత్వం, మిత్రుత్వం నేప‌థ్యం ఉన్నవారే కావ‌డం గ‌మ‌నార్హం. న‌ర్సంపేట డివిజ‌న్‌కు చెందిన శ్రావ‌ణి, ప్రమీల, వెన్నెల, వినోద‌ ఇంటర్ ఫ్రెండ్స్‌. అలాగే ర‌చ‌న‌, శ్రావ‌ణి టెన్త్ క్లాస్‌మేట్స్ కాగా, వినోదకు శ్రావ‌ణి దగ్గరి బంధువు కూడా. ప్రమీల, శ్రావ‌ణి బీటెక్ పూర్తి చేశారు. వెన్నెల, వినోద డిగ్రీ పూర్తి చేశారు. గతేడాది మొద‌ట్లో వెన్నెల ద్వారా వినోద‌, ప్రమీల, శ్రావ‌ణి జాయిన‌య్యారు. శ్రావ‌ణి ద్వారా ర‌చ‌న జాయినైంది. ఇలా ఒక‌రి వెంట ఒక‌రు క్యూ నెట్ వ‌ల‌లో చిక్కుకుని బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. పెట్టిన డ‌బ్బులు తిరిగి రావాలంటే మ‌రొక‌రిని జాయిన్ చేయ‌డం త‌ప్ప వేరే గ‌త్యంత‌రం లేక‌పోవ‌డంతో మోస‌మ‌ని తెలిసినా మిగ‌తా వారిని క్యూ నెట్ ఊబిలోకి లాగిన‌ట్లుగా బాధితులు వెల్లడిస్తున్న దాన్ని బ‌ట్టి తెలుస్తున్నది.

రూ. వేల కోట్ల మోసాలు.. వేల మంది బాధితులు!

క్యూ నెట్ మోసాల‌ను గ‌తంలోనే ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ వెలికితీశారు. క్యూనెట్ ఈ కామ‌ర్స్‌, విహన్ డైరెక్ట్ సెల్లింగ్, గోల్డ్ క్విస్ట్, క్విస్ట్ నెట్ లాంటి కొత్త పేర్లతో వచ్చే మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థలను నమ్మవద్దని హెచ్చరించారు. క్యూనెట్ నిర్వాహకులే కొత్త పేర్లతో ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా వివ‌రించారు. ఈ సంస్థ డైరెక్టర్లపై లుక్ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా రూ.5 వేల కోట్లు మోసం చేసినట్లుగా గ‌తంలోనే నిర్ధార‌ణ చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కవ శాతం బాధితులు ఉన్నారని తెలిపారు. గ‌తంలో ఈడీ సైతం దాడులు నిర్వహించింది. బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్‌ చేసింది. ఇప్పటికే ఇచ్చిన డ‌బ్బులు రాక‌పోవ‌డంతో కొంత‌మంది ఆత్మహత్య సైతం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ లో వందలాది మంది, రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఈ సంస్థ మోసాల‌కు బ‌లైన‌ట్లు తెలుస్తున్నది. పోలీసులు విచార‌ణ చేస్తామ‌ని ప్రకటించడంతో ఒక్కొక్కరు బ‌య‌ట‌కు వ‌చ్చి సంస్థ మోసాల‌పై ఫిర్యాదులు చేస్తుండడం గమనార్హం.

వందల సంఖ్యలో కేసులు.. సినీతార‌ల‌కు నోటీసులు

ఈ సంస్థ, డైరెక్టర్లపై గ‌త నాలుగేళ్లలో వంద‌ల సంఖ్యలో కేసులు న‌మోద‌య్యాయి. ఎలాంటి గుర్తింపు పొంద‌ని ఈ సంస్థకు ప్రచారకర్తలుగా ప‌నిచేసిన ప‌లువురు బాలీవుడ్ తార‌లకు సైతం నోటీసులు అందాయి. బాలీవుడ్ కు చెందిన షారూక్ ఖాన్, పూజా హెగ్డే, టాలీవుడ్ కు చెందిన అల్లు శిరీష్ వంటివారు నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఇక ఈ సంస్థలో ఉద్యోగంలో చేరాలంటే ముందే రూ.2 లక్షలు చెల్లించాలి. అలాగే మ‌రొక‌రిని చేర్పించాల్సి ఉంటుంద‌ని ఓ చెల్లని బాండ్ పేప‌రుపై సంత‌కాలు తీసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం.

మా అమ్మను చంపుతామ‌న్నారు: రచ‌న‌, మంగ్దుపురం, న‌ర్సంపేట‌

ఇంటి వ‌ద్ద నుంచే ఆన్‌లైన్‌లో ప్రొడ‌క్ట్స్ సేల్స్ చేస్తే స‌రిపోతుంద‌ని చెప్పారు. అయితే ఉద్యోగం కావాలంటే రూ.1.50 లక్షలు క‌ట్టాల‌ని కండీషన్ పెట్టారు. మంచి ఉద్యోగం వ‌స్తుంది క‌దా అని మా అమ్మ వాళ్లు అప్పు చేసి మ‌రీ డ‌బ్బులు కట్టారు. ఆ త‌ర్వాత మీ ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ ను చేర్చుకోవడానికి రూ.30 వేలు క‌ట్టాలని ఒత్తిడి చేస్తే అదీ చేశాను. అయితే మ‌రొక‌రిని జాయిన్ చేయాల‌ని చెప్పారు. అనుమానం క‌లిగి ఉద్యోగం వ‌ద్దు ఏమీ వద్దు నా డ‌బ్బులు తిరిగి ఇవ్వాల‌ని కోరాను. కానీ ఇవ్వలేదు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లోని కార్యాల‌యం వద్దకు వెళ్లి నిర్వాహాకుల‌ను మా అమ్మతో స‌హా వెళ్లి నిల‌దీశాం. మ‌రోసారి ఇక్కడికి వ‌స్తే చంపేస్తానంటూ శివ అనే వ్యక్తి హెచ్చరించాడు.

వంద‌ల మంది మోస‌పోయారు: బానోతు వినోద‌, ఖానాపురం, వ‌రంగ‌ల్ జిల్లా

ఉద్యోగం వ‌స్తుంద‌నే ఆశ‌తో వరంగ‌ల్ జిల్లాలో వంద‌ల మంది జాయిన‌య్యారు. నాకు తెలిసిన బంధువులు, మిత్రుల్లోనే 20 మంది వ‌ర‌కు ఉన్నారు. మోసం తెలుసుకుని డ‌బ్బులు ఇవ్వాలంటే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. పోలీస్ కేసు పెట్టుకోండని బెదిరిస్తున్నారు. నేను రూ.1.80 లక్షలు క‌ట్టాను. నా బంధువుల‌తో కలిసి ఆందోళ‌న చేస్తే రూ. ల‌క్ష ఇచ్చారు. ఓ డిన్నర్ సెట్ పంపి దీని విలువ రూ.60 వేలు ఉంటుంద‌ని చెప్పారు. మిగ‌తా మొత్తం రిజిస్ట్రేష‌న్ ఖ‌ర్చంటూ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed