GHMCలో మళ్లీ ప్లానింగ్ అడిషనల్ కమిషనర్.. ఐఏఎస్‌కు బాధ్యతలు ఇవ్వాలని చర్చ

by Shiva |
GHMCలో మళ్లీ ప్లానింగ్ అడిషనల్ కమిషనర్.. ఐఏఎస్‌కు బాధ్యతలు ఇవ్వాలని చర్చ
X

దిశ, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్ విభాగానికి ప్రత్యేకంగా అడిషినల్ కమిషనర్‌ను నియమించాలని అధికారవర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ పోస్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అడిషనల్ కమిషనర్ (ప్లానింగ్, ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్) పేరుతో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ పోస్టును ఎవరికి ఇవ్వలేదు. జీహెచ్ఎంసీ కమిషనర్ కృష్టబాబు హయాంలో అడిషనల్ కమిషనర్ (ప్లానింగ్, టీఅండ్‌టీ)గా ధనుంజయ్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత 2013లో సోమేశ్ కుమార్ కమిషనర్‌‌గా వచ్చాక ప్లానింగ్ అడిషనల్ కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ పనిచేశారు.

అనంతరం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఈ పోస్టును ఎవరికి కేటాయించలేదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోనూ ఈ పోస్టు గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసారి ఈ పోస్టు గురించి చర్చ జరుగుతున్నది. అంతేకాదు ఈ పోస్టుకు ఓ ఐఏఎస్ అధికారిని కేటాయించాలని రొనాల్డ్ రోస్ నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారులతోనూ చర్చి్ంచినట్లు సమాచారం. అంతలోనే ఆయన బదిలీపై వెళ్లడంతో ఈ చర్చ మరుగునపడింది. కమిషనర్ ఆమ్రపాలి వెళ్లిపోతారనే నెలరోజుల ముందు కూడా దీనిపై చర్చ జరిగింది. ఇలంబర్తి కమిషనర్‌గా వచ్చాక ఓ అడిషనల్ కమిషనర్ తనకు ప్లానింగ్ అడిషనల్ కమిషనర్ పోస్టు వస్తుందని కొంత మంది అధికారులతో చర్చించినట్లు తెలిసింది.

ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలు..

జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ (ప్లానింగ్, టీఅండ్‌టీ) పోస్టు ఐఏఎస్ అధికారికి ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్లు అడిషనల్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. కానీ చీఫ్ సిటీ ప్లానర్(సీసీపీ) మాత్రం డైరెక్టర్ హోదా కలిగి ఉన్నారు. ఒకవేళ నాన్ ఐఏఎస్ అధికారికి ఇస్తే ప్రొటోకాల్ సమస్య వచ్చే అవకాశముంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అందుకనే ఐఏఎస్ అధికారి అయితే ఈ పోస్టుకు సరైన వ్యక్తి అని భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటు హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో ప్లానింగ్ విభాగానికి మరింత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ తరుణంలో ఈ సమస్యలను డీల్ చేయడానికి ఐఏఎస్ అధికారికి ఇస్తేనే బాగుంటుందని పలువురు రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ ఇలంబర్తి జార్ఖండ్ నుంచి వచ్చాక ఈ పోస్టు గురించి పూర్తి స్థాయిలో చర్చించి ప్రభుత్వం ద్రష్టి తీసుకెళ్లనున్నారు. ఈ పోస్టును ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న ఐఏఎస్ అధికారులకు ఇస్తారా? కొత్తవారికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాల్సిందే.

Advertisement

Next Story