"మనోడే" అయితే ఓకే.. జూనియర్ ల పోస్టింగ్ కు.. సీనియర్ ల పైరవీలు...

by Sumithra |
మనోడే అయితే ఓకే.. జూనియర్ ల పోస్టింగ్ కు.. సీనియర్ ల పైరవీలు...
X

దిశ, సిటీ క్రైం : పోలీసు వర్గాల్లో తాజా చర్చ సంచలనం రేపుతోంది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న సమయంలో మనోడే అనే వారి కోసం ఏకంగా సీనియర్ ఐపీఎస్ అధికారులే పోస్టింగ్ కోసం పైరవీ చేస్తుండడం ఇప్పుడు పోలీసు వర్గాల్లోనే హాట్ టాపిక్. రాజధానిలో ఓ పోలీసు కమిషనరేట్ కు చెందిన కీలక అధికారిని బదిలీ చేస్తున్నారనే వాదన పోలీసు వర్గాల్లో బలంగా వినపడుతోంది. అయితే ఆ కీలక అధికారి బదిలీని కింది స్థాయి అధికారులు సమర్థిస్తూ, ఆయన హాయంలో ఉన్నతాధికారుల పనితీరు పై సామాన్య ప్రజలు, ఆఫీసర్స్ ఫిర్యాదు చేసినా ఫలితం దక్కకా ఎంత ఇబ్బంది పడ్డారో విషయాలను కోకొల్లలుగా మాట్లాడుకుంటున్నారు.

మరో పోలీసు కమిషనరేట్ ముఖ్య అధికారి తీరును తప్పు పడుతున్నారు. ఇప్పటికే పోలీసు వర్గాల నుంచి కొంత మంది ఐపీఎస్ అధికారుల అవినీతి వ్యవహారాలు, వారి అధికార దుర్వినియోగంతో జరుగుతున్న నష్టాల గురించి అనేకం లీకులు బయటికి వచ్చాయి. ఇలా ఇప్పుడు పోలీసు డిపార్ట్ మెంట్ లో ఆఫీసర్స్, సిబ్బంది, అధికారుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా మనోడే.. మనకు సన్నిహితుడే భావనను పెంచుకుని జూనియర్ లకు సీనియర్ ఐపీఎస్ లు పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తుండడం పోలీసు వర్గాల్లో వివాదాస్పదంగా మారింది.

డీసీపీ పోస్టింగ్ కు సీనియర్ ఆఫీసర్ రికమండేషన్...

రాజధానిలోని ఓ కమిషనరేట్ లోని కీలకమైన డీసీపీ పోస్టింగ్ ను మనోడికే దక్కాలనే ఆలోచనతో కమిషనరేట్ లోని ఓ ముఖ్య అధికారి పావులు కదిపారని పోలీసు వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ డీసీపీ గిరి పోస్టింగ్ కోసం సీనియర్ అధికారి కరుణించి ఏకంగా ఇద్దరు ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని మరో ఇద్దరు కీలక అధికారం ఉన్న ప్రజా ప్రతినిధులకు స్వయంగా సిఫార్సు చేసి ఆ పోస్టింగ్ దక్కేలా చేశాడని గట్టిగా వినపడుతోంది. అంతే కాకుండా మనోడే అనే భావనతో ఆ కీలక అధికారి తన చుట్టూ అతని సన్నిహితులను పెట్టుకుంటాడనే ఆరోపణలు పోలీసు వర్గాల్లో ఉంది. మనోళ్ళకే పోస్టింగ్ లు దక్కాలని సీనియర్ అధికారులే పైరవీలు చేస్తే ఎలాంటి అండ లేని అధికారుల పరిస్థితి ఏంటని పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పనితీరు, స్కిల్ ను బట్టి డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ లు దక్కడం ఎప్పుడో పోయిందని, ప్రజాప్రతినిధులు, సీనియర్ అధికారుల అండదండలు ఉంటనే పోస్టింగ్ లు వస్తాయని లేదా మనోడే అనే ముద్ర ఉంటే సీనియర్ అధికారులే ఓ రూట్ చూపించి పోస్టింగ్ లు దక్కేలా చేస్తారని పోలీసు వర్గాలు విమర్శిస్తున్నాయి. ఎలాంటి అండదండలు లేని శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజాసేవ కోసం వచ్చే వారికి ఎప్పుడు లూప్ లైన్ పోస్టింగ్ లతోనే సంతృప్తి చెందాల్సిన పరిస్థితి ఉందని పోలీసు వర్గాల్లో చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed