- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గుట్టుచప్పుడు కాకుండా నకిలీ సర్టిఫికెట్ల తయారీ
దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉద్యోగాలు లేక యువత, ఉద్యోగం ఉన్నా పైఅధికారులను తప్పు దోవ పట్టించేందుకు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్ల వెంట పరుగులు పెడుతుండడంతో నగరంలో నకిలీ సర్టిఫికెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. తయారీదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా ఎప్పటికప్పుడు ఈ వ్యవహారం కొత్తపుంతలు తొక్కుతోంది. అమాయక యువకులకు మాయమాటలు చెప్పి నకిలీ సర్టిఫికెట్లను వారికి తయారీదారులు అంటగడుతున్నారు. వేల రూపాయలు సులువుగా దొరుకుతుండడంతో జైలుకు వెళ్లి శిక్షలు అనుభవించినప్పటికీ వారిలో మార్పురావడం లేదు. బయటకు వచ్చిన అనంతరం తిరిగి తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. పదవ తరగతి నుంచి మొదలు ఏ సర్టిఫికెట్ కావాలన్నా క్షణాలలో తయారు చేసి అందిస్తున్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లను తలదన్నేలా తయారు చేసి ఇవ్వడంతో ఇది తెలియక కొనుగోలు చేసినవారు అవి నకిలీవని తెలిసిన అనంతరం తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోతున్నారు. పోలీసుల దాకా వ్యవహారం వెళితే ఇబ్బందులు ఎదురౌతాయని ఫిర్యాదులు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడం డుప్లికేటుగాళ్లకు కలసివస్తోంది. నకిలీ సర్టిఫికెట్లతో జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు అంతగా తెలియని యువత తప్పుడు మార్గం ఎంచుకుంటుండగా అన్నీ తెలిసిన ఉద్యోగులు కూడా పదోన్నతుల కోసం నకిలీల వెంట పడుతుండడం గమనార్హం.
టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు..
డబ్బులిస్తే చాలు ఏ సర్టిఫికెట్ అయినా ఇచ్చేస్తారు. విద్యార్థుల జీవితాలను మార్చేవి విద్యార్హత సర్టిఫికేట్లే కావడం, ఈ సర్టిఫికేట్లు ఆధారంగానే వారి జీవితం ఆధారపడి ఉండంతో కొంతమంది వ్యక్తులు ఈ సర్టిఫికేట్లను నకిలీవి తయారు చేస్తున్నారు. తాజాగా సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాదర్‌ఘాట్ పోలీసులతో కలిసి పట్టుకోవడం నగరంలో కలకలం సృష్టించింది. పోలీసులు నిందితుల నుంచి పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకోవడంతోపాటు ఎనిమిది మంది సభ్యుల ముఠాలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేవారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని రాయలసీమ యూనివర్శిటీ, ఆంధ్రా యూనివర్శిటీ, రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్, బెంగుళూరు యూనివర్శిటీ, ఉస్మానియా యూనివర్శిటీ, అన్నా యూనివర్శిటీ, రాజస్థాన్ యూనివర్శిటీ ఫర్ హెల్త్ సైన్స్ వంటి 17 యూనివర్శిటీలకు చెందిన పలు నకిలీ సర్టిఫికెట్లను అంటగడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి వద్ద సర్టిఫికెట్లు తీసుకున్న వారిలో 70 మంది వరకు ఉండగా అందులో 30 మంది విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో కన్సల్టెన్సీల ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
గతంలో పట్టుబడిన నకిలీ సర్టిఫికెట్ల ముఠాలు..
హైదరాబాద్ కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలు తరచుగా పోలీసుల దాడులలో పట్టుబడుతూనే ఉన్నాయి. సుమారు రెండేళ్ల క్రితం అమీర్‌పేటలోని నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. విదేశాలకు వెళ్లే వారికి సర్టిఫికేట్ అవసరం కాగా నకిలీ పత్రాలను తయారీ చేస్తూ నిందితుడు పట్టుబడ్డాడు. జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) పరిధిలోని పలు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో నకిలీ ప్రొఫెసర్లుగా చెలామణి అవుతున్న వారి బాగోతం బయటపడింది. పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న వీరు నకిలీ పీహెచ్‌డీలు పొంది, బోధిస్తున్నట్లు గుర్తించారు. నకిలీ ప్రొఫెసర్లపై తొలుత ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జేఎన్‌టీయూ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టడంతో వ్యవహారం వెలుగుచూడడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మరో సంఘటనలో నకలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బషీర్‌బాగ్ ప్రధాన కేంద్రంగా ఇంటర్, డిగ్రీ, బీటెక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నారన్న సమాచారం అందడంతో అప్పట్లో పోలీసులు దాడులు చేపట్టి నిందితులను పట్టుకున్నారు.
మరింత కఠినంగా వ్యవహరించాలి..
నకిలీ సర్టిఫికెట్ల తయారీదారులపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలనే అభిప్రాయాలు నిరుద్యోగుల నుంచి వినబడుతున్నాయి. సంవత్సరాల తరబడి చదివి సర్టిఫికెట్లు పొందినవారికి నకిలీ సర్టిఫికెట్ల కారణంగా ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు పొందినవారిలో కొంత మంది విదేశాలకు వెళ్లిపోవడం పరిస్థితికి అద్దంపడుతోందని, వీటిని అరికట్టేందుకు పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే అర్హులైన వారికి ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత కోరుతోంది.