కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ: రోనాల్డ్ రోస్

by Mahesh |   ( Updated:2024-04-17 02:39:05.0  )
కొత్త ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ: రోనాల్డ్ రోస్
X

దిశ, సిటీబ్యూరో: కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతంగా జరిగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఇప్పటికే కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని, కానీ వారికి త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 18న నోటిఫికేషన్ రాగానే నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

సెలవు రోజు ఆదివారం మినహా ఈ నెల 18 నుంచి 25 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఈ నెల 26న పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 29న చివరి గడువు అని వివరించారు. మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్‌లు దాఖలు చేయవచ్చని, అభ్యర్థి వెంట మరో నలుగురిని మాత్రమే నామినేషన్ హాల్‌లోకి అనుమతిస్తారని తెలిపారు. అభ్యర్థులు గరిష్టంగా రూ.95 లక్షల వరకు ఎన్నికల్లో ఖర్చు చేయవచ్చన్నారు. అభ్యర్థులు తమపై ఏవైనా క్రిమినల్ కేసులు ఉంటే వాటి వివరాలు తప్పనిసరిగా న్యూస్ పేపర్, న్యూస్ చానల్స్ ప్రచారం చేయాలని సూచించారు.

మొత్తం ఓటర్లు 45 లక్షల 70 వేల 138..

గత ఫిబ్రవరి 8,2024న ప్రచురితమైన ఫైనల్ ఓటర్ జాబితా మేరకు జిల్లాలో మొత్తం 45 లక్షల 70 వేల 138 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 23 లక్షల 30 వేల 574 మంది పురుషులు కాగా, 22 లక్షల 39 వేల 240 మంది మహిళా ఓటర్లున్నట్లు తెలిపారు. మరో 324 థర్డ్ జండర్ ఓటర్లున్నట్లు ఆయన వివరించారు. సర్వీస్ ఓటర్లు 402 మంది, ఎన్నారై ఓటర్లు 846, పిడబ్ల్యుడి ఓటర్లు 22 వేల 995, 85 ఏళ్లు నిండిన ఓటర్లు 36 వేల 664 మంది ఉన్నారని వివరించారు. జెండర్ రేషియో 961గా ఉందని, 18-19 సంవత్సరాల మధ్య వయస్సున్న ఓటర్లు 65 వేల 595 మంది ఉన్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ఓటరు జాబితా సవరణలో 25 వేల నుంచి 30 వేల మధ్యనున్న బోగస్ ఓట్లను తొలగించినట్లు ఆయన వివరించారు.

మూడు లక్షల పైచిలుకు సవరణలు..

ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా గత జనవరి 23 తేదీ నుంచి ఈ నెల 15 వరకు ఓటరు జాబితాలో సుమారు 3 లక్షల పదివేల 979 క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్ వచ్చాయని, వాటిని ఏప్రిల్ 25లోగా పరిష్కరిస్తామన్నారు. పట్టుకున్న నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స్ కమిటీలో ఆధారాలు అందజేసిన 24 గంటల్లో విడుదల చేస్తున్నామని, ఇప్పటివరకు మొత్తం 73 కేసులకు గాను రూ.2 కోట్ల 39 లక్షల 92 వేల 730 విడుదల కోసం అభ్యర్టించగా, అందులో 70 కేసులకు సంబంధించి రూ.కోటి 70 లక్షలను జిల్లా గ్రీవెన్స్ కమిటీ విడుదల చేసినట్లు వివరించారు.

ఓటింగ్ శాతం పెంపే లక్ష్యం..

ఓటింగ్ శాతం పెరిగేలా విస్తృతంగా వివిధ స్వీప్ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. వీడియో క్యాంపెయిన్, ఇంటింటికి స్టిక్కర్ క్యాంపెయిన్ చేస్తున్నామని తెలిపారు. ఓటర్లను చైతన్యపరిచేలా రూపొందించిన 10 బెస్ట్ వీడియోలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ఆర్వోలు..నామినేషన్లు..

హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్లను కలెక్టర్ తన కార్యాలయంలో స్వీకరించనున్నట్లు, అలాగే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నామినేషన్ పత్రాలను సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ స్వీకరించనున్నట్లు, అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ స్వీకరించనున్నట్లు డీఈవో తెలిపారు.

Advertisement

Next Story