తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు..

by Sumithra |
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు..
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదిసంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పలుకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నాంపల్లిలోని కార్యాలయంలో జిల్లా అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించి తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. జూన్ 2వ తేదీన ఉదయం 10గంటలకు గృహకల్ప ఆవరణలోని కార్యాలయంలో జాతీయపతాక ఆవిష్కరణ, అనంతరం గృహకల్ప కార్యాలయం నుండి అమరవీరుల స్తూపం వరకు ఉద్యోగులతో ర్యాలీ, కేక్ కటింగ్ ఉంటుందన్నారు. 9వ తేదీన కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులతో హైదరాబాదు జిల్లా కార్యాలయంలో సుపరిపాలన పై సదస్సు, 14వ తేదీన మహిళా ఉద్యోగుల కొరకు జిల్లా కార్యాలయంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు, 19వ తేదీన మొక్కలు నాటడం, 22వ తేదీన అమరవీరుల సంస్కరణ, జిల్లా ఉద్యమకారులకు సన్మానం, గృహకల్ప ప్రాంగణంలో పెద్దఎత్తున ఉద్యోగులతో సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

తక్షణమే ఉద్యోగుల కారుణ్య నియామకాలు చేపట్టాలని, ఉద్యోగులకు హెల్త్ కార్డు పూర్తిస్థాయిలో అమలు చేయాలని, జులైనెల నుండి పీఆర్సీ కమిటీ వేసి ఐఆర్ విడుదల చేయాలని, డీఏ బకాయలు విడుదల చేయాలని, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మిడ్ - డే-మీల్స్ కార్యక్రమం అమలు కొరకు అసిస్టెంట్ డైరెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్.మురళి రాజు కేంద్రసంఘంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులు కావడంతో ఆయనను ఘనంగా సన్మానించారు.

Advertisement

Next Story