- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ష్.. గప్‌చుప్..! డిప్యూటేషన్ల వివరాలపై హెచ్ఓడీల తీరు
దిశ, సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మహా నగరవాసులకు అతి ముఖ్యమైన సేవలందించే జీహెచ్ఎంసీలోని విభాగాధిపతుల పనితీరు విచిత్రంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలోకి ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్లపై వచ్చిన అధికారుల వివరాలను విభాగాధిపతులు గోప్యంగా ఉంచుతూ, వివరాలు అడిగిన వారికి ష్..గప్ చుప్ అంటూ దాటవేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే చోట ఒకే విభాగంలో రెండేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్న వివిధ విభాగాల ప్రభుత్వాధికారులకు స్థానచలనం కలిగించేందుకు సర్కారు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వివిధ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్, ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, విద్యుత్, సీడీఎంఏ, టౌన్ ప్లానింగ్, కోఆపరేటీవ్, వైద్యారోగ్య శాఖ, స్టాటిస్టిక్స్, మలేరియా తదితర విభాగాల నుంచి జీహెచ్ఎంసీలో వందలాది మంది అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీటిలో సింహభాగంగా ఆఫీసర్ల డిప్యూటేషన్ గడువు ఇప్పటికే ముగిసినా, వారు ఇంకా అదే పదవుల్లో కొనసాగుతున్నారు.
వివరాలు ఇచ్చేందుకు ససేమిరా..
ఆఫీసర్ల వివరాలు సమర్పించాలంటూ జీహెచ్ఎంసీ పరిపాలన విభాగం ఆయా విభాగధిపతులకు లేఖలు రాసింది. లేఖలు స్వీకరించిన వివిధ విభాగాల అధిపతుల్లో ఒకరిద్దరు మినహా మిగిలిన వారెవ్వరూ కూడా వివరాలు సమర్పించలేదని తెలిసింది. మరికొందరు వివరాలు సమర్పించేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. ఉద్యోగుల బదిలీలపై ఈ నెల 6న సర్కారు నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీచేయడంతో వివిధ విభాగాలకు జీహెచ్ఎంసీ పరిపాలనశాఖ వారం రోజుల క్రితమే లేఖలు రాసినా, అధికారుల వివరాలివ్వటం లేదని తెలిసింది. గతంలో సెంట్రలైజేషన్ సిస్టమ్ అమలులో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్ పై వచ్చే అధికారుల వివరాలు పరిపాలన విభాగంలో ఉండేవి. కానీ, డీ సెంట్రలైజేషన్ చేసిన తర్వాత వివిధ విభాగాల అధిపతులకే ఆ ఆఫీసర్లు రిపోర్టు చేసేలా, వారి వద్దే వారికి సంబంధించిన వివరాలుంటున్నాయి.
డైరెక్టర్ టౌన్, అండ్ కంట్రీ ప్లానింగ్ నుంచి టౌన్ ప్లానింగ్ విభాగానికి వివిధ హోదాల్లో వచ్చే అధికారుల వివరాలు చీఫ్ సిటీ ప్లానర్ వద్ద ఉండగా, ఇంజీనింగ్ విభాగానికి సంబధించిన ఆఫీసర్ల వివరాలు ఇంజినీర్ ఇన్‌చీఫ్ వద్ద అందుబాటులో ఉండాల్సిందే. కానీ పరిపాలన శాఖ వివరాల కోసం లేఖలు రాసి వారం రోజులు గడుస్తున్నా, జీహెచ్ఎంసీలోని ముఖ్యమైన విభాగాల నుంచి ఆఫీసర్ల వివరాలు ఆ సెక్షన్‌కు చేరలేదని తెలిసింది. తమ విభాగంలోకి ఏశాఖ నుంచి ఎవరెవరు వచ్చారు, ఎప్పుడు వచ్చారు, వారి డిప్యూటేషన్ గడువు ఎప్పుడు ముగుస్తుంది అన్న వివరాలు విభాగాధిపతుల వద్ద ఉన్నా, సమర్పించేందుకు వారెందుకు తాత్సారం వహిస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
బదిలీల నుంచి తప్పించుకునేందుకు..
జీహెచ్ఎంసీలో ఏళ్లతరబడి ఒకే సర్కిల్, ఒకే విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సైతం పదోన్నతులు, స్థానచలనం కలిగించాలన్న ఉద్దేశ్యంతో జీహెచ్ఎంసీ మాజీ కమిషనర్ రొనాల్డ్ రోస్ సర్కిళ్ల వారీగా కార్పొరేషన్ ఉద్యోగులు, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చిన ఆఫీసర్ల వివరాలను సేకరించాలని ఆదేశించారు. 30 సర్కిళ్లలో సిబ్బంది ఈ సమాచారం మొత్తాన్ని సేకరించేలోపే ఆయన జీహెచ్ఎంసీ నుంచి బదిలీ అయి వెళ్లిపోయారు. కార్పొరేషన్ ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్న సమయంలో అంబర్‌పేట సర్కిల్‌లోని కొందరు ఉద్యోగులు ఈ బదిలీల నుంచి తప్పించుకునేందుకు తమ వివరాలు మ్యాచ్ కాకుండా తప్పుడు నివేదికలను ఇచ్చినట్లు సమాచారం. మేల్ ఎంప్లాయీ వివరాలను ఫీమేల్ ఎంప్లాయీగా, తల్లిదండ్రుల పేర్లను సైతం మార్చినట్లు సమాచారం. అంబర్‌పేటతో పాటు ముషీరాబాద్ సర్కిల్‌లో కొందరు కార్పొరేషన్ ఉద్యోగులు రెండు, రెండున్నర దశాబ్దాలుగా బదిలీల్లేకుండా తిష్టవేసినట్లు సమాచారం.