‘బట్టలిప్పి కొడతా’.. మహిళా స్వీపర్లకు ఎస్ఎఫ్ఏ వార్నింగ్..!

by Satheesh |
‘బట్టలిప్పి కొడతా’.. మహిళా స్వీపర్లకు ఎస్ఎఫ్ఏ వార్నింగ్..!
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలోని మేయర్, కమిషనర్‌తో పాటు మరో అయిదుగురు లేడీ బాస్‌లు కీలకమైన విధుల్లో ఉన్నా, బల్దియాలో స్వీపర్ తదితర పోస్టుల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగానే మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ యువతి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్ చేసి స్వచ్ఛ భారత్ మిషన్‌లోని ఓ అధికారి జైలుపాలైన ఘటన మరువకముందే మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఓ శానిటరీ ఫీల్డు అసిస్టెంట్ అసభ్యకరమైన పదజాలంతో దూషించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విధులకు హాజరైనా, గైర్హాజర్లు వేస్తున్నందున శేరిలింగంపల్లిలోని డోయన్స్ కాలనీలో స్వీపర్‌గా పనిచేస్తున్న ఓ మహిళా ఎస్ఎఫ్ఏను ప్రశ్నించగా, తనకు ఇష్టమొచ్చినట్లు అటెండెన్స్‌లు వేస్తానని తేల్చి చెప్పిన క్రమంలో మహిళా స్వీపర్‌కు ఎస్ఎఫ్ఏకు మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో కోపోద్రిక్తుడైన సదరు ఎస్ఎఫ్ఏ ‘నిన్ను బట్టలిప్పి కొడతా’ అంటూ దూషించినట్లు బాధితురాలు వాపోయారు. ఈ రకంగా సదరు బాధితురాలితో పాటు మరో ఆరుగురు మహిళా స్వీపర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు, అసభ్యకరమైన పదజాలంతో దూషించినట్లు బాధితులు వెల్లడించారు. వెంటనే ఈ విషయాన్ని ఆమె భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ టీ.కృష్ణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బాధితురాలితో కలిసి జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్ఎఫ్ఏలతో పాటు మహిళా స్వీపర్ల పనితీరును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన స్థానిక మెడికల్ ఆఫీసరేమో ఇది ఇద్దరు కార్మికుల మధ్య జరిగిన వివాదమంటూ కొట్టిపారేస్తున్నట్లు సమాచారం.

ఎందుకు వేధింపులకు గురిచేస్తారంటే..

జీహెచ్ఎంసీలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో శానిటేషన్ విభాగంలోనే 18 వేల మంది పనిచేస్తుండగా, అందులో 15 వేలకు పైగా స్వీపర్లే ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది మహిళలే. గతంలో రూ.3 వేలు, రూ.6 వేలు మాత్రమే వీరికి జీతాలను చెల్లించేవారు. ప్రస్తుతం వీరికి రూ.17 వేల వరకు జీతాలు చెల్లించటంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్‌ను కూడా వర్తింపజేస్తున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్న వారిని ఈ రకంగా వేధింపులకు గురిచేస్తే, తట్టుకోలేక వారు ఉద్యోగాలు మానేస్తే, ఆ పోస్టును అమ్ముకునేందుకే పలు సర్కిళ్లలో మెడికల్ ఆఫీసర్ల ఆదేశాల మేరకు ఎస్ఎఫ్ఏలు వేధింపులకు బరితెగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి కొందరు ఎస్ఎఫ్ఏలు, మెడికల్ ఆఫీసర్లు మహిళా స్వీపర్లతో అసభ్యకరంగా ప్రవర్తిసూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇటీవలే గాజులరామారం సర్కిల్‌లో ఓ ఎస్ఎఫ్ఏ ఓ మహిళా స్వీపర్‌ను లైంగికవేధింపులకు గురిచేస్తూ అడ్డంగా దొరికిపోవటంతో అతడిని విధుల్లో నుంచి తొలగించారు.

ఆ కమిటీ ఏం చేస్తున్నట్టో..?

జీహెచ్ఎంసీలో రెండేళ్ల క్రితం ఓ మహిళా కంప్యూటర్ ఆపరేటర్ పట్ల ఓ అధికారి అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో బల్దియాలో మహిళా ఉద్యోగుల భద్రత కోసం వేధింపుల నివారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క బాధితురాలికి న్యాయం చేసిన సందర్భాలు లేవు. పైగా ఈ కమిటీ మొదటిసారిగా డీల్ చేసిన కేసులో సైతం బాధితురాలికి న్యాయం జరగనట్టు సమాచారం. ఈ కమిటీ కేవలం ఆఫీసర్ల స్థాయి మహిళా అధికారులకే వర్తిస్తుందా..? తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి, రోడ్లపై స్వీపింగ్ పనులు చేస్తున్న మహిళా స్వీపర్ల వేధింపుల నివారణకు పనిచేయదా..? అంటూ మహిళా సిబ్బంది చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed